వరంగల్: టీఆర్‌ఎస్ పార్టీపై తాజా మాజీ ఎమ్మెల్యే కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలను టీఆర్‌ఎస్ మఖ్య నేతలు ఖండించారు. కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లే ఉద్దేశంతో ఆమె టీఆర్‌ఎస్‌పై విమర్శలు చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ మండిప‌డ్డారు. కొండా సురేఖ, మురళి దంపతులు స్వయంగా తన దగ్గరకు వచ్చి టీఆర్‌ఎస్ రాజకీయ జీవితం ఇవ్వాలని అడిగారు అని వినయ్ గుర్తు చేశారు.

సురేఖ చేసిన ఆరోపణలపై వినయ్ స్పందిస్తూ సీఎం కేసీఆర్ పెద్ద మనసుతో కొండా దంపతులకు రాజకీయ జీవితం ప్రసాదించారని, తెలంగాణ కోసం కేసీఆర్ కుటుంబం అనేక త్యాగాలు చేసిందని, టీఆర్‌ఎస్‌లో చేరాక కొండా దంపతుల నడవడిక మారిందని, తన నియోజకవర్గం కాకపోయినప్పటికీ భూపాలపల్లి నియోజకవర్గంలో టీఆర్‌ఎస్ పార్టీకి వ్యతిరేకంగా తన కూతురుతో ప్రచారం చేయించారని, పార్టీలో కొనసాగుతూ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతూ కార్యకర్తల మధ్య చీలిక తెచ్చే విధంగా కొండా దంపతులు ప్రయత్నించారన్నారు.

కేసీఆర్ టీఆర్‌ఎస్ తరఫున టికెట్ ఇచ్చి ఆదుకోవడంతోనే వారు ఆర్థికంగా, రాజకీయంగా అభివృద్ధి చెందారని వినయ్ తెలిపారు. టీఆర్‌ఎస్ పార్టీలో గ్రూపులు లేవన్న విషయాన్ని కొండా దంపతులు తెలుసుకోవాలని వినయ్ భాస్కర్ సూచించారు. కాంగ్రెస్‌లోకి వెళ్లాలని కొండా దంపతులకు సీక్రెట్ ఎజెండా ఉంది. కొండా మురళి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాలని, కొండా దంపతులు కాంగ్రెస్‌తో టచ్‌లో ఉన్నారని ఉత్తమ్ కుమార్‌రెడ్డి చెప్పారని, వారి వ్యవహారశైలి వల్లే టికెట్ పెండింగ్‌లో పెట్టాల్సి వచ్చిందని, సర్వేల ఆధారంగానే అధినేత కేసీఆర్ టికెట్లను కేటాయించారన్నారు.

కొండా దంపతులు లేఖ రాస్తే ఆధారాలతో వివరణ ఇస్తామని వివరించారు. ‘కుడా’ భూములను వేలం పెడితే తనను కొండా మురళి బెదిరించారని టీఆర్‌ఎస్ నేత మర్రి యాదవరెడ్డి తెలిపారు. టీఆర్‌ఎస్‌లో ఉంటూ కొండా దంపతులు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారని విమర్శించారు.