• అధికార పార్టీకన్నా ముందే ఎన్నికల వరాలు?

  • జీవన్‌రెడ్డి నేతృత్వంలో కమిటీ భేటీలో నిర్ణయం

  • తెల్లరేషన్ కార్డులోని ప్రతివ్యక్తికీ ఏడు కిలోల సన్నబియ్యం

  • 200 యూనిట్ల వరకూ ఉచిత విద్యుత్ ఇస్తామని ప్రకటన

  • ‘కల్యాణలక్ష్మి’తో పాటు ‘బంగారులక్ష్మీ’ ఉంటుందట

  • ఇల్లులేని పేదలకు గృహనిర్మాణానికి రూ.ఐదు లక్షల సాయం

  • 50 రోజుల్లో 100 బహిరంగ సభల నిర్వహణకు తెరాస వ్యూహం

హైదరాబాద్: మొత్తానికి తెలంగాణలో ముందస్తు ఊహాగానాల రాజకీయాలు ఊపందుకున్నాయి. అధికార తెరాస అసెంబ్లీని రద్దుచేసి ముందస్తు ఎన్నికలకు వెళ్లనుందని జరుగుతున్న ప్రచారం నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీ విశ్లేషకుల అంచనాలను తారుమారు చేస్తూ అధికార పార్టీ కన్నా ముందుగానే ఎన్నికల వరాలు ప్రకటించడానికి సిద్ధమైంది. ఈ మేరకు మాజీ మంత్రి టి. జీవన్‌ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీ బుధవారం ఇక్కడ సమావేశమయ్యింది.

ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలను తీసుకున్నట్లు ప్రకటించింది టీపీసీసీ. హౌసింగ్ స్కీం పైనే ప్రధాన చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ఇళ్లులేని వారికి కుటుంబానికి 5 లక్షలు, ఎస్సీ, ఎస్టీ వికలాంగులకు లక్ష అదనంగా ఇవ్వాలని కమిటీ నిర్ణయించినట్లు టీపీసీసీ అధ్యక్షుడు, మాజీ మంత్రి ఎన్. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి భేటీ అనంతరం మీడియాకు వెల్లడించారు. ఇందిరమ్మ ఇంటికి అదనంగా మరో గది నిర్మాణానికి రూ. 2 లక్షలు ఇవ్వాలని తీర్మానించినట్లు తెలిపారు.

తెల్లరేషన్ కార్డుదారులకు కూడా కాంగ్రెస్ వరాలు ప్రకటించింది. తెల్లరేషన్‌ కార్డు ఉన్న కుటుంబంలోని ప్రతి వ్యక్తికీ 7 కిలోల సన్న బియ్యం ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. మిడ్‌ మానేరు నిర్వాసితులకు డబుల్ బెడ్‌ రూమ్ ఇళ్లు, కల్యాణ లక్ష్మితో పాటు బంగారు లక్ష్మి పథకాన్ని కొనసాగించనున్నారు. వికలాంగులను పెళ్లి చేసుకుంటే 2 లక్షలు ఇవ్వాలని ప్రతిపాదన చేశారు.

వికలాంగుల శాఖ విలీనం రద్దు చేయనున్నారు. ఇంటి విద్యుత్ 200 యూనిట్ల వరకు ఉచితంగా ఇవ్వాలని మేనిఫెస్టో కమిటీ నిర్ణయించింది. మొత్తానికి టీపీసీసీ ముందస్తు ఎన్నికల వరాలు అధికార పార్టీలో ఎలాంటి కుదుపు తేనున్నాయో వేచిచూడాల్సిందే. మరోవైపు, ముందస్తు ఎన్నికల ప్రచారం ఊపందుకున్న నేపథ్యంలో తెరాస ప్రచార కార్యక్రమాలను ఉద్ధృతం చేయాలని నిర్ణయించింది.

రాష్ట్ర వ్యాప్తంగా రానున్న 50 రోజుల్లో కనీసం 100 బహిరంగ సభలు నిర్వహించనున్నట్లు తెరాస సీనియర్‌ నేత, రాష్ట్ర మంత్రి తన్నీరు హరీశ్‌రావు తెలిపారు. ఈనెల 7న హుస్నాబాద్‌లో సీఎం కేసీఆర్‌ బహిరంగ సభ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. సీఎం బహిరంగ సభ ఏర్పాట్లు, సభా స్థలాన్ని మంత్రలు ఈటల రాజేందర్‌, హరీశ్‌రావు, ఎంపీ వినోద్‌కుమార్‌, ఎమ్మెల్యే సతీష్‌కుమార్‌‌ బుధవారం పరిశీలించారు.

నాలుగేళ్లలో తెరాస ప్రభుత్వం చేసిన అభివృద్ధిని ప్రజలకు తెలియజేయడమే ప్రధాన ఉద్దేశంగా సభలు నిర్వహించనున్నట్లు హరీశ్‌రావు చెప్పారు. సీఎం బహిరంగ సభకు ‘ప్రజల ఆశీర్వాద సభ’గా నామకరణం చేసినట్లు తెలిపారు.