ప్రసిద్హ విద్యావేత్త డీఎస్ కొఠారి అన్నట్లు ‘‘చడువులోని ప్రాధమిక దశలోనే శాస్త్రవిజ్ఞానంలోని ప్రాధమిక భావనలుంటాయి. విద్యార్ధి క్లాస్ రూం బయట మాతృభాషలో కలిగే శాస్త్ర విజ్ఞాన అనుభవాలకు, క్లాస్ రూంలో భావనలకు, పరాయి భాషలో చెప్పే విజ్ఞాన భావనలకు పొంతన అందక, సమన్వయం కుదరక అతని అవగహన విస్తృతం కాదు. చివరికి శాస్త్రం మీదే కాక చదువు మీద కూడా ఆసక్తి సన్నగిల్లుతుంది’’. చిరకాలంగా ఇదే ధోరణిలో ఉచిత సలహాలివ్వడం జరుగుతున్నది.

కానీ ‘మాతృభాషలో శాస్త్ర విజ్ఞాన అనుభవాలతో’ ఇంత వరకు నమూనాగా వాచకాన్ని మాత్రం తయారుచేయలేదు. సహజవనరులు క్షీణించడం వల్ల, గత రెండు దశాబ్దాలుగా ఈ సంప్రదాయ నైపుణ్యాలకు, వారి మనుగడకు అవసరమైన జీవవైవిధ్య వనరులమీద స్థానిక ప్రజలకు హక్కులిస్తూ ప్రభుత్వాలు చట్టాలు చేస్తున్నాయి. అభివృద్ధిని సుస్థిర అభివృద్ధిగా, దిశను మార్చడానికి ప్రయత్నం కూడా చేస్తున్నాయి. శ్రీకాకుళం జిల్లాలో బీల-తంపర (ఊట) భూములలో థర్మల్ పవర్ ఫాక్టరీ నిర్మాణం తగదని జీవవైవిధ్య చట్టాన్ని రక్షించటానికి ఏర్పడిన జాతీయ హరిత ట్రిబ్యునల్ తీర్పు ఇచ్చింది.

జనంలో తరతరాలుగా పాతుకుపోయిన ఈ నుడికారం ఉద్యమాన్ని ప్రజలలోకి తీసుకుపోవడంలో కీలక పాత్ర పోషించింది. పంచాయతీల ద్వారా ఇటువంటి వనరులను గుర్తించనందుకు ట్రిబ్యునల్ తప్పు పట్టింది. అటువంటి గుర్తింపు, ఆ భూసేకరణ ప్రతిపాదనలకు బహిరంగ చర్చ (పబ్లిక్ హియరింగ్) తప్పనిసరి అని స్పష్టం చేసింది. భూసేకరణ ఆపుచేయడం సరే, ఆ వనరులను ‘సుస్థిర అభివృద్ధి’ కోసం తరతరాలుగా ఎలావాడుకుంటున్నారో తెలియచేసే నుడికారాన్ని సేకరించి వాటి గుర్తింపును బలోపేతం చేస్తూ పర్యావరణ హితానికి, జానపద విజ్ఞానవేత్తలు, సామాజిక స్పృహతో పండిపోయిన మేధావులు, రచయితలు ప్రయత్నం చేయాల్సి ఉంది. ఇదే క్రమంలో పాశ్చ్యాత్య విజ్ఞానానికి సమాంతరంగా జానపద విజ్ఞానాన్ని నిలబెట్టాలి. లేకపోతే, అభివృద్ధికి బదులు సుస్థిర అభివృద్ధి, హరిత విప్లవానికి బడులు సతత హరిత విప్లవం అనే దిద్దుబాటు చర్యలు కూడా పాశ్చాత్యులు నిర్దేశించిన బాటలోనే అమలౌతుంటాయి.

