• విషాదయాత్రగా మారిన వీకెండ్ విహారయాత్ర

  • బస్సు లోయలోపడి 32 మంది దుర్మరణం

  • మహారాష్ట్ర సతారా జిల్లాలో దారుణం

  • బాధ్యులపై చర్యలకు ఆదేశించిన సర్కారు

  • బాధిత కుటుంబాలకు బాసటగా నిలుస్తామని హామీ

  • ట్విటర్ వేదికగా ప్రధాని మోదీ, రాహుల్ గాంధీ దిగ్భ్రాంతి

ప్రత్యేక బస్సులో విహారయాత్రకు బయలుదేరిన ముందు తీసుకున్న ఫొటో

ముంబయి: వర్షాల వల్ల అతలాకుతలమైన మహారాష్ట్రను ప్రకృతి ఇంకా పట్టిపీడిస్తూనే ఉంది. తాజాగా రాష్ట్రంలో జరిగిన ఓ ఘోర రోడ్డు ప్రమాదంలో ఏకంగా 32 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు. విహారయాత్రకు సందర్శకులను తీసుకువెళ్లిన ప్రయివేటు బస్సు ఒకటి అదుపుతప్పి లోయలో పడ్డంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. మహారాష్ట్ర సతారా జిల్లాలో చోటుచేసుకున్న ఈ దారుణంపై యుద్ధప్రాతిపదికన విచారణకు ఆదేశించిన మహారాష్ట్ర ప్రభుత్వం బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని, బాధిత కుటుంబాలకు బాసటగా నిలుస్తామనీ అభయమిచ్చింది.

సుమారు 35 మందితో వెళ్తున్న ప్రైవేటు బస్సు ఒక్కసారిగా అదుపుతప్పి సమీప లోయలో పడింది. దీంతో 32 మంది మృతి మృత్యువాత పడ్డారు. అంబేనలి ఘాట్‌లో పొలందపూర్‌ సమీపంలో శనివారం ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న అధికారులు, పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు.

వారాంతపు సెలవులు కావడంతో కొంకణ్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయానికి చెందిన 33 మంది సిబ్బందితో పాటు డ్రైవర్‌, క్లీనర్‌ మొత్తం మహాబలేశ్వరం విహార యాత్రకు బయల్దేరి వెళ్లారు. మార్గ మధ్యలోనే బస్సు అకస్మాత్తుగా ప్రమాదానికి గురైంది. సుమారు 800 అడుగుల లోతులో పడటంతో బస్సు నుజ్జునుజ్జయింది. బస్సు లోయలో పడేముందే అప్రమత్తమైన ఓ వ్యక్తి అందులోంచి బయటకు దూకి ప్రాణాలతో బయటపడ్డాడు. మిగిలిన వారంతా ప్రాణాలు కోల్పోయారు.

ఆ ప్రాంతంలో జనసంచారం పెద్దగా లేకపోవడంతో ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆ వ్యక్తి బయటకు వచ్చి అక్కడి స్థానికులకు చెప్పాడు. దీంతో పోలీసు అధికారులు, అగ్నిమాపక సిబ్బంది యుద్ధప్రాతిపదికన సహాయక చేపట్టారు. ఇప్పటివరకు 15 మంది మృతదేహాలను బయటకు వెలికి తీశారు. స్థానిక ఎమ్మెల్యే అక్కడికి చేరుకొని మృతుల వివరాలను తెలుసుకొనే ప్రయత్నం చేశారు. మృతులంతా కొంకణ్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయానికి చెందినవారిగా ఆయన మీడియాకు వెల్లడించారు. వెలికి తీసిన మృతదేహాలకు శవపరీక్ష నిర్వహించి వారి బంధువులకు అప్పగించనున్నట్లు పోలీసులు చెప్పారు. మృతుల్లో కొందరు రత్నగిరి, తదితర ప్రాంతాలకు చెందినవారిగా గుర్తించారు.

బస్సు బోల్తా పడింది ఈ లోయలోనే.

తన కళ్ల ముందు జరిగిన ఈ ఘోర విషాదం నేపథ్యంలో ప్రాణాలతో బయటపడిన ఒకే ఒక వ్యక్తి ఇంకా ఆ షాక్‌ నుంచి తేరుకోలేదు. లోయ బాగా లోతుగా ఉండటంతో సహాయక చర్యలకు కొంత ఆటంకం నెలకొంది. కొన ఊపిరితో ఉన్న వారికి చికిత్స అందించేందుకు కావాల్సిన మందులు, వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచారు. మహారాష్ట్ర రాజధాని ముంబయికి దాదాపు 190 కిలోమీటర్ల దూరంలో ఈ దుర్ఘటన జరిగింది. విషాదం గురించి తెలిసిన వెంటనే రాష్ట్రపతి రామ్‌నాధ్ కోవింద్, ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, మహారాస్ట్ర ముఖ్యమంత్రి తదితరులు దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు.