• భారత్ -పాక్ మధ్య శాంతికి కృషిచేశారని ప్రశంస

  • సత్సంబంధాలే ఆయనకు అసలైన నివాళి అన్న ఇమ్రాన్‌

  • దిగ్భ్రాంతి వ్యక్తంచేసిన ప్రపంచ దేశాల నేతలు

న్యూఢిల్లీ, ఇప్లామాబాద్: భారత మాజీ ప్రధాని, భారతరత్న అటల్‌ బిహారీ వాజ్‌పేయీ మృతిపట్ల పాకిస్థాన్‌ ప్రభుత్వంతో సహా ఆ దేశ ప్రముఖ నేతలంతా సంతాపం ప్రకటించారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు బలపరిచేందుకు, మార్పు తీసుకొచ్చేందుకు వాజ్‌పేయీ ఎంతగానో కృషి చేశారని పాక్‌ నేతలు కొనియాడారు. పాకిస్థాన్‌ ప్రధానిగా బాధ్యతలు చేపట్టనున్న ఇమ్రాన్‌ ఖాన్‌ వాజ్‌పేయీ మృతికి సంతాపం తెలిపారు. భారత్‌-పాకిస్థాన్‌ మధ్య శాంతి నెలకొల్పేందుకు ఆయన చేసిన కృషి ఎన్నటికీ మరువలేనిదని పేర్కొన్నారు. రెండు దేశాల మధ్య సత్సంబంధాలు నెలకొల్పేందుకు కృషిని ప్రారంభించిన వాజ్‌పేయీ, ప్రధాని అయిన తర్వాత కూడా దాన్ని కొనసాగించారని అన్నారు.

భారత్‌, పాక్‌ మధ్య శాంతి నెలకొల్పడమే వాజ్‌పేయీ సాహెబ్‌కు ఇచ్చే నిజమైన నివాళి అని ఇమ్రాన్‌ ఖాన్‌ అన్నారు. ‘‘అటల్‌ బిహారీ వాజ్‌పేయీ మరణించారని తెలిసి ఎంతగానో చింతిస్తున్నాం’’ అని పాకిస్థాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి మొహమ్మద్‌ ఫైసల్‌ తెలిపారు. ఆయన గొప్ప నాయకుడు అని, భారత్‌-పాక్‌ సంబంధాల్లో ఎంతో మార్పు తెచ్చారని, సార్క్‌, రీజినల్‌ కోఆపరేషన్‌ ఫర్‌ డెవలప్‌మెంట్‌ విషయాల్లో కీలక మద్దతుదారుగా నిలిచారని ఫైసల్‌ ప్రశంసించారు.

వాజ్‌పేయీ, పాక్‌ మాజీ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ ఇరు దేశాల మధ్య శాంతి నెలకొల్పేందుకు నిజాయితీగా శ్రమించారని పాకిస్థాన్‌ ముస్లిం లీగ్‌-నవాజ్‌ (పీఎంఎల్‌-ఎన్‌) పార్టీ నేత షాబాజ్‌ షరీఫ్‌ పేర్కొన్నారు. భారత్‌ గొప్ప నాయకుడిని కోల్పోయిందని, కానీ ఆయన సేవలు ఎన్నటికీ మరువలేనివని తెలిపారు. రెండూ దాయాది దేశాలైనప్పటికీ పాక్‌తో శాంతి నెలకొల్పేందుకు చేసిన కృషి కారణంగా ఆయనకు పాక్‌లో కూడా అభిమానులుండడం గమనార్హం. కాగా, వాజ్‌పేయీ మృతిపట్ల ప్రపంచ దేశాలు పలు సంతాపం వ్యక్తంచేశాయి. అమెరికా, రష్యా సహా అనేక దేశాలు సంతాపం తెలిపాయి. మరోవైపు, శత్రు దేశాలను కూడా మిత్ర దేశాలుగా మార్చే దౌత్యనీతితో అంతర్జాతీయంగా భారత్‌ను ఒకస్థాయికి తీసుకెళ్లిన మాజీ ప్రధాని వాజ్‌పేయీ మృతిపట్ల ప్రపంచ నేతలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