ప్రజలు భూసేకరణకు వ్యతిరేకంగా పోరాడుతున్నంతగా, జీవవైవిధ్యం గల ఉమ్మడి వనరుల గుర్తింపు కోసం ప్రయత్నించడం లేదు. తగిన వివరాలతో దరఖాస్తునింపి అధికారులకిచ్చి పని అయ్యేదాకా పట్టు పట్టటం లేదు. ఎవడు తిరుగుతాడు! గుర్తింపు ఉంటే మాత్రం ప్రభుత్వం ఏదో తొండి ఆట ఆడి లాక్కోకుండా ఉంటుందా? అంటూ ముందరికాళ్ళకు తామే బందం వేసుకుంటూ గుద్దులాడుకుంటారు. ఇప్పటిదాకా సహజ వనరులమీద పెత్తనం చలాయించిన అధికారులు, ప్రభుత్వాలు తమ పట్టు వదులుకోరు. తూతూ మంత్రంగా ఇటువంటి చట్టాలను అమలు జరిపి చేతులు దులుపుకొనే ప్రయత్నం చేస్తుంటాయి.

ప్రభుత్వం అమలు చేయటం లేదు, రాజ్యస్వభావం ఇంతేనంటూ జానపద విజ్ఞానవేత్తలు కూడా ఖండనపర్వం రక్తి కట్టిస్తూ చప్పట్లు కొట్టించుకుంటున్నారే కాని, బళ్ళో పాఠాల దగ్గర నుంచి, చట్టాల అమలువరకు తాము నిర్వహించవలసిన పాత్రగూర్చి సమీక్షించుకోడం లేదు. బీల తంపరలలాగే అటవీ హక్కుల గుర్తింపులో చేవడి బస మగనాలిమెట్ట వంటి గిరిజన సంస్కృతిలో కీలకమైన వాడుకలను ప్రభుత్వం పట్టాదార్ పాస్ పుస్తకాలమీద ముద్రించింది. అటువంటి పదసంపద సేకరించి సర్క్యులర్లు జారీచేసింది. మన బడులలో చెప్పే పాశ్చాత్య జ్ఞానానికి సమాంతరంగా, గిరిజనుల అటవీ విజ్ఞానాన్ని, జాలరుల సంప్రదాయ సరిహద్దుల పటాలను, వారు రాసుకున్న సాహిత్యాన్ని ప్రచురించి నడుస్తున్న చరిత్ర, అమ్మనుడి పత్రికలు ‘బతుకుతెరువులు పట్టించుకోకుండా భాషను బతికించుకోలేం’ అనే పిలుపునిచ్చి యధాశక్తి తోడ్పడుతున్నాయి. చట్టాలలో పేర్కొన్న మాత్రాన సరిపోదు, బడిలో ప్రత్యక్షం గానో, పరోక్షం గానో ఈ చదువు చెప్పాలి. ప్రభుత్వముద్ర ఉంటే తప్ప ఉపాధ్యాయులు దృష్టి పెట్టరు.

గిరిజనుల జ్ఞానాన్ని సార్వత్రిక విద్యలో భాగంగా చేసే ప్రయత్నంలో, అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజీకి అనుబంధంగా ఉన్న సెంటర్ ఫర్ పబ్లిక్ ఇన్నోవేషన్స్, శక్తి తయారు చేసిన ఈ వాచకాన్ని ప్రధానోపాధ్యాయులకు కరదిపికగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ గిరిజన సంక్షేమ శాఖకు అందచేసింది. ‘‘ప్రభుత్వం అన్ని పాటశాలలకు ఒకే కర్రిక్యులం నిర్ణయించినందువల్ల వివిధ ప్రాంతాల, వివిధ సంస్కృతుల, వివిధ ప్రజాసమూహాల ప్రత్యేక అవసరాలకు తగినంత ప్రాధాన్యత ఇవ్వటం సాధ్యం కాదు. గిరిజనుల కోసం వారి అవసరాలను తీర్చే విధంగా పాఠ్య పుస్తకాలు రూపొందే పరిస్థితి ప్రస్తుతం లేకపోవచ్చు. కానీ ఉన్న పాఠ్య పుస్తకాలను గిరిజనుల అవసరాలకు తగ్గట్టుగా వినియోగించుకోటానికి విద్యాశాఖ అడ్డుచెప్పదు సరికదా, అటువంటి వ్యూహాలను మనసారా స్వాగతిస్తుంది.

