ఇస్లామాబాద్: పాకిస్థాన్ పార్లమెంట్‌ ఎన్నికల్లో ఊహించని ఫలితాలు వెలువడ్డాయి. కాకలుతీరిన రాజకీయ విశ్లేషకులు కూడా అంచనా వేయలేని విధంగా కీలక నేతలకు షాక్ ఇస్తూ గెలుపోటములు నమోదయ్యాయి. ఈ ఎన్నికల్లో ప్రఖ్యాత క్రికెట్ స్టార్ ఇమ్రాన్‌ఖాన్‌కు చెందిన పాకిస్థాన్ తెహ్రీక్-ఏ-ఇన్సాఫ్ (పీటీఐ) పార్టీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. పార్టీని స్థాపించిన 22 ఏళ్ల తర్వాత ఇమ్రాన్‌ఖాన్ అధికారాన్ని చేపట్టబోతుండగా, రిగ్గింగ్ ద్వారా మాత్రమే పీటీఐ ఈ ఫలితాలు సాధించిందని ప్రత్యర్థి పార్టీలు విమర్శిస్తున్నాయి. ఇక ప్రస్తుతం జైల్లో ఉన్న పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్‌కు చెందిన పాకిస్థాన్ ముస్లిం లీగ్-నవాజ్ (పీఎంఎల్-ఎన్) 49 స్థానాల్లో గెలుపొందింది.

మరోవైపు, మాజీ దేశాధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీకి చెందిన పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ (పీపీపీ) 23 సీట్లను గెలుపొంది. సంప్రదాయ, మతవాద పార్టీల కూటమి ముత్తహిదా మజ్లిస్-ఏ-అమల్ (ఎంఎంఏ), ఎంక్యూఎం పార్టీలు నామమాత్రపు స్థానాలను దక్కించుకున్నాయి. ప్రధాన పార్టీలు పీఎంఎల్‌ఎన్, పీపీపీ పోలింగ్‌లో రిగ్గింగ్ జరిగిందని, ఓట్ల లెక్కింపులో పారదర్శకత లోపించిందని ఆరోపిస్తున్నాయి. సైన్యమే ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసిందని నవాజ్‌ షరీఫ్ సోదరుడు షాబాజ్ షరీఫ్ విమర్శించారు. కాగా, రిగ్గింగ్ ఆరోపణలను ప్రధాన ఎన్నికల కమిషనర్ మహమ్మద్ రజాఖాన్ కొట్టిపారేశారు.

తమకు ఒక్క ఫిర్యాదు కూడా రాలేదని, ఎన్నికలు పారదర్శకంగా జరిగాయని చెప్పారు. ఇక 272 మంది ఎంపీలకుగాను 137మంది సభ్యులను కలిగి ఉన్న పార్టీ అతిపెద్ద పార్టీగా అవతరిస్తుంది. ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎన్నికైన మొత్తం 172 మంది ఎంపీల మద్దతు కలిగిన పార్టీయే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలుగుతుంది. ఒకవేళ పీటీఐ 118 స్థానాల వద్దే ఆగిపోతే, ప్రభుత్వ ఏర్పాటుకు మరో 19 మంది సభ్యుల మద్దతు అవసరమవుతుంది. సైన్యానికి బాసటగా నిలిచే ఎంఎంఐ, ఎంక్యూఎం పార్టీలు ప్రభుత్వ ఏర్పాటులో ఇమ్రాన్‌ఖాన్‌కు మద్దతివ్వవచ్చన్న ఊహాగానాలు వెలువడుతున్నాయి.

ప్రస్తుత ఎన్నికల ఫలితాలు పలువురు రాజకీయ దిగ్గజాలకు కోలుకోలేని షాక్ ఇచ్చాయి. మాజీ ప్రధాని షాహిద్ ఖాకన్ అబ్బాసీ, పీఎంఎల్‌ఎన్ అధ్యక్షుడు షాబాజ్ షరీఫ్, ఛాందసవాద సంస్థ జమాత్-ఈ-ఇస్లామి నేత సిరాజుల్ హక్ వంటివారు ఈసారి ఓటమిపాలవక తప్పలేదు. మరోవైపు పీటీఐ పార్టీ అధినేత ఇమ్రాన్‌ఖాన్ సరికొత్త చరిత్ర సృష్టించారు. తన పార్టీని ఆధిక్యంలో నిలబెట్టడమే కాక తను పోటీచేసిన ఐదుస్థానాల్లోనూ విజయంసాధించి రికార్డు నెలకొల్పారు. 70 ఏళ్ల పాకిస్థాన్ రాజకీయ చరిత్రలో ప్రజాస్వామ్యయుతంగా అధికారమార్పిడి జరుగడం ఇది రెండోసారి.

