• తీవ్రస్థాయికి చేరుకున్న వరదలు

  • అల్లాడుతున్న జనం… అంధకారంలో రాష్ట్రం

  • 173కు పెరిగిన మృతుల సంఖ్య… దాతల సాయం

  • కేంద్ర సయాయం కోసం తప్పని ఎదురుచూపులు

తిరువనంతపురం: కేరళలో వరద బీభత్సం తీవ్రస్థాయికి చేరుకుంది. ఈనెల 8 నుంచి రాష్ట్రంలో వరదల కారణంగా మరణించిన వారి సంఖ్య శుక్రవారానికి 173కు చేరింది. భారీ వర్షాలతో గత కొద్దిరోజలుగా కేరళ ప్రజలు అల్లాడిపోతున్నారు. పేద, ధనిక అనే తేడా లేకుండా అన్ని వర్గాలను వరుణుడు పట్టిపీడించాడు. వర్షాలతో రాష్ట్రవ్యాప్తంగా నదులు పొంగిపొర్లుతున్నాయి.

జలాశయాలు నిండిపోవడంతో గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. మరోవైపు, వరదల కారణంగా లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. కనుచూపు మేరలో నీరే కన్పిస్తుండటంతో ప్రజలు తీవ్ర భయభ్రాంతులకు గురవుతున్నారు. ఇంకోవైపు, వర్షాల కారణంగా రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. అనేక ప్రాంతాల్లో రహదారులు, భవనాలు నీటమునగడంతో రాష్ట్ర విద్యుత్‌ బోర్డు విద్యుత్‌ సరఫరాను నిలిపివేసింది.

దీంతో రాష్ట్రంలోని దాదాపు 80 శాతం అంధకారంలో ఉంది. గురువారం ఒక్కరోజే రాష్ట్రవ్యాప్తంగా 100 మందికి పైగా ప్రాణాలు కోల్పోవడం చూస్తుంటే ఇక్కడి పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థమవుతోంది. కేరళ వ్యాప్తంగా గురువారం వివిధ ఘటనల్లో 100మంది చనిపోయినట్లు రాష్ట్ర విపత్తు నిర్వహణ అధికారులు శుక్రవారం అధికారికంగా వెల్లడించారు. దీంతో ఇక కేరళకు పొరుగు రాష్ట్రాల నుంచి రాకపోకలు నిలిచిపోవడంతో ఇంధన, మందుల కొరత ఏర్పడింది.

రంగంలోకి దిగిన జాతీయ విపత్తు నిర్వహణ సిబ్బంది రాష్ట్రవ్యాప్తంగా సహాయక చర్యలు చేపట్టారు. హెలికాప్టర్లు, పడవల సాయంతో వరదల్లో చిక్కుకున్న వారిని రక్షించి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఎర్నాకుళం, పతనంతిట్ట జిల్లాల నుంచి 3వేల మందిని రక్షించి సురక్షిత ప్రాంతాలకు పంపించారు. కాగా, శనివారం వరకు రాష్ట్రంలో వర్షాలు పడే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. తిరువనంతపురం, కొల్లామ్‌, అలప్పుళా, కొట్టాయం, ఇడుక్కీ, ఎర్నాకుళం, త్రిశూర్‌, పాలక్కడ్‌, మలప్పురం, కొజికొడే, వయనాడ్‌ జిల్లాల్లో శనివారం ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశముందని అంచనా వేస్తున్నారు.

వర్షాల కారణంగా కోచి ఎయిర్‌పోర్టును ఆగస్టు 26 వరకు మూసివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. పలు రైళ్ల రాకపోకలు కూడా రద్దయ్యాయి. వరదల పరిస్థితిపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌తో మాట్లాడారు. పరిస్థితిని సమీక్షించేందుకు ప్రధాని మోదీ కేరళ వెళ్లనున్నారు. శనివారం రాష్ట్రవ్యాప్తంగా విహంగ వీక్షణం చేపట్టనున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here