ఇక్కడే ప్రధానోపాధ్యాయుడి పాత్ర, ఉపాధ్యాయుడి పాత్ర ఎంత ముఖ్యమో మనం అర్థం చేసుకోవచ్చు’’ అని ఈ వాచకం ప్రధానోపాధ్యాయులకు సూచించింది. ‘‘విద్యార్ధులకు తన చుట్టూవున్న పరిసరాల గురించిన పరిజ్ఞానాన్ని ఒక క్రమపద్ధతిలో స్థూలస్థాయినుంచి మరింత సూక్ష్మ స్థాయికి అందించటం పాఠ్య ప్రణాళికలోని ముఖ్యాంశం. ఈ విధంగా తెలిసిన విషయాల నుండి తెలియని విషయాలకు విద్యార్ధికి మార్గదర్శకత్వం అందించే క్రమంలో ఆ యా విషయాలు బోధించే ఉపాధ్యాయులు వీలైన చోటల్లా గిరిజన సామాజిక పరిసరాలను ప్రాకృతిక పరిసరాలను ఆధారం చేసుకుని బోధన చేయవచ్చు’’ అని కూడా విశదీకరించింది. ఈ వాచకంలో విషయ సూచిక ‘ఈ పుస్తకం ఎందుకు 1. గిరిజన ప్రాంతాల్లో ప్రకృతి, సంస్కృతి, జీవవైవిధ్యం, 2. గిరిజన సమాజం, 3. గిరిజన ఆర్ధిక వ్యవస్థ, 4. గిరిజన ప్రాంతాల చరిత్ర పాలన, 5. ప్రధానోపాధ్యాయులకు సూచనలు, గిరిజన సంస్కృతిని గూర్చి ఇంకా తెలుసుకోవాలనుకుంటే అనుబంధంలో ’ చదవలసిన పుస్తకాల జాబితా, ప్రసిద్ధ వ్యక్తుల జీవిత విశేషాలు, గిరిజనుల జ్ఞానాన్ని శాస్త్రజ్ఞులు ఉపయోగించుకుంటున్న ఉదాహరణలు వంటివి పాఠ్య క్రమాన్ని తెలియచేస్తాయి.

ఈ వాచకం మూడవ తరగతి నుండి పదో తరగతి వరకు సామాన్య శాస్త్రం, సాంఘిక శాస్త్రంతో పాటు ఆయా అంశాలను ఎలాకలుపుకొని చెప్పాలో ‘ప్రకృతి సంస్కృతి జీవవైవిధ్యం అధ్యాయాన్ని- సామాన్య శాస్త్రం, జీవ భౌతిక శాస్త్రాలతో, గిరిజన ఆర్ధిక వ్యవస్థ అధ్యాయాన్ని- సాంఘిక శాస్త్రంలోని అర్ధశాస్త్రంతో, గిరిజన సమాజం, గిరిజన ప్రాంతాల చరిత్ర,-పౌరశాస్త్రాలతో కలుపుకుంటూ చెప్పాలని వివరించింది. వారు వాడే కొన్ని పదాలైనా గుర్తు చేయకపోతే, మనం ఏం అడుగుతున్నామో గ్రామీణులకు అర్ధం కాదు. కొన్ని పదాలు, పలుకుబడులు అందిస్తే, వారు మరిన్ని చెప్పగలరు. అలా గిరిజన పెద్దలతో ముచ్చటించటానికి ఈ వాచకం ఒక సూచికగా పనికి వస్తుంది, దీనితో పాటు, వారిలో ఆట పాటలలో అందెవేసిన వారిని బడికి పిలిచి కథలు చెప్పించడం, నేర్పించడం, వారితో అడవిలో తిరిగి పిట్టలు పురుగులు, చెట్టు పుట్టలు, జంతువులు కాపురంచేసే మట్టలు, డొంకలు, పొదలు, పిల్లలకు చూపించటం వంటి ప్రయత్నాలు గ్రామాన్ని బడికి దగ్గరచేస్తాయని నొక్కి చెపుతుంది. ప్రతి అధ్యాయం తూర్పు కనుమలను రెండు భాగాలు ఉత్తరాది, దక్షిణాదిగా విభజిస్తూ, ఆ రెండు ప్రాంతాల ప్రకృతి సంస్కృతులను వివరిస్తుంది.

