హైదరాబాద్: వరద బీభత్సంతో అతలాకుతలమైన కేరళ రాష్ట్రానికి చేయూత అందిస్తున్న తెలంగాణ ప్రభుత్వం. ఇప్పటికే 25 కోట్ల రూపాయల ఆర్థిక సాయాన్ని ప్రకటించడమే కాకుండా, హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి ని స్వయంగా పంపించి చెక్కు కూడా అందేలా చూశారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు. వరద ఉద్ధృతి కొంత తగ్గిన ఇంకా కొద్ది రోజులు పునరావాస కేంద్రాలలోనే వరద బాధితులు ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఈ నేపథ్యంలో ఇప్పటికే పెద్ద ఎత్తున ఆహార పదార్థాలను కేరళకు పంపించిన ప్రభుత్వం, మరో ఐదు వందల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని కేరళకు పంపించాలని నిర్ణయించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్ పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ను ఆదేశించారు. మంగళవారం మంత్రి ఈటల పౌరసరఫరాల శాఖ కమిషనర్ అకున్ సబర్వాల్, అధికారులతో సమీక్షించారు.

వెంటనే 500 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని కేరళకు అందెలా చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. సివిల్ సప్లై కార్యాలయంలో అత్యవసర సమావేశం ఏర్పాటు చేసిన కమిషనర్ అకున్ సబర్వాల్ ఉన్నతాధికారులతో, రైస్ మిల్లర్లతో చర్చించారు కమిషనర్. 500 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని 30 ట్రక్కులలో రోడ్డు మార్గం ద్వారా పంపించాలని నిర్ణయం తీసుకున్నారు.

కేరళ వెళ్లనున్న సరకుల లారీలను ఈనెల 22వ తేదీన ఫ్లాగ్ అఫ్ చేయనున్నారు. ఎర్నాకులానికి బియ్యం అందేలా కేసీఆర్ చర్యలు చేపట్టారు. ఇదే విషయాన్ని కేరళ ప్రభుత్వానికి కమిషనర్ అకున్ వివరించారు. దానికి ప్రతిగా కేరళ రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి కృతజ్ఞతలు తెలిపారు.

దీనికోసం ప్రత్యేక అధికారి నియమించినట్లు సమాచారం అందించింది కేరళ ప్రభుత్వం. బియ్యం అందేవరకు అనునిత్యం పర్యవేక్షించు బాధ్యతను తెలంగాణ మంత్రి ఈటల రాజేందర్ స్వీకరించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here