• అధికారులకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్‌కుమార్ హితవు

అమరావతి: రాష్ట్రంలో గిరిజన ప్రాంతాల్లో విద్యాభివృద్ధికి ప్రత్యేక దృష్టి సారించాలని, ఏఒక్క విద్యార్ధి మధ్యలో చదువు మానివేయకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్ కుమార్ విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు శుక్రవారం అమరావతి సచివాలయంలో కళాశాల విద్య,ఉన్నత విద్యతో పాటు సాంకేతిక విద్యపై ఆయన సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలోని అన్ని కళాశాలల్లోను తప్పనిసరిగా సురక్షితమైన తాగునీరును అందించడంతోపాటు విద్యుత్ సౌకర్యాన్ని ప్రభుత్వ పరంగా పూర్తిగా అందుబాటులో ఉంచాలని వీటి కల్పన విషయంలో ఎలాంటి ధాతలపై ఆధారపడవద్దని స్పష్టం చేశారు. వివిధ పాఠశాలలు, కళాశాలల్లో డ్రాప్ అవుట్ రేట్‌ను పూర్తిగా తగ్గించేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆదేశించారు.

కళాశాల్లలోని మౌళిక సదుపాయలు, వాటి పనితీరు ఆధారంగా ఆయా కళాశాలలను గ్రేడింగ్ చేసి ర్యాంకింగ్‌లు ఇవ్వడం ద్వారా ఉత్తమ విద్యా సంస్థల్లో ఎక్కువ మంది చేరేలా విద్యార్ధులను ప్రోత్సహించవచ్చిని తెలిపారు. సైన్స్ కోర్సులకు తగిన విధంగా లాబొరేటరీ సౌకర్యాన్ని అందుబాటులో ఉంచాలని అప్పుడే ఆయా కోర్సులను సమర్ధవంతంగా నిర్వహించేందుకు వీలవుతుందని ఆదిశగా తగిన చర్యలు తీసుకోవాలని సీఎస్ ఆదేశించారు. పాలిటెక్నిక్ కళాశాలలు, ఐటీఐలలో ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా విదార్ధులకు మెరుగైన ఉపాధి అవకాశాలు లభించే విధమైన నూతన కోర్సులను ప్రవేశపెట్టాల్సిన ఆవశ్యకత ఉందని, అందుకు తగిన చర్యలు చేపట్టాలని సాంకేతిక విద్యా శాఖ కమీషనర్‌ను సీఎస్ దినేష్ కుమార్ ఆదేశించారు.

అంతేగాక విద్యా సంస్థల్లో తగిన కనీస మౌళిక సదుపాయాలను కల్పించడం తోపాటు విద్యా ప్రమాణాలను మెరుగు పర్చేందుకు కృషి చేయాలని అన్నారు. ఇందుకుగాను ఉపన్యాసకులకు మరింత శిక్షణ ఇచ్చేందుకు ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలకు ప్రణాళిక సిధ్దం చేసి అమలు చేయాలని సూచించారు. విద్యార్ధుల్లో నైపుణ్య శిక్షణను మరింత పెంపొందించడం ద్వారా ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కృషి చేయాలని చెప్పారు. ఉన్నత విద్యాశాఖపై మాట్లాడుతూ ప్రస్తుతం వివిధ విశ్వవిద్యాలయాల్లో ఏర్పాటు చేసిన ఇన్నోవేషన్ కేంద్రాలను పూర్తిగా వాస్తవికంగా వినియోగంలోకి తెచ్చేందుకు ప్రయత్నించాలని సీఎస్ అన్నారు. విద్యార్ధులకు వచ్చే వినూత్న ఆలోచనలను ఆచరణలో పెట్టేందుకు వీలుగా ఇన్నోవేషన్ కేంద్రాలు దోహదపడేలా వాటిని అన్ని విధాలా తీర్చిదిద్దాలని పేర్కొన్నారు.

అంతేగాక ప్రముఖ విద్యాసంస్థలతో అనుసంధానం చేయడం ద్వారా విద్యార్ధులకు మంచి ఎక్స్‌పోజర్ ఉండేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. అంతకు ముందు విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యానాధ్ దాస్, విద్యాశాఖ మఖ్య కార్యదర్శి బి.ఉదయలక్ష్మి, కళాశాల విద్యాశాఖ కమిషనర్ సుజాతా శర్మ, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ పాండాదాస్ వారి విభాగాలకు సంబంధించిన అంశాలను వివరించారు.