కర్నూలు: పిల్లల బంగారు భవిష్యత్తును తీర్చిదిద్ది ఉత్తమ సంస్కారాన్ని, జ్ఞానాన్ని అందించడంలో ఉపాధ్యాయుల పాత్ర గణనీయమని, అలాంటి పరమ పవిత్రమైన ఉపాధ్యాయ వృత్తికి పాదాభివందనం చేస్తున్నట్లు కర్నూలు జిల్లా కలెక్టరు ఎస్.సత్యనారాయణ పేర్కొన్నారు. బుధవారం కలెక్టరేటులోని సునయన ఆడిటోరియంలో డాక్టరు సర్వేపల్లి రాధాకృష్ణన్ 130వ జయంతి సందర్భంగా ఉపాధ్యాయ దినోత్సవ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్‌తోపాటు కలిసి ఆయన పాల్గొన్నారు.

డాక్టరు సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పుష్పాలు సమర్పించి జ్యోతి ప్రజ్వలన అనంతరం కలెక్టరు మాట్లాడుతూ పిల్లలకు ఉన్నతమైన విలువలతో కూడిన విద్యనందించి మహోన్నత వ్యక్తులుగా తీర్చిదిద్దే గురుతర బాధ్యత ఉపాధ్యేయులదేనన్నారు. విద్యాపరంగా అక్షరాస్యతలో కర్నూలు జిల్లా అట్టడుగు స్థానంలో వుందని కేవలం 59.9 శాతం మాత్రమే అక్షరాస్యత వుందని నిరక్షరాస్యులందరినీ అక్షరాస్యుతులుగా తీర్చిదిద్దే బాధ్యత ఉపాధ్యాయులు స్వీకరించాలన్నారు.

ఈ ఏడాది 6.7 లక్షల మంది బడి బయట వున్న పిల్లలను పాఠశాలల్లో చేర్పించామన్నారు. అన్ని పాఠశాలల్లో డిజిటల్ తరగతులు, ఇతర మౌళిక వసతులు కల్పించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టరు తెలిపారు. జిల్లాలో 64 శాతం మంది విద్యార్థులు మాత్రమే విద్యనభ్యసిస్తున్నారని పిల్లలను చక్కగా చదివించేందుకు ఉపాధ్యాయులు మరింత శ్రమించాల్సివుందన్నారు. ఈ సంవత్సరం ప్రయివేటు పాఠశాలల్లో చదువుతున్న 16,777 మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలకు రావడంలో ఉపాధ్యాయుల కృషి శ్లాఘనీయమన్నారు.

గత సంవత్పరం 10వ తరగతి 25 లక్షల రూపాయలతో ఉత్తమ పాఠ్యంశాలతో కూడిన పుస్తకాలను అందించి 96.2 శాతం ఉత్తీర్ణత సాధించామని ఈ సంవత్సరం కూడా విద్యాపరంగా అవసరమైన సదుపాయాల కల్పనకు ప్రత్యేక యాప్‌ను రూపొందిస్తామన్నారు. ఈ యాప్ ద్వారా పాఠశాలలకు అవసరమైన వసతులు, పాఠ్యాంశాలపై ఏర్పాటుచేసేందుకు సిద్దంగా వున్నామన్నారు. గ్రామాల్లో పేదరికం వల్ల తల్లిదండ్రులు పిల్లలు విద్యనందింలేక పోతున్నారని అలాంటి పిల్లలను గుర్తించి తల్లిదండ్రులను ప్రోత్సహించేందుకు ఉపాధ్యాయులు శ్రద్ద తీసుకోవాలన్నారు.

ఉపాధ్యాయులు ఎంత కృషిచేస్తే అత్యంత ఫలితాలు వస్తాయని ప్రతి పాఠశాలను ఆదర్శ పాఠశాలగా తీర్చిదిద్దుకోవాలని సూచించారు. రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ మాట్లాడుతూ తల్లిదండ్రుల తర్వాత పిల్లలు ఉపాధ్యాయులతోనే అత్యంత చేరువగా, అనుబంధంగా వ్యవహరిస్తారని ఈ విషయాన్ని గుర్తెరిగి పిల్లలకు ఉత్తమ బోధన అందించాలన్నారు. ఫ్యాక్షన్ ప్రాంతమైన రాయలసీమ ప్రాంతం నుండే డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ పేరుతో ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకోవడం సంబరంగావుందన్నారు.

