• బాలాజీ మందిర్‌లో భారీ ఏర్పాట్లు

న్యూఢిల్లీ: న్యూఢిల్లీలోని గోల్ మార్కెట్, ఉద్యాన మార్గ్‌లో గల తిరుమల, తిరుపతి దేవస్థానాల బాలాజీ మందిర్ ప్రాంగణం ధ్యాన మందిరంలో శనివారం శ్రీశైల దేవస్థానం భ్రమరాంబ సమేత మల్లిఖార్జున స్వామివార్ల కళ్యాణోత్సవం, మహన్యాసపూర్వక రుద్రాభిషేకం నిర్వహించనున్నట్లు శ్రీశైల దేవస్థాన కార్యనిర్వహణాధికారి శ్రీరామచంద్ర మూర్తి ఒక ప్రకటనలో తెలిపారు.

ఢిల్లీలోని తెలుగు ప్రజలు, ఢిల్లీవాసుల సౌకర్యార్ధం శ్రీశైలదేవస్థానం ఢిల్లీలోని తిరుమల, తిరుపతి దేవస్థానాల సహకారంతో బాలాజీ మందిర్ ప్రాంగణంలో శనివారం ఉదయం 10.00 గంటలకు మహన్యాసపూర్వక రుద్రాభిషేకం, సాయంత్రం 6.30 గంటలకు శ్రీశైల భ్రమరాంభ సమేత శ్రీ మల్లిఖార్జున స్వామివార్ల కల్యాణోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. ఈ కార్యక్రమాలను నిర్వహించడానికి దేవస్థాన ప్రధానార్చకులు బ్రహ్మశ్రీ బి.వి.ఎస్. శాస్త్రి తన పరివారం 15 మంది అర్చకులతో హస్తినకు చేరుకున్నారని తెలిపారు.

ఈ కార్యక్రమాలను వైభవోపేతంగా నిర్వహించడానికి తామంతా కృషిచేస్తున్నామన్నారు. రుద్రాభిషేకంలో పాల్గొనదలచిన దంపతులు/భక్తులు రూ.200/- చెల్లించి టికెట్లు పొందవలసి ఉందన్నారు. మరిన్ని వివరాలకు వినోద్: 9392092013, జి. రామకోటయ్య: 9654720499, నాగేశ్వరరావు: 7893847742ను సంప్రదించవచ్చన్నారు. కళ్యాణోత్సవంలో మాత్రం ప్రతిఒక్కరూ పాల్గొనవచ్చునని పేర్కొన్నారు. ఢిల్లీ వాసులు, తెలుగు ప్రజలు ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకుని శ్రీ భ్రమరాంబ మల్లిఖార్జున స్వామివార్ల కృపాకటాక్షాలను పొందాలని కోరారు.