ఉత్తరాది తూర్పు కనుమలు అంటే అత్యధిక వర్షపాతం పొందే శ్రీకాకుళం నుండి పశ్చిమ గోదావరి వరకు వేణం, లొద్ది, లంక, లోయలు బయళ్ళతో నిండిన మన్యం అడవి దున్నలకు ఆశ్రయం. పోదు వ్యవసాయం ఇక్కడి తెగలకు ప్రధాన జీవనాధారం. తక్కువ వర్షపాతం గల రాతినేలలతో నిండిన దక్షిణాది కనుమలు అంటే రాయలసీమలో సరి, సెల, కురవ, కట్టువ, సరవ, బరకలలో గడ్డి మైదానాలు పులులు, వాటి బారిన పడే శాకాహార జంతువులు, ఆహారం సేకరించుకుంటూ పశువులు కాసే జాతులతో నిండిన నల్లమల ఎర్రమల వెలిగొండ పాలకొండ, శేషాచలంలో విశేషాలను పేర్కొంటుంది.

నెలలు పండుగలు ప్రణాళికలు, సంప్రదాయక పంచాయతీ వ్యవస్థ, పర్యాటక చారిత్రక ప్రదేశాలు పట్టికగా, గ్రామ సరిహద్దుల మధ్యలో ఉన్న వనరుల పేర్లు పటాలుగా చేర్చింది. ప్రసిద్ధ వ్యక్తులు, గిడుగు, విక్రమదేవవర్మ, అల్లూరి సీతారామరాజు, వెన్నెలకంటి రాఘవయ్య, హైమెండర్ఫ్, స్వామి బాలానంద వగైరా జీవితాలను పరిచయం చేస్తుంది. జ్ఞానాన్ని గూర్చి శాస్త్రవేత్తలకు, కళాకారులకు ఎవరి అభిప్రాయాలు వారికున్నాయి. ఆ విభిన్న దృక్పధాలను జాతిలో తరతరాలుగా వచ్చేది జ్ఞానం, దానిని గుర్తించటం అభిజ్ఞానం. దాన్ని రసాత్మకంగా చెపితే కావ్యం. జానపదుడి, గిరిజనుడి జ్ఞానపందా ఒక కావ్యం.

నేటి మానవశాస్త్రం వలెనే మన సాంఖ్య దర్శనం పకృతి పురుషుల మధ్య వర్ధిల్లే జ్ఞాన స్వరూపాన్ని విస్తృతంగా చర్చించింది. ప్రజలు వేళలు, రుతువులు చెపుతుంటే శాస్త్రవేత్తలు గడియలు, కార్తెలు గంటలలో తెలియచేస్తారు. ప్రజలు స్థలాల పేర్లు చెపుతుంటే శాస్త్రజ్ఞులు అక్షాంశాలు, రేఖాంశాలు అంటూ ఒక ఉహాజనిత పరిభాషలో ప్రపంచానికి తెలియచేస్తారు. సంస్కృతి కూడా ఆయా వనరులకు అధిదేవతలను గుర్తించి భయభక్తులతో నడుచుకుంటుంది. వాటిచుట్టు కర్మకాండ సాహిత్యం అల్లుకునే తీరుతెన్నులు ప్రపంచమంతా ఒక్కతీరుగనే ఉంటాయి. శిలాజం లక్షల ఏళ్ల పరిణామాలను నిక్షిప్తం చేసుకున్నట్లే పురాగాధ చరిత్రను పొదువుకుంటుంది. కర్మకాండ, ఆ చరిత్రను అభినయించే దృశ్యరూపకంగా సాంస్కృతిక మానవశాస్త్రవేత్తలు విశ్లేషిస్తున్నారు అని తులనాత్మకంగా సమన్వయించింది.