దాయాది దేశం పాకిస్థాన్‌, అమెరికా, రష్యా, బ్రిటన్‌, జపాన్‌ సహా సార్క్‌ దేశాధినేతలు సంతాపం తెలిపారు. భారత్‌, అమెరికా సంబంధాలు మెరుగుపరచడంలో వాజ్‌పేయీ కీలక పాత్ర పోషించారని అమెరికా గుర్తుచేసింది. ఇరుదేశాల మధ్య సహజసిద్ధ సంబంధాలు ఉన్నాయని వాజ్‌పేయీ అనేవారని ఢిల్లీలోని అమెరికా దౌత్య కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. భారత రాజకీయాల్లో వాజ్‌పేయీ పేరు ఓ అంతర్భాగమైందని, ప్రపంచం ఒక గొప్ప రాజనీతిజ్ఞుడ్ని కోల్పోయిందని భారత్‌లో రష్యా రాయబారి విచారం వ్యక్తం చేశారు. బంగ్లాదేశ్‌కు అటల్‌ మంచి మిత్రుడని ఆ దేశ ప్రధాని షేక్‌ హసీనా అన్నారు. శాంతి కోసం వాజ్‌పేయీ చేసిన ప్రయత్నాలు తప్పకుండా సత్ఫలితాలు ఇస్తాయని పాకిస్థాన్‌ కాబోయే ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ విశ్వాసం వ్యక్తంచేశారు.

భారత్‌, పాక్‌ సంబంధాల బలోపేతానికి విదేశాంగ మంత్రిగా పునాది వేసిన వాజ్‌పేయీ ప్రధాని అయ్యాక వాటిని కొనసాగించారని ఇమ్రాన్‌ గుర్తు చేశారు. భారత మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయీ మరణం పట్ల అగ్రరాజ్యం అమెరికా సంతాపం తెలియజేసింది. భారత్‌, అమెరికాలు చక్కని భాగస్వామ్యాన్ని అభివృద్ధి చేసుకోవాలని ఏనాడో గుర్తించిన నేతల్లో అటల్‌ ఒకరని అమెరికా కొనియాడింది.

2000 సంవత్సరంలోనే అటల్‌ అమెరికా కాంగ్రెస్‌ ఎదుట నిలబడి అమెరికా-భారత్‌ల మధ్య ఇరు దేశాల పరస్పర కృషితో సహజమైన భాగస్వామ్యం ఏర్పడాలని అన్నారని అమెరికా విదేశాంగ మంత్రి మైక్‌ పాంపియో వెల్లడించారు. అమెరికా, భారత్‌లు చక్కని భాగస్వామ్యం ఏర్పరుచుకుంటే అది ఇరు దేశాల ఆర్థికాభివృద్ధికే కాకుండా ప్రపంచానికి కూడా ప్రయోజనకరం అని వాజ్‌పేయీ భావించారని, ఆయన ఆలోచనలే ఇరు దేశాల మధ్య సంబంధాలు బలపడేందుకు దోహదపడ్డాయని పాంపియో ప్రశంసించారు.

రష్యా, మాల్దీవులు, నేపాల్‌, శ్రీలంక తదితర దేశాల అధ్యక్షులు భారత రాష్ట్రపతికి సంతాప సందేశాలు పంపారు. ‘‘భారత మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయీ మృతి విచారకరం. ఆయన గొప్ప నాయకుడే కాదు, సాహిత్యం, కళల్లో మంచి స్కాలర్‌ కూడా. ఆయన ప్రధానిగా ఉన్న సమయంలో మాల్దీవుల్లో పర్యటించారు. ఓ గొప్ప నేతను కోల్పోయిన భారత్‌కు మాల్దీవులు ప్రభుత్వం తరఫున ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం’’ అని మాల్దీవులు అధ్యక్షుడు అబ్దుల్లా యమీన్‌ అబ్దుల్ గయూమ్‌ సంతాప సందేశంలో పేర్కొన్నారు.

‘‘భారత గొప్ప నేతల్లో వాజ్‌పేయీ ఒకరు. ఆయన మృతి విచారకరం. యూకే ప్రభుత్వానికి ఆయన మంచి సన్నిహితుడు’’ అని యూకే మంత్రి మార్క్‌ ఫీల్డ్‌ అన్నారు.

‘‘వాజ్‌పేయీ ప్రపంచం గర్వించదగ్గ నేత. గొప్ప రాజనీతిజ్ఞుడు. భారత్‌, రష్యా మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలపర్చేందుకు ఆయన ఎంతగానో కృషి చేశారు. ఆయన మృతిపట్ల సానుభూతి ప్రకటిస్తున్నాం’’ రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్‌ పుతిన్‌ పేర్కొన్నారు.

‘‘ఈ రోజు ఓ గొప్ప మానవతావాదిని, నిజమైన స్నేహితుడిని మనం కోల్పోయాం. ఆయన అద్భుతమైన నాయకుడు, ప్రజాస్వామ్య రక్షకుడు’’ అని శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన అన్నారు.