న్యూఢిల్లీ: భారత మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి వేడుకలు దేశవ్యాప్తంగా బుధవారం ఘనంగా జరిగాయి. ఉపాధ్యాయ దినోత్స‌వం నాడు ఉపాధ్యాయ సముదాయానికి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు, ప్రధానమంత్రి నరేంద్రమోదీ, లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ సహా పలువురు శుభాకాంక్షలు తెలిపారు.

దివంగత పూర్వ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్‌కు మోదీ నివాళులర్పించారు. ‘‘ఉపాధ్యాయ దినోత్స‌వం ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకొని ఉపాధ్యాయ సముదాయానికి ఇవే శుభాకాంక్షలు. యువ మస్తిష్కాలను తీర్చిదిద్దడంలోను, మన దేశ నిర్మాణంలోను ఉపాధ్యాయులు ఒక కీలక పాత్రను పోషిస్తున్నారు. మన పూర్వ రాష్ట్రపతి, స్వయంగా ఒక ప్రముఖ ఉపాధ్యాయుడైన కీర్తి శేషులు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి నాడు ఆయనకు మనం ప్రణమిల్లుదాం’’ అని ప్రధానమంత్రి తన సందేశంలో పేర్కొన్నారు. ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు దేశవ్యాప్తంగా ఎంపికచేసిన 45 మంది ఉత్తమ ఉపాధ్యాయులకు జాతీయ అవార్డులు అందజేశారు.

బోధన పద్ధతులతో ఉపాధ్యాయులు, సృజనాత్మక అభ్యాసం, కమ్యూనిటీని సమీకరించడం, పౌర భావనను ప్రోత్సహించడం, ఉపాధ్యాయుల రోజున ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్రం మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్, మానవ వనరుల అభివృద్ధి శాఖ సహాయ మంత్రి ఉపేంద్ర కుష్వాహ, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు మాట్లాడుతూ టీచర్లు జాతీయ అభివృద్ధికి కీలకమైన ఆర్కిటెక్సులన్నారు.

ప్రాథమిక విద్య మాతృభాషలోనే ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు. కాగా, ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్ లోయర్‌ ట్యాంక్‌బండ్‌పై ఉన్న సర్వేపల్లి విగ్రహానికి ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి పూల మాల వేసి అంజలి ఘటించారు. సికిందరాబాద్ ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్‌, ఎమ్మెల్సీ రామచంద్రరావు, ఐఏఎస్ అధికారి విజయ్‌కుమార్‌, ఇతర ఉపాధ్యాయులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వివిధ పాఠశాలల విద్యార్థులు ఈ వేడుకలకు హాజరయ్యారు. యావత్ దేశం, విద్యార్థి లోకానికి ఆదర్శంగా నిలిచిన సర్వేపల్లి రాధాకృష్ణన్ సేవలు చిరస్మరణీమని బండారు దత్తాత్రేయ కొనియాడారు.

విలువలతో కూడిన విద్య కోసం కృషి చేసిన రాధాకృష్ణన్ స్ఫూర్తిని అందరూ అందుకోవాలన్నారు. దేశంలో అవినీతి, అత్యాచారాలు, నిరుద్యోగం నిరోధించినప్పుడే నిజమైన స్వాతంత్ర్యం అని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో జరిగిన ఉపాధ్యాయ దినోత్సవ వేడుకల్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పాల్గొని ఉత్తమ అధ్యాపకులకు అవార్డులను అందజేసి విద్యార్ధులను తీర్చిదిద్దడంలో వారు ప్రదర్శిస్తున్న పనితీరును కొనియాడారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here