ఏలూరు: జిల్లా అభివృద్ధిలో భాగంగా ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలను అమలు చేయడంలో సంబందిత అధికారులు పూర్తి బాధ్యతయుతంగా పనిచేయాలని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ కాటంనేని భాస్కర్‌ అన్నారు. స్థానిక కలెక్టర్‌ కార్యాలయంలో శుక్రవారం సీఎం హామీల అమలు తీరుపై సంబందిత అధికారులతో కలెక్టర్‌ కాటంనేని భాస్కర్‌ సమీక్షించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా అభివృద్ధికి ముఖ్యమంత్రి ప్రజలకు ఇచ్చిన హామీలు పూర్తి స్థాయిలో అమలు చేసేందుకు సంబందిత రాష్ట్ర ఉన్నత అధికారుల ద్వారా ప్రభుత్వ ఉత్తర్వులు రాబట్టుకొని ఆ పనులు యుద్ధ ప్రాతిపదికపై చేపట్టి పూర్తి చేయాలన్నారు. జిల్లాలో ఎన్‌టిఆర్‌ సుజల పధకం కింద ప్రస్తుతం 250 ఆర్‌ఓ ప్లాంట్స్‌ ఉన్నాయని వాటిలో పనిచేయని 13 ఆర్‌ఓ ప్లాంట్స్‌ను మరమత్తులు చేసి ప్రజలకు అందుబాటులో ఉంచాలన్నారు.

జిల్లాలో మరో 130 ఆర్‌ఓ ప్లాంట్స్‌ ఎన్‌టిఆర్‌ సుజల పధకం కింద ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని ఇందుకు ఇప్పటికే కోటి రూపాయలు అందుబాటులో ఉన్నాయని మిగిలిన నిధులు ఉపాధి హామీ నుండి జోడించి రెండు నెలల్లో పూర్తి చేయాలని ఆర్‌డబ్యూఎస్‌ఇ అమరేశ్వరరావును కలెక్టర్‌ ఆదేశించారు. ముఖ్యంగా ఏజెన్సీ, మారుమూల గ్రామాల్లో వీటిని ఏర్పాటు చేసి 20 లీటర్ల సురక్షిత నీటి క్యాన్‌ రూ.2లకు అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు.

జిల్లాలో ఎన్‌టిఆర్‌ సుజల పధకం అమలు, తాగునీటి సరఫరా, ఆర్‌డబ్యూఎస్‌ శాఖపరిధిలో పెన్డింగ్‌ పనులు, ఫిల్టర్‌బెడ్స్‌ తదితర అంశాలపై సమీక్షించేందుకు ఈ నెల 24వ తేదీ శుక్రవారం ఉదయం 10:30 గంటలకు ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించాలని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ కాటంనేని భాస్కర్‌ ఆర్‌డబ్యూఎస్‌ఇ అమరేశ్వరరావును ఆదేశించారు. ఈ సమావేశానికి ఐటిడిఎ పిఓ, డిపిఓ, ట్రాన్స్‌కో ఎస్‌ఇలతో పాటు ఆర్‌డబ్యూఎస్‌లోని అసిస్టెంట్‌ ఇంజనీర్‌ స్థాయి వరకు సిబ్బంది ఇంజనీర్లు హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. జలవనరులశాఖ పరిధిలో నల్లిక్రీక్‌ పూడిక తీత పనులు, ఉప్పుటేరుపై రెగ్యులేటర్‌ నిర్మాణం పనులు తప్ప మిగిలిన వియర్‌ ఛానల్‌, పెదవేగి మండలంలో చెక్‌డ్యాంకు నక్కల డ్రైయిన్‌ అభివృద్ధి పనులు, ఎర్రకాలువపై రెండు చెక్‌డ్యాంల పనుల నిర్మాణం, ఎర్రకాలువ గ్రోఎన్‌కు సంబందించిన పనులు వేగవంతంగా పూర్తి చేయాలని ఆశాఖ ఎస్‌ఇ రఘునాధ్‌ను కలెక్టర్‌ ఆదేశించారు.

జిల్లాలో 909 గ్రామ పంచాయితిల్లో ఇంత వరకూ 373 గ్రామ పంచాయితీల్లో వీధి దీపాలుగా ఎల్‌ఇడి లైట్లు ఏర్పాటు చేసారని, మిగిలిన 536 గ్రామ పంచాయితీల్లో ఎల్‌ఇడి వీధిలైట్లు ఏర్పాటు వేగవంతంగా పూర్తి చేయాలన్నారు. కొల్లేరులో పర్యాటక అభివృద్ధికి అవసరమైన చర్యలు తీసుకోవాలని ఇందుకు సంబందించిన ప్రతిపాదనలను త్వరలో నిర్వహించే రాష్ట్ర స్థాయి పర్యాటక అభివృద్ధి సమావేశంలో చర్చకు వచ్చేలా చర్యలు తీసుకోవాలని పర్యాటక శాఖ అధికారులను కలెక్టర్‌ ఆదేశించారు.

