• నేతలకు దిశానిర్దేశం చేసిన చంద్రబాబు

  • హరికృష్ణకు ఘన నివాళి అర్పించిన పార్టీ

అమరావతి: అమరావతి ప్రజావేదిక హాల్లో తెదేపా అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అధ్యక్షతన తెలుగుదేశం పార్టీ రాష్ట్రస్థాయి కార్యశాల బుధవారం ప్రారంభమైంది. సమావేశం ప్రారంభానికి ముందు ఎన్టీఆర్‌, నందమూరి హరికృష్ణ చిత్రపటాలకు చంద్రబాబు, పార్టీ నేతలు నివాళులు అర్పించారు.

అనంతరం నందమూరి హరికృష్ణ మృతిపై తెదేపా ఏపీ శాఖ అధ్యక్షుడు, మంత్రి కళా వెంకట్రావు సంతాప తీర్మానం ప్రవేశపెట్టగా ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్‌తో సహా తెదేపా నేతలందరూ రెండు నిముషాలు మౌనం పాటించి, హరికృష్ణ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. చైతన్య రథసారథిగా హరికృష్ణ 78 వేల కిలోమీటర్లు ఒక్క ప్రమాదం లేకుండా నడిపారని నేతలు గుర్తుచేసుకున్నారు. అలాంటి వ్యక్తి రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం చాలా బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు.

హరికృష్ణ అందరికీ తలలో నాలుకగా ఉండేవారని, తెలుగు యువత అధ్యక్షునిగా, మంత్రిగా, రాజ్యసభ సభ్యునిగా, పొలిట్ బ్యూరో సభ్యునిగా హరికృష్ణ అందించిన సేవలు మరువలేనివని హరికృష్ణ నిరాడంబరంగా ఉండేవారని, ప్రయాణాల్లో జాగ్రత్తలు తీసుకోవడమే హరికృష్ణకు మనం అందించే ఘనమైన నివాళి అని, పార్లమెంటులో తెలుగు భాషలో తొలిసారి మాట్లాడిన వ్యక్తిగా హరికృష్ణ గుర్తింపు పొందారని, నేతలు ఈ సందర్భంగా హరికృష్ణతో తమ అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రసంగిస్తూ ఏపీలో జరుగుతున్న అభివృద్ధి గురించి, కేంద్రంపై చేస్తున్న ధర్మపోరాటం గురించి, విపక్షాల కుట్రలపై అప్రమత్తంగా ఉండాల్సిన విషయాల గురించి మాట్లాడారు.