• కాంగ్రెస్ నేతలపై కేటీఆర్ మండిపాటు

  • 1024 డబుల్ బెడ్‌రూం ఇళ్లు ప్రారంభం

  • కొత్త ఇళ్లతో కళకళలాడిన దివిటిపల్లి గ్రామం

మహబూబ్‌నగర్: తెలంగాణ మంత్రి, ముఖ్యమంత్రి కేసీఆర్ తనయుడు కల్వకుంట్ల తారక రామారావు తమ ప్రత్యర్ధి కాంగ్రెస్‌పై మరోసారి ఒంటికాలితో లేచారు. మహబూబ్‌నగర్ జిల్లా పర్యటనలో భాగంగా బుధవారం ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న సందర్బంగా జరిగిన సభల్లో కాంగ్రెస్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రజా ధనాన్ని దోచుకుతినడమే పనిగా పెట్టుకున్న కాంగ్రెస్ ఇందిరమ్మ ఇళ్ల పేరిట భారీ మోసానికి పాల్పడిందని, అప్పట్లో డబ్బా ఇళ్లు కట్టించి ఇప్పుడు డబ్బా మాటలు ఆడుతున్న నేతలు తాము కట్టించి ఇస్తున్న డబుల్ బెడ్ రూం ఇళ్లను కళ్లారా చూడాలని మంత్రి హితవుపలికారు.

మహబూబ్‌నగర్ జిల్లా దివిటిపల్లిలో నిర్మించిన 1024 డబుల్ బెడ్ రూం ఇళ్లను మంత్రి బుధవారం ప్రారంభించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్, మంత్రి సి. ల‌క్ష్మారెడ్డి, ఎంపీ జితేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అనంతరం మాట్లాడిన మంత్రి కేటీఆర్ కాంగ్రెస్ హయాంలో ప్రజలకు డబ్బా ఇళ్లు కట్టించారని, కానీ కేసీఆర్ ప్రభుత్వం మాత్రం ప్రజలకు రెండు పడకగదుల ఇళ్లు కట్టించి ఇచ్చిందని అన్నారు. చరిత్రలో ఊహించని విధంగా సీఎం కేసీఆర్ అనేక కార్యక్రమాలు చేస్తున్నారన్నారు.

సీఎం కేసీఆర్ ప్రజల హృదయాల్లో ఉన్నారన్నారు. ‘‘సీఎం కేసీఆర్‌ను గద్దె దింపాలని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. ఎందుకు దించాలి అని మేం అడుగుతున్నాం. ప్రజా సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టినందుకు కేసీఆర్‌ను గద్దె దించాలా? రైతులకు పెట్టుబడి రాయితీ ఇస్తున్నందుకు గద్దె దించాలా? ఆడ బిడ్డల పెళ్లిళ్లు చేసినందుకు గద్దె దించాలా? మిషన్ భగీరథ ద్వారా మంచి నీరు ఇస్తున్నందుకు కేసీఆర్‌ను గద్దె దించాలా? దగా పడిన పాలమూరుకు తాగు, సాగునీరు అందించినందుకు గద్దె దించాలా? టీఆర్‌ఎస్ ప్రవేశపెట్టిన పథకాలన్నింటికీ రెండింతలు ఇస్తామని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. ఇంటింటికి వచ్చి గోరుముద్దలు తినిపిస్తామని కాంగ్రెస్ నేతలు నమ్మబలుకుతున్నారు. కాంగ్రెస్ పాలన తీరు తెలంగాణ ప్రజలందరికీ తెలుసు. కాంగ్రెస్ హయాంలో విద్యుత్ కోతలు రైతన్నలకు తెలియనివి కావు’’ అని మంత్రి తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here