ఏలూరులో శిల్పారామం ఏర్పాటుకు అవసరమైన భూమి గుర్తింపును త్వరితగతిన చేపట్టాలని సంబందిత అధికారులను కలెక్టర్‌ ఆదేశించారు. ఎడ్యుకేషన్‌ హబ్‌, ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటుకు సంబందించి అనుమతులు త్వరగా పొందేందుకు చర్యలు తీసుకోవాలని ఉన్నత విద్యాశాఖాధికారులను కలెక్టర్‌ ఆదేశించారు. తాడేపల్లిగూడెం జూనియర్‌ కళాశాలల్లో మౌలిక వసతులు కల్పించే పనులు వేగవంతంగా పూర్తి చేయాలన్నారు. తణుకు-ఉండ్రాజవరం జంక్షన్‌ వద్ద ఫ్లైఓవర్‌ నిర్మాణ పనులకు త్వరగా అనుమతులు తెప్పించేందుకు చర్యలు తీసుకోవాలని జాతీయ రహదారుల పిడిని కలెక్టర్‌ ఆదేశించారు. పోతవరం, బ్రాహ్మణగూడెం ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల నిర్మాణానికి, వేల్పూరు ప్రాధమిక ఆరోగ్య కేంద్రాన్ని ఉన్నత శ్రేణి ఆరోగ్య కేంద్రంగా మార్పు చేసేందుకు ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసిందని ఈ నిర్మాణ పనులను వెంటనే ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని డిఎమ్‌హెచ్‌ఓను కలెక్టర్‌ ఆదేశించారు.

తాడేపల్లి గూడెం మున్సిపాలిటి పరిధిలో హామీలు పెండింగ్‌లో ఉన్నాయని వీటిని పై అధికారులతో సంప్రదించి త్వరగా అనుమతులు తీసుకోవాలని కలెక్టర్‌ ఆదేశించారు. నల్లజర్ల మండలం పోతవరం గ్రామంలో మంజూరు అయిన 175 గృహాల్లో 170 ఇళ్ళ నిర్మాణం ప్రారంభం కాగా వాటిలో 69 ఇళ్లు పూర్తి అయ్యాయన్నారు. మిగిలిన వాటిని వేగవంతంగా పూర్తి చేయాలన్నారు. కుకునూరు, నల్లజర్ల మండలాల్లో అగ్నిమాపక కేంద్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని సంబందిత అధికారులను కలెక్టర్‌ ఆదేశించారు.

పట్టిసీమలో వీరభద్రస్వామి ఆలయం, పోతవరంలో రామాలయం అభివృద్ధి పనులను వేగవంతం చేయాలన్నారు. ఆర్‌అండ్‌బి పరిధిలో వివిధ రహదారుల నిర్మాణం, విజ్జేశ్వరం వద్ద అండర్‌గ్రౌండ్‌ డ్రైయినేజ్‌ పనులు, వట్లూరు, బోగాపురం, పరిశ్రమల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని సంబందిత అధికారులను కలెక్టర్‌ ఆదేశించారు. ఈ సమావేశానికి హాజరుకాని తాడేపల్లిగూడెం మున్సిపల్‌ కమిషనర్‌, ఉన్నత విద్యాశాఖ ఆర్‌జెడి తదితరులకు షోకాజ్‌ నోటీసులు ఇవ్వాలని సంబందిత అధికారులను కలెక్టర్‌ ఆదేశించారు.

ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎన్‌ సత్యనారాయణ, సిపిఓ సురేష్‌ కుమార్‌, ఆర్‌డబ్యూఎస్‌ ఎస్‌ఇ అమరేశ్వరరావు, డిపిఓ, జెడ్‌పిసిఇఓ వి నాగార్జున సాగర్‌, డిఎమ్‌హెచ్‌ఓ సుబ్రహ్మణ్యేశ్వరి, గృహనిర్మాణ సంస్థ పిడి శ్రీనివాసరావు, ఆర్‌అండ్‌బి ఎస్‌ఇ నిర్మల, పంచాయితిరాజ్‌ ఎస్‌ఇ మాణిక్యం, జలవనరులశాఖ ఎస్‌ఇ రఘునాధ్‌, ఏలూరు నగర పాలక కమీషనర్‌ మోహన్‌రావు, జిల్లా విపత్తులనివారణ అధికారి శంకర్‌రావు, దేవాదాయ, పరిశ్రమలు, తదితర శాఖాధికారులు పాల్గొన్నారు.