అప్పుగా ఒక దేశం ఇచ్చే పెట్టుబడి, మరో దేశం సాంకేతిక జ్ఞానం, వెనుకబడిన దేశాల సహజవనరులు కొల్లగొట్టే మార్కెట్ శక్తులు అభివ్రుద్ధిమంత్రంతో మురిపెస్తుంటే, ఫ్రముఖ మానవశాస్త్రవేత్త లెవిస్త్రాస్ చెప్పినట్లు ఉన్న వస్తువులతోనే కొత్తపరికరాలను తయారు చేసే మాట్లు వేసే వాడి నైపుణ్యం వలె సుస్థిర అభివృద్ది పరుగెత్తి పాలుతాగకుండా నిలబడి నీళ్ళు తాగమని హితవు చెపుతుంది. ‘మిగిలిన ప్రాంతాలతో పోలిస్తే గిరిజన ప్రాంతాలు ఎంతో జీవవైవిధ్యం కలిగి ఉంటాయి. ఇతర విద్యార్దులతో పోలిస్తే గిరిజన పిల్లలలో పరిసరజ్ఞానం అంటే చెట్లు, జంతువులు, పిట్టలు, భూగోళం, రుతువుల జ్ఞానం, విల్లమ్ములు, వలలు, వాద్యపరికరాలు, సాధనాలను వాడే, ఆటపాటలలో సామర్ధ్యం అధికంగానే ఉంటాయి.

సంప్రదాయంలో ఇమిడి ఉన్న శాస్త్ర విజ్ఞానం తెలుసుకోడంవల్ల మన ఆలోచనల అధ్యయన విధానాల పరిధి విస్తరిస్తుంది. సమాజంలో అందరికి తెలిసిన కధలు, ఆటపాటలతో నిండిన సంప్రదాయ జ్ఞానాన్ని కలుపుకుంటూ చేసే బోధన ఉత్సాహంగా ఉల్లాసంగా సాగుతుంది. సమాజం పాఠశాలల మధ్య సంబంధాలు బలపడతాయి. గిరిజనులలో న్యూనతభావాన్ని తగ్గించి ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. చట్టాల అమలుకు తగిన చైతన్యం పెరుగుతుంది’ అని స్పష్టంచేసింది. గిరిజనులను అధ్యయనం చేసే మానవ శాస్త్రవేత్తలకు సాహిత్య రూపంలోగల సంప్రదాయ జ్ఞానంపై అవగాహన ఉండదు. భాషా శాస్త్రవేత్తలకు మానవ శాస్త్ర దృష్టి తక్కువ. ఈ ఇరువురికీ శాసన కార్య నిర్వాహక వర్గాలతో పరిచయం ఉండదు.

ఈ మూడు విభాగాలలో జరుగుతున్న కృషిపట్ల అవగాహన పెంచుకునే అవకాశం గ్రామాలలో పనిచేసే ఉపాధ్యాయులకు ఎక్కువ. ఈ ఎరుకవల్ల వారు ఆయా వర్గాల నుండి వచ్చే విద్యార్ధులకు ఆత్మీయు లౌతారు. భావిపౌరులను తయారు చేస్తారు’ అంటూ ముందుమాట వంటి ‘ఈ పుస్తకం ఎందుకు’లో పేర్కొంటారు. చిరుధాన్యాల సాగు, పాలేకర్ పద్ధతిలో సాగు వంటి పాతపద్ధతులను పత్రికల ప్రామాణిక భాషలో ప్రచారం చేస్తున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే, జనం నుడికారంతో మమేకం కాలేని ఈ ప్రచారాలు జనసామాన్యంలోకి వెళ్ళడం లేదు. మాండలిక వృత్తి పదకోశాలు, జానపద సాహిత్యం ఈ విధంగా చాలా కృషి జరిగింది. కాబట్టి జానపద విజ్ఞానవేత్తలు ఇటువంటి వాచకాలు తయారుచేసి వ్యవసాయ రంగం పట్ల ఆసక్తి పెంచాలి. ప్రభుత్వపథకాలు ప్రజలు సొంతం చేసుకోవటంలో కీలక పాత్ర పోషించాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here