తాను చదువుకున్న రోజులలో ఉపాధ్యాయులు, విద్యార్థుల మధ్య ఆప్యాయతలు, ఆత్మీయతలు వుండేవని ప్రస్తుత కాలంలో అవి తగ్గిపోతున్నాయని అలాంటి ఆప్యాయత, ఆత్మీయతలు మళ్లీ రావాలని ఆయన ఆకాక్షించారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు సంయుక్త క్రమశిక్షణతో ఉత్తమ ఆర్గనైజేషన్ ఏర్పాటు కావాలని ఆయన సూచించారు. పాఠశాలల్లో విద్యాపరంగా ఏవైనా సమస్యలుంటే తన దృష్టికి తీసుకవస్తే పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. అనంతరం జిల్లా వ్యాప్తంగా 55 మంది ఉత్తమ ఉపాధ్యాయులకు, 23 మంది జూనియర్ కళాశాల అధ్యాపకులకు పురస్కార గ్రహీతలుగా సన్మానించారు.

ఈ కార్యక్రమంలో డీఈవో తహెరా సుల్తానా, రెండో జేసీ సుబ్బారెడ్డి, సర్వశిక్షా అభియాన్ ప్రాజెక్టు అధికారి తిలక్ విద్యాసాగర్, ఆర్ఐవో పరమేశ్వరరెడ్డి, డీయూఈవో వెంకట్రావు, డిప్యూటీ డీఈవో తదితరులు ప్రసంగించారు. కాగా, మహానంది పుణ్యక్షేత్ర పరిధిలోని ప్రభుత్వ గిరిజన ఆశ్రమ పాఠశాల సాంఘిక శాస్త్రాన్ని బోధించే ఉపాధ్యాయుడు చంద్రశేఖర్‌కు ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు లభించింది.

ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని బుధవారం గుంటూరులో సాంఘిక సంక్షేమ, గిరిజన శాఖల ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో చంద్రశేఖర్‌ రావును మంత్రులు, అధికారులు సన్మానించి ప్రశాంస పత్రాన్ని అందజేశారు. 2012 నుంచి ఆయన మహానందిలోని గిరిజన పాఠశాలలో పనిచేస్తున్నారు. పాఠశాల ఉపాధ్యాయులు ఆయనకు అభినందనలు తెలిపారు. మానవ విజ్ఞానానికి ఆలంబనగా నిలిచే చదువును బోధించే ఉపాధ్యాయుడు ప్రతి ఒక్కరికి మార్గనిర్దేశకుడని ఆదర్శ పాఠశాల ఇన్‌ఛార్జి ప్రిన్సిపల్‌ మరియదాసు పేర్కొన్నారు.

బుధవారం మహానంది మండలం ఎం. తిమ్మాపురం ఆదర్శ పాఠశాలలో ఉపాధ్యాయ దినోత్సవాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి గురువు విద్యార్థి యొక్క అజ్ఞాన అంధకారాలను తొలిగించే మహత్తర జ్యోతిగా వెలుగొందుతున్నారని అన్నారు. తల్లిదండ్రుల తర్వాత గురువుకే అత్యున్నత స్థానాన్ని మన సమాజం ఏర్పరిచిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు నరసింహులు, ఉపాధ్యాయులు పద్మనాభరావు, ఇతర ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని మండల స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన ఉపాధ్యాయులను పగిడ్యాల ఎంపీపీ దివ్య ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు.

అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎంపీపీ మాట్లాడుతూ ప్రతి ఉపాధ్యాయుడు విద్యార్థుల్లోని సృజనాత్మక శక్తులను బయటకు తీసి వారి విద్యాభివృద్ధికి తోడ్పాటు అందించాలని సూచించారు. ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన అలీ హుస్సేన్‌, సౌజన్య, ఈమామ్‌ బీ, శ్రీరాములు, సాహేదాబీలను శాలువాలు, పూల మాలలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్‌ జాకీర్‌ హుస్సేన్‌, ఇన్‌ఛార్జి ఎంపీడీవో గౌరీభాయి, మండల విద్యాధికారి సుభాన్‌, ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.