• కోస్టుగార్డు అదనపు డీజీతో వీసీ భేటీ

  • సముద్రశాస్త్రం నిర్వహణకు ఒప్పందం

న్యూఢిల్లీ: ఇటీవల కాలంలో వివిధ జాతీయ, అంతర్జాతీయ స్థాయి సంస్థలతో కలిసి సరికొత్త కోర్సులను అందుబాటులోకి తీసుకువస్తున్న ఆంధ్ర విశ్వ విద్యాలయం తాజాగా మరో కొత్త కోర్సుకు శ్రీకారం చుడుతోంది. ఇప్పటికే ఇండియన్ ఎయిర్‌ఫోర్స్, ఇండియన్ ఆర్మీ, ఇండియన్ నేవీ వంటి సంస్థల ఉద్యోగులకు వివిధ స్థాయిల్లో బోధనకు సంబంధించి పలు జాతీయ స్థాయి అవగాహన ఒప్పందాలను కుదుర్చుకున్న ఏయూ తాజాగా భారత తీరగస్తీ దళం (ఇండియన్ కోస్టుగార్డు) ఉద్యోగుల కోసం సముద్ర శాస్త్రం కోర్సు నిర్వహణకు ఆ సంస్థ ఉన్నతాధికారులతో ఒప్పందం చేసుకుంది.

ఇందులో భాగంగా తీర ప్రాంత రక్షణ కోర్సు నిర్వహించనుంది. ఈ కొత్త కోర్సు నిర్వహించడానికి యూనివర్సిటీ ముందుకు రావడం పట్ల ఇండియన్ కోస్ట్‌‌గార్డ్‌ అదనపు డైరక్టర్‌ జనరల్‌ వి.ఎస్‌.ఆర్‌ మూర్తి హర్షం వ్యక్తం చేసారు. శనివారం న్యూఢిల్లీలోని కోస్ట్‌గార్డ్‌ హెడ్‌ క్వార్టర్స్‌లో తనను కలిసిన ఆంధ్రవిశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్ ఆచార్య జి. నాగేశ్వరరావుతో మూర్తి భేటీ అయ్యారు. ఏయూతో త్వరలోనే ఈ మేరకు అవగాహన ఓప్పందం చేసుకుంటామని ఆయన వెల్లడించారు.

ఏయూ అందించే కోర్సుల వలన కోస్ట్‌గార్డ్‌ సిబ్బంది ఎంతగానో లబ్దిపొందుతారని, అదే విధంగా దేశ రక్షణలో కోస్ట్‌గార్డ్‌ అత్యంత ప్రముఖ పాత్ర పోషిస్తుందని మూర్తి పేర్కొన్నారు. రక్షణ శాఖ త్రివిధ దళాల ఉద్యోగులకు ఏయూ డిగ్రీ, పీజీ, డిప్లమో, పీహెచ్‌డీ కోర్సులను అందిస్తోందని వైస్‌ ఛాన్సలర్‌ ఆచార్య నాగేశ్వరరావు వివరించారు. కోస్ట్‌కార్డ్‌ డిప్యూటీ ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ కె. శీతారాం, ప్రిన్సిపల్‌ డైరెక్టర్‌ గురుపదేశ్‌ సింగ్‌, ఏయూ పూర్వ విద్యార్థి సంఘం నేత డాక్టర్‌ షేక్‌ సులేమాన్‌ కార్యక్రమంలో పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here