• ఘనంగా మాదిరి బ్రహ్మోత్సవ గరుడసేవ

తిరుమల: తిరుమల శ్రీవారి ఆలయంలో ఆదివారంనాడు శ్రావణపౌర్ణమిరోజున మాదిరి బ్రహ్మోత్సవ గరుడసేవను రాత్రి 7 నుండి 9 గంటల నడుమ టిటిడి ఘనంగా నిర్వహించింది. సెప్టెంబరు 13 నుండి 21వ తేదీ వరకు శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు, అక్టోబరు 10 నుండి 18వ తేదీ వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. సాధారణంగా ప్రతి ఏడాదీ ముందుగానే బ్రహ్మోత్సవాల తరహాలో మాదిరి బ్రహ్మోత్సవ గరుడసేవను నిర్వహించడం ఆనవాయితీ.

ఈ సందర్భంగా టిటిడి ఉన్నతాధికారులు ఆలయ నాలుగు మాడవీధుల్లో భద్రత, తాగునీరు పంపిణీ, అన్నప్రసాద వితరణ, శ్రీవారి సేవకుల సేవలు, ఇతర ఇంజినీరింగ్‌ ఏర్పాట్లను పరిశీలించారు. శ్రీవారి గరుడ వాహనం ముందు గజరాజులు ఠీవిగా నడుస్తుండగా, భక్తజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి ఉత్సవం కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.

శ్రీవారి ఉత్సవాలలో గరుడ వాహనోత్సవం అతి ముఖ్యమైనది. గరుడ వాహనంపై ఉన్న శ్రీవారిని దర్శిస్తే మోక్షం కరతలామలకమని భక్తుల నమ్మకం. వేదాలు, ఆచార్యులు గరుడుడిని వేదస్వరూపుడిగా పేర్కొన్నారు. గరుత్మంతుని రెక్కలు నిత్యత్వానికి, అపౌరుషేయత్వానికి ప్రతీకలని స్తుతించారు. గరుడుని సేవాదృక్పథం, మాతృభక్తి, ప్రభుభక్తి, సత్యనిష్ఠ, నిష్కళంకత, ఉపకారగుణం సమాజానికి స్ఫూర్తిదాయకాలు. ఇందుకే గరుడసేవకు ఎనలేని ప్రచారం, ప్రభావం విశిష్టత ఏర్పడ్డాయి. ఈ కార్యక్రమంలో టీటీడీ ఉన్నతాధికారులు, విశేషసంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here