1947 స్వాతంత్రం వచ్చిన తర్వాతి సగం రోజులు పాక్ మిలిటరీ ప్రభుత్వాల ఆధీనంలోనే కొనసాగింది. తొలిసారిగా పీపీపీ నేత ఆసిఫ్ అలీ జర్దారీ అధ్యక్షుడిగా 2008 నుంచి 2013వరకు పూర్తికాలపు ప్రభుత్వాన్ని నడిపించారు. ఇది పాక్ చరిత్రలో ఓ రికార్డు. తర్వాత కూడా పార్టీల మధ్య అధికార మార్పిడి జరగగా, మళ్లీ తాజా ఎన్నికల్లో అదే సందర్భం ఎదురైంది.

ఇమ్రాన్‌ఖాన్‌కు అభినందనలు చెబుతూ ఆయన మొదటి భార్య జెమీమా ట్వీట్ చేసింది. 22 ఏళ్లుగా ఎన్నో అవమానాలు, అవరోధాలను ఎదుర్కొని, త్యాగాలు చేసిన తర్వాత తన తనయుల తండ్రి పాకిస్థాన్‌కు ప్రధానమంత్రి కాబోతున్నారని, ఎట్టిపరిస్థితుల్లోనూ ఓటమిని అంగీకరించని మనస్తత్వానికి ఈ విజయం నిదర్శనం అని ఫలితాల అనంతరం జెమీమా ట్వీట్ చేసింది. మరోవైపు, పాకిస్థాన్ నాశనానికే ప్రజలు ఇమ్రాన్‌ను గెలిపించారని మరో మాజీ భార్య రెహెమ్‌ఖాన్ పేర్కొన్నారు.

ఇదిలావుండగా, భారత్‌తో సత్సంబంధాలు కొనసాగించేందుకు తాము సిద్ధమేనని తెహ్రీక్-ఏ-ఇన్సాఫ్ పార్టీ అధినేత ఇమ్రాన్‌ఖాన్ తెలిపారు. కశ్మీర్ సహా పలు కీలక అంశాల పరిష్కారానికి ద్వైపాక్షిక చర్చలకు ప్రయత్నిస్తామని చెప్పారు. పాక్ సార్వత్రిక ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా అవతరించి, ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవుతున్నది. ఈ తరుణంలో ఇమ్రాన్‌ఖాన్ ఇస్లామాబాద్‌లో ప్రజలనుద్దేశించి మాట్లాడారు. శాంతిదిశగా భారత్ ఒక అడుగు ముందుకు వేస్తే, మేం రెండడుగులు ముందుకు రావడానికి సిద్ధమే అని పేర్కొన్నారు. తనకు వ్యక్తిగతంగా భారత్‌లో చాలామంది తెలుసని, క్రికెట్ కారణంగానే ఆ పరిచయాలు తనకు దక్కాయని, ఇరుదేశాల మధ్య కశ్మీర్ ప్రధాన సమస్యగా ఆయన పేర్కొన్నారు.

చర్చల ద్వారా మాత్రమే ఇరుపక్షాలు దానికి పరిష్కారం కనుగొనగలవు అని ఇమ్రాన్ తెలిపారు. భారత్‌తో సంబంధాల పునరుద్ధరణను కోరుకుంటున్నామని, అక్కడి నాయకత్వం కూడా అదే కోరుకుంటుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. కశ్మీర్‌పై పాకిస్థాన్, బలూచిస్తాన్‌పై భారత్ పరస్పరం నిందలకు దిగడం వల్ల ఇరుదేశాలకూ ఒరిగేదేమీ లేదని, వాటిపై ఎంత వాదించుకున్నా మళ్లీ మొదటికే వస్తామని, ఇరుదేశాల ఎదుగుదల ఈ పరస్పర నిందలు ఎంతమాత్రం పనిచేయవు అని ఆయన పేర్కొన్నారు. ఇరుదేశాల మధ్య వాణిజ్య సంబంధాలు మరింత మెరుగుపడాలని ఆయన ఆకాంక్షించారు. గత కొద్దివారాలుగా భారత మీడియా తనను బాలీవుడ్ విలన్‌లా చూపించిందని ఇమ్రాన్ తెలిపారు.

చైనా-పాక్ సంబంధాలు మరింత బలోపేతం కావాలని కోరుకుంటున్నామని చెప్పారు. ప్రధాని అధికారిక నివాసాన్ని విద్యాసంస్థగా మారుస్తానని ఇమ్రాన్ తెలిపారు. దేశ ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు రాజసౌధం తనకు అవసరంలేదని అన్నారు. పాకిస్థాన్‌కు సేవచేసే అవకాశాన్ని 22 ఏళ్ల పోరాటం తర్వాత అల్లా తనకు అందించాడని ఇమ్రాన్‌ఖాన్ అన్నారు. జిన్నా ఆశయాల్ని నెరవేర్చేందుకే తాను రాజకీయాల్లోకి వచ్చినట్లు ఆయన చెప్పారు. కాగా, మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది, ముంబై పేలుళ్ల సూత్రధారి హఫీజ్ సయీద్ మద్దతిచ్చిన అల్లాహో అక్బర్ తెహ్రీక్ (ఏఏటీ) పార్టీని పాక్ ఓటర్లు గట్టి దెబ్బ కొట్టారు.

