న్యూఢిల్లీ: ఇటీవ‌లే ముగిసిన 18వ ఆసియా క్రీడ‌లలో ప‌త‌కాలను గెలుచుకొన్న వారితో ప్ర‌ధానమంత్రి న‌రేంద్ర మోదీ బుధవారం త‌న నివాసంలో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ప‌త‌కాల‌ విజేతలకు ప్ర‌ధానమంత్రి ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. ఆసియా క్రీడ‌ల‌లో భార‌త‌దేశానికి ఇంత‌కు ముందు ఎన్న‌డూ ఎరుగ‌ని స్థాయిలో ఉత్త‌మ‌మైన ప‌త‌కాలను సాధించి పెట్టడంలో మార్గదర్శకమైన ప్ర‌ద‌ర్శ‌న‌ను ఇచ్చినందుకు వారికి ఆయ‌న అభినంద‌న‌లు తెలిపారు.

వారి క్రీడా విన్యాసాలు భార‌త‌దేశం హోదాను పెంచి, భార‌త‌దేశం గ‌ర్వ‌ప‌డే విధంగా చేశాయ‌ని ప‌త‌క విజేత‌లతో ఆయ‌న అన్నారు. ప‌త‌క విజేతలు నేల విడచి సాము చేయ‌బోర‌ని, వారికి ల‌భించిన ఖ్యాతి, ప్ర‌శంస‌ల కార‌ణంగా శ్ర‌ద్ధను కోల్పోబోర‌న్న ఆశాభావాన్ని ఆయన వ్య‌క్తం చేశారు. క్రీడాకారులు, క్రీడాకారిణులు వారి ప్ర‌ద‌ర్శ‌నను మెరుగుప‌ర‌చుకోవ‌డానికిగాను సాంకేతిక విజ్ఞానాన్ని వినియోగించుకోవాలని ప్ర‌ధాన మంత్రి సంభాష‌ణ క్ర‌మంలో వారికి విజ్ఞ‌ప్తి చేశారు.

అలాగే, వారు సాంకేతిక విజ్ఞానాన్ని ఉప‌యోగించుకొని వారి స్వీయ ప్ర‌ద‌ర్శ‌న‌కు మెరుగులు దిద్దుకోవడంతో పాటు ప్ర‌పంచంలోని అగ్ర‌గామి ఆట‌గాళ్ళంద‌రి ప్ర‌ద‌ర్శ‌న‌లను లోతుగా విశ్లేషించుకోవాల‌ని వారికి ఆయ‌న చెప్పారు. యువ ప్ర‌తిభావంతులు చిన్న ప‌ట్ట‌ణాల నుండి, ప‌ల్లె ప్రాంతాల నుండి, పేద‌ కుటుంబాల నుండి ఎదిగి వ‌చ్చి, దేశానికి ప‌త‌కాలను గెల‌వ‌డం పట్ల తాను సంతోషిస్తున్నాన‌ని ప్ర‌ధానమంత్రి అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో సిస‌లైన స‌త్తా దాగివుంద‌ని, అటువంటి ప్ర‌తిభాన్వితుల‌ను మ‌నం పెంచి పోషించుకుంటూవుండాల‌ని ఆయ‌న చెప్పారు.

క్రీడా రంగంలోని వ్య‌క్తులు దైనందిన జీవ‌నంలో ఏ విధ‌మైన సంఘ‌ర్ష‌ణ‌ల‌కు లోన‌వుతారో బాహ్య ప్ర‌పంచానికి తెలియదు అని కూడా ఆయ‌న చెప్పారు. దేశ ప్ర‌జ‌ల కోసం ఒక ప‌త‌కాన్ని గెలుచుకోవ‌డానికి అత్యంత క‌ష్టనష్టాల గుండా ప‌య‌నించిన కొద్ది మంది క్రీడాకారుల పేర్ల‌ను ప్ర‌స్తావిస్తున్న స‌మ‌యంలో ప్ర‌ధానమంత్రి ఉద్వేగ‌ భ‌రితుడ‌య్యారు. వారి వారి విభాగాల ప‌ట్ల వారికి ఉన్న అంకిత భావానికి, దృఢత్వానికి ఆయ‌న ప్రణామం ఘటించారు. వీరి ప్ర‌య‌త్నాల నుండి దేశంలోని మిగతా వ్యక్తులు ప్రేర‌ణ ను పొందగలరన్న ఆశాభావాన్ని కూడా ఆయ‌న వ్య‌క్తం చేశారు.

క్రీడాకారులు వారు సాధించిన విజ‌యాలతో సంతృప్తి ప‌డిపోరాద‌ని ప్రధాన మంత్రి మోదీ కోరారు. మ‌రింత ఖ్యాతి కోసం చెమ‌టోడ్చండంటూ వారికి ఆయ‌న సూచించారు. ప‌త‌కాల విజేత‌ల‌కు అతి పెద్ద స‌వాలు ఇప్పుడే మొద‌ల‌వుతుంద‌ని, వారు ఒలంపిక్ క్రీడ‌ల ఉన్నత వేదిక మీద‌కు చేరాల‌నే వారి ల‌క్ష్యాన్ని ఎన్న‌టికీ విడనాడకూడ‌ద‌ని ఆయ‌న చెప్పారు. యువజన వ్యవహారాలు, ఇంకా క్రీడల శాఖ స‌హాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత) కర్నల్ రాజ్యవర్ధన్ రాఠౌడ్ ఈ కార్య‌క్ర‌మంలో పాలుపంచుకొన్నారు.

ఆయ‌న తొలి ప‌లుకులు ప‌లుకుతూ ప‌త‌కాల ప‌ట్టిక మెరుగ‌వ‌డంలోను, యువ క్రీడాకారుల‌లో స్ఫూర్తిని నింప‌డంలోను ప్ర‌ధాన మంత్రి దార్శ‌నిక‌తతో పాటు ప్ర‌భుత్వ కార్య‌క్ర‌మాలు కూడా కీల‌క‌ భూమిక‌ను పోషించాయ‌న్నారు. ఇండోనేశియాలోని జ‌కార్తాలోను, పాలెంబాంగ్‌లోను నిర్వహించిన 18వ ఆసియా క్రీడ‌ల్లో భార‌త‌దేశం ఒక రికార్డు స్థాయిలో ఏకంగా 69 ప‌త‌కాల‌ను సంపాదించుకొంది. తద్వారా, 2010వ సంవ‌త్స‌రంలో జ‌రిగిన గ్వాంగ్ ఝోవూ ఆసియా క్రీడ‌ల్లో భారతదేశం ఖాతాలో చేరిన 65 ప‌త‌కాలను అధిగమించినట్లయింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here