• రాష్ట్రపతి ఉప రాష్ట్రపతి ప్రధాని సహా పలువురి నివాళి

  • అటల్ అభిమానులతో కిక్కిరిసిన హస్తిన రహదారులు

  • కాలినడకన అంతిమయాత్రలో పాల్గొన్న ప్రధాని నరేంద్రమోదీ

న్యూఢిల్లీ: తీవ్ర అనారోగ్యంతో కన్నుమూసిన మాజీ ప్రధాని, భారతరత్న అటల్‌ బిహారీ వాజ్‌పేయీ అంత్యక్రియలు అభిమానులు, సన్నిహితుల కన్నీటి వీడ్కోలు మధ్య ప్రభుత్వ లాంఛనాలతో ఘనంగా ముగిశాయి. యమునా నదీ తీరంలోని రాష్ట్రీయ స్మృతిస్థల్‌లో అంతిమ సంస్కారాలు నిర్వహించారు.

అటల్‌ దత్తపుత్రిక నమిత వాజ్‌పేయీ చితికి నిప్పంటించగా, హిందూ సంప్రదాయం ప్రకారం దహన సంస్కారాలు పూర్తి చేశారు. అంతకుముందు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు, ప్రధానమంత్రి నరేంద్రమోదీ, భూటాన్‌ రాజు వాంగ్‌చుక్‌, లోక్‌సభ స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌, రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్‌, త్రివిధ దళాధిపతులు, మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్‌సింగ్‌, మాజీ ఉప ప్రధాని, భాజపా సీనియర్ నాయకుడు ఎల్.కె. అద్వాణీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, కాంగ్రెస్ మాజీ సారధి సోనియా గాంధీ సహా పలువురు మంత్రులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు స్మృతి స్థల్‌లో మహానేతకు నివాళులర్పించారు.

కృష్ణమీనన్‌ మార్గ్‌లోని వాజ్‌పేయీ నివాసానికి శుక్రవారం ఉదయమే చేరుకున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు మహానేతకు నివాళి అర్పించారు. అంతకముందు, ఆయన పార్థివదేహాన్ని ఢిల్లీలోని కృష్ణమీనన్‌ మార్గ్‌కు తరలించారు. వాజ్‌పేయీని కడసారి చూసేందుకు వివిధ రంగాల ప్రముఖులు తరలివచ్చారు. దేశానికి ఎనలేని సేవలందించిన మహానేతకు నివాళులర్పించారు. కేరళ, తమిళనాడు రాష్ట్రాల గవర్నర్లు పి.సదాశివం, భన్వరీలాల్‌ పురోహిత్‌, జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోవల్‌, నేవీ చీఫ్‌ సునీల్‌ లాంబా, ఆర్మీ చీఫ్‌ బిపిన్‌ రావత్‌, ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌ తదితరులు మాజీ ప్రధానికి నివాళులర్పించారు. అనంతరం వాజ్‌పేయీ పార్థివదేహాన్ని పార్టీ కార్యకర్తలు, నాయకుల సందర్శనార్ధం భాజపా ప్రధాన కార్యాలయానికి తరలించారు.

మధ్యాహ్నం ఒంటిగంటకు వాజ్‌పేయీ అంతిమ యాత్ర ప్రారంభం అయింది. సాయంత్రం 4 గంటలకు రాష్ట్రీయ స్మృతి స్థల్‌లో అంత్యక్రియలు నిర్వహించారు. హోంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, మంత్రులు రవిశంకర్‌ ప్రసాద్‌, ముక్తార్‌ అబ్బాస్‌ నఖ్వీ, నితిన్‌ గడ్కరీ, డాక్టర్ హర్షవర్ధన్‌, స్మృతి ఇరానీ, అశోక్‌ గెహ్లాట్‌, కాంగ్రెస్ పార్టీ సీనియర్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి గులాం నబీ ఆజాద్‌, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌, డిప్యూటీ సీఎం మనీశ్‌ సిసోడియా, మధ్యప్రదేశ్‌ సీఎం శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌, ఛత్తీస్‌గఢ్‌ ముఖ్యమంత్రి రమణ్‌ సింగ్‌, భాజపా సీనియర్‌ నేత మురళీ మనోహర్‌ జోషి, తదితరులు అంత్యక్రియల్లో పాల్గొన్నారు. అంతకుముందు అశేష జనవాహిని నడుమ భాజపా ప్రధాన కార్యాలయం నుంచి రాష్ట్రీయ స్మృతిస్థల్‌కు వాజ్‌పేయీ అంతిమయాత్ర కొనసాగింది.

తమ ప్రియతమ నేతను కడసారి చూసేందుకు ప్రజలు భారీగా తరలి వచ్చారు. దీంతో ఢిల్లీ వీధులు కిక్కిరిశాయి. నాలుగు కిలోమీటర్లు సాగిన ఆత్మీయ నేత అంతిమయయాత్రలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అమిత్‌షా, మధ్యప్రదేశ్‌, మహారాష్ట్ర ముఖ్యమంత్రులు శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌, దేవేంద్ర ఫడణవీస్‌ కాలినడకన పాల్గొన్నారు. అంతిమ యాత్ర సాగుతున్నంతసేపూ అటల్‌ జీ అమర్‌ రహే నినాదాలు మార్మోగాయి. మరోవైపు, వాజ్‌పేయీ మృతి నేపథ్యంలో కేంద్రం ఈ నెల 22 వరకు సంతాప దినాలుగా ప్రకటించింది.