ఈ ఎన్నికల్లో ఆ పార్టీ ఊసే లేకుండా పోయింది. ఆ పార్టీకి చెందిన కనీసం ఒక్క అభ్యర్థి ఎక్కడా ముందంజలో కూడా లేరు. ముంబై దాడుల సూత్రధారి, నిషేధిత ఉగ్రవాద సంస్థ జమాతే ఉద్ దవా (జేయూడీ) చీఫ్ హఫీజ్ సయీద్ లాహోర్‌లోని వఫాకి కాలనీలో తన ఓటుహక్కును వినియోగించుకున్నాడు. ఈ సందర్భంగా పాక్ సైద్ధాంతిక భావజాలానికే ఓటు వేయాలంటూ ప్రజలకు పిలుపునిచ్చాడు. జేయూడీపై నిషేధం విధించడంతో తన రాజకీయ ముసుగైన మిల్లీ ముస్లిం లీగ్(ఎంఎంఎల్) పార్టీ పేరుతో 260 మంది అభ్యర్థులను ఆయన బరిలో దింపాడు.

వీరిలో హఫీజ్ కుమారుడు తల్హా సయీద్, అల్లుడు ఖలీద్ వాలీద్ కూడా ఉన్నారు. పాక్‌కు వ్యతిరేకంగా కుట్రలు చేస్తున్న హానికర శక్తులకు ఎన్నికల్లో తగిన బుద్ధిచెప్పాలని ఆర్మీ చీఫ్ జనరల్ ఖమర్ జావేద్‌ బజ్వా పిలుపునిచ్చారు. రావల్పిండిలో తన భార్యతో కలిసి ఆయన ఓటేశారు. ‘‘పాక్‌కు వ్యతిరేక శక్తుల ఆగడాలకు చెక్ పెట్టేందుకు సిద్ధంగా మేం ఉన్నాం. దేశ ప్రజలంతా శత్రువుకు గుణపాఠం చెప్పాలి’’ అని బజ్వా ట్విట్టర్‌లో పిలుపునిచ్చారు. ఎన్నికల్లో మైనార్టీలు తమ ఓటుహక్కును వినియోగించుకోకుండా అడ్డుకున్నారని, వారి ఓట్లు పెద్దసంఖ్యలో గల్లంతయ్యాయని స్థానిక మీడియా వెల్లడించింది.

ముఖ్యంగా ఇస్లామాబాద్‌లోని ఎన్‌ఏ-54 నియోజకవర్గంలో మైనార్టీలైన హిందూ, క్రైస్తవ, అహ్మదీ తదితర మతాలకు చెందిన వారిని ఓటు వేయకుండా అడ్డుకున్న సంఘటనలు చోటుచేసుకున్నాయని మీడియా తెలిపింది. పాక్‌లో ప్రజాస్వామ్యయుత ప్రభుత్వం ఏర్పడాలని భారత్ కోరుకుంటోందని జమ్ము కశ్మీర్ మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ అన్నారు. అక్కడ స్థిరమైన ప్రభుత్వం ఏర్పడాలని ఆకాంక్షిస్తూ ట్విట్టర్‌లో ఆమె పోస్టు చేశారు. రహస్య ఓటింగ్ నిబంధనలను ఉల్లంఘించి బహిరంగంగా ఓటు వేశారంటూ మాజీ క్రికెటర్, తెహ్రీక్-ఎ-ఇన్సాఫ్ పార్టీ అధ్యక్షుడు ఇమ్రాన్‌ఖాన్‌కు పాకిస్థాన్ ఎన్నికల కమిషన్ (ఈసీపీ) సమన్లు జారీచేసింది. ఈ నెల 30న వ్యక్తిగతంగా తన ఎదుట హాజరై వివరణ ఇవ్వాలని ఆదేశించింది.

ఈ నేపథ్యంలో ఇమ్రాన్ ఓటును రద్దు చేసే అవకాశం కూడా ఉందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఇస్లామాబాద్‌లోని ఓ పోలింగ్ స్టేషన్‌లో ఆయన మీడియా సమక్షంలో తన ఓటుహక్కును ఉపయోగించుకోవడంపై ఈసీ ఆగ్రహం వ్యక్తంచేసింది. పోలింగ్ కేంద్రం వద్ద మీడియాతో మాట్లాడినందుకు పీఎంఎల్-ఎన్ అధ్యక్షుడు నవాజ్‌షరీఫ్, మాజీ మంత్రి ఖ్వాజా అసిఫ్‌లపైనా ఈసీ ఆగ్రహం వ్యక్తంచేసింది.