• చితికి నిప్పంటించిన కళ్యాణ్‌రామ్

  • అంతిమయాత్రలో అభిమానుల అశ్రునివాళి

  • పార్ధివదేహానికి పలువురు ప్రముఖుల సంతాపం

హైదరాబాద్: రోడ్డు ప్రమాదంలో అశువులుబాసిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, రాజ్యసభ మాజీ సభ్యుడు, తెలుగుదేశం పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, సినీ నటుడు, దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు నాలుగో కుమారుడు నందమూరి హరికృష్ణ అంత్యక్రియలు అభిమానుల అశ్రునివాళుల మధ్య గురువారం సాయంత్రం ఘనంగా ముగిశాయి.

తెలంగాణ ప్రభుత్వ అధికార లాంఛనాలతో జూబ్లీహిల్స్ ‘మహాప్రస్థానం’లో నిర్వహించిన హరికృష్ణ అంత్యక్రియలలో ఆయన కుమారుడు నందమూరి కళ్యాణ్‌రామ్ చితికి నిప్పంటించారు. గురువారం మధ్యాహ్నం 2 గంటలకు హైదరాబాద్ మెహిదీపట్నంలోని నివాసం నుండి హరికృష్ణ అంతిమయాత్ర మొదలైంది. ఇంట్లో నుండి వాహనం వరకూ హరికృష్ణ భౌతిక కాయం ఉన్న పాడెను స్వయానా బావ అయిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు మోసారు.

అనంతరం అంతిమయాత్ర ఫిల్మ్‌నగర్ మహాప్రస్థానంకు చేరుకుంది. అక్కడ ప్రభుత్వ లాంఛనాలతో దహన క్రియలకు ఏర్పాట్లు చేశారు. ఇందులో భాగంగా పోలీసులు తుపాకీ ద్వారా మూడు రౌండ్లు బుల్లెట్లు కాల్చి గౌరవార్ధం నివాళి అర్పించారు. దహన క్రియల్లో భాగంగా సాంప్రదాయంగా నిర్వహించాల్సిన కార్యక్రమాలను హరికృష్ణ కుమారులు నందమూరి కళ్యాణ్ రామ్, నందమూరు తారక రామారావులు చేపట్టగా, చివరగా చితికి రెండో కుమారుడు అయిన కళ్యాణ్ రామ్ నిప్పంచారు.

అంత్యక్రియల్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, హరికృష్ణ సోదరులు నందమూరి జయకృష్ణ, నందమూరి బాలకృష్ణ, సుప్రీం కోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ జాస్తి చలమేశ్వర్‌ తదితరులు మహాప్రస్థానానికి చేరుకుని పాడె మోశారు. అంతకు ముందు మెహదీపట్నం నుంచి మహాప్రస్థానం వరకూ సాగిన అంతిమయాత్రలో సినీ రాజకీయ ప్రముఖులు, తెదేపా శ్రేణులు, నందమూరి అభిమానులు భారీగా పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర మంత్రులు కేటీఆర్‌, తలసాని శ్రీనివాస్‌యాదవ్‌,తుమ్మల నాగేశ్వరరావు, ఏపీమంత్రులు నారా లోకేశ్‌, ప్రత్తిపాటి పుల్లారావు, దేవినేని ఉమామహేశ్వరరావు తదితరులు హరికృష్ణ అంత్యక్రియల్లో పాల్గొన్నారు.ఏపీ, తెలంగాణా మంత్రులు, నందమూరి కుటుంబ సభ్యులు, సినీ రంగ ప్రముఖులు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

అంతకముందు, హరికృష్ణకు నివాళులు అర్పించేందుకు రాజకీయ, సినీ ప్రముఖులు మెహదీపట్నంలోని ఆయన నివాసానికి పెద్ద ఎత్తున తరలివచ్చారు. గురువారం ఉదయం ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు హరికృష్ణ పార్థివదేహానికి నివాళులు అర్పించారు. అనంతరం నందమూరి కుటుంబ సభ్యులను పరామర్శించారు. హరికృష్ణ పార్థివ దేహానికి తెలంగాణ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి, ఎంపీలు కల్వకుంట్ల కవిత, మాగంటి బాబు, ఈనాడు ఎండీ కిరణ్‌ దంపతులు, సినీ ప్రముఖులు అక్కినేని నాగార్జున, డాక్టర్ కె. రాఘవేంద్రరావు, జగపతిబాబు, అర్జున్‌, బెనర్జీ తదితరులు నివాళులు అర్పించారు.

హరికృష్ణ అంతిమయాత్రకు తెదేపా శ్రేణులు, నందమూరి అభిమానులు భారీగా తరలివచ్చారు. మెహదీపట్నంలోని హరికృష్ణ నివాసం నుంచి ప్రారంభమైన అంతిమయాత్రకు భారీగా అభిమానులు తరలిరావడంతో రోడ్లన్నీ రద్దీగా మారాయి. దివ్యాంగుడైన తెదేపా కార్యకర్త, నందమూరి వీరాభిమాని చక్రాల కుర్చీలో కూర్చుని అంతిమయాత్రలో పాల్గొన్నారు. వైకల్యాన్ని సైతం లెక్కచేయకుండా తమ అభిమాన నాయకుడికి కన్నీటి వీడ్కోలు పలికేందుకు అంతిమయాత్రను అనుసరించారు.

మరోవైపు, అంతిమయాత్ర మార్గంలో వెళ్లే వాహనదారులకు ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు హైదరాబాద్, సైబరాబాద్ పోలీస్‌ కమిషనరేట్ల పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. మెహదీపట్నం, నానాల్ నగర్ క్రాస్ రోడ్, టోలిచౌక్‌, విస్పర్ వ్యాలీ టీ జంక్షన్ మీదుగా జూబ్లీహిల్స్‌ మహాప్రస్థానం వరకూ అంతిమ యాత్ర కొనసాగింది. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో గమ్యస్థానాలకు చేరాలని ట్రాఫిక్ విభాగం సూచించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here