విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న ఎఐసీసీ సభ్యుడు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర బీసీ సెల్ అధ్యక్షుడు నులుకుర్తి వెంకటేశ్వరరావు.
  • ఉమెన్ చాందీ పర్యటనకు భారీ ఏర్పాట్లు

కాకినాడ: కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడు, కేరళ మాజీ ముఖ్యమంత్రి ఉమెన్ చాందీ సోమవారం తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో పర్యటించనున్నారని ఎఐసీసీ సభ్యుడు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర బీసీ సెల్ అధ్యక్షుడు నులుకుర్తి వెంకటేశ్వరరావు చెప్పారు.

కాకినాడ రూరల్ మండలం చీడిగ గ్రామంలోని తన నివాసంలో ఆదివారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశంలోనే ఒకే నియోజకవర్గంలో 11 సార్లు కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేగా గెలిచిన ఘనత ఉమెన్ చాందీదన్నారు. ప్రస్తుతం కూడా ఆయన కాంగ్రెస్ ఎమ్మెల్యేగానే కొనసాగుతున్నారని, మొట్టమొదటిసారిగా తూర్పు గోదావరి జిల్లా పర్యటనలకు వస్తుండడంతో కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా ఘన స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు.

చాందీ సోమవారం అచ్చంపేట జంక్షన్‌కు ఉదయం 9.30 గంటలకు చేరుకుంటారని, అక్కడనుంచి భారీ ఎత్తున బైక్ ర్యాలీతో సూర్య కళామందిర్ రానున్నారని చెప్పారు. 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు అక్కడ జరిగే సభలో ఆయన ప్రసంగిస్తారని తెలిపారు.

అనంతరం జిల్లాలోని 19 నియోజకవర్గాలకు సంబంధించి నాయకులు, కార్యకర్తలతో కీలక భేటీ నిర్వహించి రానున్న ఎన్నికలకు మార్గదర్శకం చేస్తారన్నారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విధివిధానాల గురించి ప్రధానంగా ఆయన చర్చిస్తారని తెలిపారు.

ఆయనతోపాటు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు, మాజీ మంత్రి డాక్టర్ ఎన్.రఘువీరారెడ్డి, కేంద్ర మాజీ మంత్రులు ఎం.ఎం. పళ్లంరాజు, జేడీ శీలం, ఏఐసీసీ కార్యదర్శులు కృష్టాఫర్, గిడుగు రుద్రరాజు హాజరవుతారని తెలిపారు.

కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు వింజరపు సుబ్బారాయుడు, పబ్బినీడి కృష్ణ, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు వెలుగుబంటి సూరిబాబు, దమ్ము నూకరాజు, రూరల్ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు పిల్లి సతీష్, పీసీసీ జాయింట్ సెక్రటరీ దాట్ల గాంధీరాజు, ధూపం శంకర్ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here