• వ్యక్తిగతంగా లోటు పూడ్చలేనిదన్న ప్రధాని

న్యూఢిల్లీ: అటల్‌ బిహారీ వాజ్‌పేయీ మరణం తనకు వ్యక్తిగతంగా ఎప్పటికీ పూడ్చలేని లోటు అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భావోద్వేగానికి గురయ్యారు. ‘‘మేరే అటల్‌ జీ మీరు ఈ దేశానికి దిక్సూచి. ఆదర్శవంతుడికి నిలువెత్తు నిదర్శనం. మాటలకందని మంచితనం’’ అంటూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ వాజ్‌పేయీకి ఉద్వేగభరిత నివాళులర్పించారు. తాజాగా ఆయన బ్లాగులో వాజ్‌పేయీ గురించి సుదీర్ఘ వ్యాసం రాశారు. ‘ఎ లీడర్‌ ఫర్‌ ది ఏజెస్‌, హి వాజ్‌‌ ఎహెడ్ ఆఫ్‌ టైమ్స్‌’ పేరుతో రాసుకొచ్చిన ఈ బ్లాగులో వాజ్‌పేయీ వ్యక్తిత్వం, గొప్పతనాన్ని మోదీ కొనియాడారు.

మోదీ వ్యాసంలోని కొన్ని వ్యాక్యాలను పరికిస్తే ఆయనపై తనకు ఎంత ప్రేమాభిమానాలు ఉన్నాయో అర్ధమవుతుంది. ‘‘అల్లకల్లోలం, విపత్కర పరిస్థితుల్లో దేశానికి ఓ నాయకుడు వచ్చారు. ప్రజలను మార్గనిర్దేశనం చేశారు. ముందుకు నడిపించారు. ఆయనే అటల్‌ బిహారీ వాజ్‌పేయీ. కలిసిన ప్రతి ఒక్కరిని కదిలించే, స్ఫూర్తినిచ్చే అరుదైన వ్యక్తి ఆయన. అమితమైన కరుణామయుడు. ధీశాలి. ప్రతి ఒక్కరు గర్వించదగ్గ వ్యక్తి. అంతకు మించిన హాస్యచతురత కలిగిన వారు. అద్భుతమైన వక్త. మధ్యప్రదేశ్‌లోని ఓ చిన్న టౌన్‌లో ఉన్నతమైన ఆదర్శాలు కలిగిన కుటుంబంలో పుట్టారు. చిన్న వయసు నుంచే ప్రజాసేవకు అంకితమయ్యారు. జనసంఘ్‌లో చిన్న కార్యకర్తగా జీవితాన్ని మొదలుపెట్టిన ఆయన అంచెలంచెలుగా ఎదిగారు. పార్లమెంట్‌లో నాలుగు దశాబ్దాలు నాయకుడిగా ఉన్న ఆయన ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాడారు. ప్రజాస్వామ్యానికి కొత్త అర్థం చెప్పారు. రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరి అభిప్రాయాలను గౌరవించారు. నేటి తరాలకు ఆదర్శంగా నిలిచారు. ప్రపంచ వేదికలపై భారత్‌ను సరికొత్తగా పరిచయం చేశారు. భవిష్యత్‌ తరాల అవసరాల కోసం ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. దేశాన్ని ప్రగతి దిశగా నడిపించారు. ఎన్నో విపత్కర పరిస్థితులకు ఎదురొడ్డారు. దేశ భద్రత, సమగ్రత కోసం పాటుపడ్డారు. కీలక ముందడుగులు వేశారు. ఎన్నో విషయాల్లో ఆయన మనకు స్ఫూర్తిదాయకం. వ్యక్తిగతంగా ఆయన నాకు గురువు, ఆదర్శప్రాయుడు. 2001 అక్టోబరులో ఓ రోజు సాయంత్రం ఆయన నన్ను పిలిచి గుజరాత్‌కు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టమన్నారు. అప్పుడు నేను ఆర్‌ఎస్‌ఎస్‌ కోసమే పనిచేస్తానని చెప్పాను. అయితే, ఆయన మాత్రం ప్రజల కలల్ని సాకారం చేయగల సత్తా నీకుంది అని చెప్పారు. అందుకు నేను ఎంతో గర్వపడుతున్నా. ఇప్పుడు ఆయన ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. కానీ, ఎప్పటికీ ఆయన ఈ దేశానికి నిజమైన భారతరత్నం. ఆయన ఆదర్శాలు నేటి తరానికి మార్గనిర్దేశనం చేస్తాయి. ఆయన కలలుగన్న నవభారతాన్ని మేం నిర్మిస్తాం’’ అంటూ మోదీ ఉద్వేగభరితులయ్యారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here