హైదరాబాద్: బలహీనవర్గాల కాలనీల్లో నిర్మించే ఆలయాలకు రూ.10 లక్షల వరకు ఎలాంటి మ్యాచింగ్ కాంట్రిబ్యూషన్ లేకుండానే సీజీఎఫ్ నిధులు మంజూరు చేయనున్నట్లు తెలంగాణ రాష్ట్ర గృహ నిర్మాణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. సర్వ శ్రేయో నిధి (కామన్ గుడ్ ఫండ్-సీజీఎఫ్) వినియోగానికి సంబంధించి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సచివాలయంలోని ఆయన చాంబర్‌లో మంగళవారం దేవాదాయ శాఖ అధికారులు, సీజీఎఫ్ కమిటీ సభ్యులతో సమీక్ష నిర్వహించారు.

ఈ సమావేశంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ కామన్ గుడ్ ఫండ్ ద్వారా చేపట్టిన పనులను మరింత వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. పంచాయతీ రాజ్ శాఖ ఇంజనీరింగ్ అధికారులకు కామన్ గుడ్ ఫండ్ పనులు అప్పగించిన చోట వారితో సమన్వయం చేసుకుంటూ సకాలంలో పనులు పూర్తయ్యేలా చూడాలని దేవాదాయ శాఖ అధికారులకు సూచించారు.

165 నూతన ఆలయాల నిర్మాణానికి రూ.50 కోట్లు మంజూరు చేసేందుకు కామన్ గుడ్ ఫండ్ కమిటీ ఆమోదం తెలిపిందని వివరించారు. ధూప దీప నైవేద్య పథకం ద్వారా అర్చకులకు గౌరవ వేతనం చెల్లించేందుకు రూ.27 కోట్లను సీజీఎఫ్ కమిటీ మంజూరు చేసినట్లు మంత్రి వెల్లడించారు. అదే విధంగా వేదపాఠశాల నిర్వహణకు ఏడాదికి కోటి రూపాయాలు కేటాయించాలని ప్రతిపాదించినట్లు తెలిపారు.

ఈ సమావేశంలో దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శివశంకర్, సీజీఎఫ్ కమిటీ సభ్యులు గుంటి జగదీశ్వర్, నర్సింహమూర్తి, దేవాదాయ శాఖ అడిషనల్ కమిషనర్ శ్రీనివాస రావు, జాయింట్ కమిషనర్ కృష్ణవేణి, వేములవాడ ఈవో దూస రాజేశ్వర్, ఇతర అధికారులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here