న్యూఢిల్లీ, హైదరాబాద్, అమరావతి: పెట్రో ధరల పెంపును నిరసిస్తూ కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు సోమవారం జరిగిన భారత్‌ బంద్‌ దేశవ్యాప్తంగా ప్రశాంత వాతావరణంలో సాగింది. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో విపక్షాలకు చెందిన నేతలు, కార్యకర్తలు చమురు ధరల పెంపుపై ఆందోళనలు చేపట్టారు. యూపీ, ఒడిశా, రాజస్థాన్‌, కర్ణాటకతో పాటు తెలుగు రాష్ట్రాల్లోనూ నిరసనలు కొనసాగాయి.

ఏపీలోని శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, కడప, కర్నూలు, తెలంగాణలోని హైదరాబాద్, ఖమ్మం, వరంగల్‌, కరీంనగర్‌, భువనగిరి ప్రాంతాల్లో ఆర్టీసీ డిపోల ఎదుట కార్యకర్తలు ఆందోళనలు చేస్తూ బస్సులను అడ్డుకున్నారు. పలుచోట్ల నిరసనకారులను పోలీసులు అరెస్టు చేశారు. బంద్‌ ప్రభావం ప్రజారవాణా పడింది.

మరోవైపు, బంద్ ప్రభావం తెలుగు రాష్ట్రాల్లో పాక్షికంగానే కనిపించింది. ఈ బంద్‌కు వామపక్షాల సహా పలు రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు, కార్మిక సంఘాలు మద్దతు తెలిపాయి. సోమవారం ఉదయం ఆర్టీసీ బస్సులు డిపోల నుంచి బయటకు రాకుండా పలుచోట్ల ఆందోళనకారులు అడ్డుకున్నారు. హైదరాబాద్‌లోని ఇమ్లీబన్, జూబ్లీ బస్ స్టేషన్‌లలో ఆందోళనకారులు బస్సులను అడ్డుకున్నారు. దిల్‌సుఖ్‌నగర్‌, ఎల్‌బీ నగర్ చౌరస్తాలో నిరసనకారులు ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగించారు.

భారత్ బంద్ కారణంగా ఉస్మానియా యూనివర్సిటీలో జరగాల్సిన కొన్ని పరీక్షలను యూనివర్సిటీ అధికారులు వాయిదా వేశారు. సోమవారం జరగాల్సిన ప్రీ పీహెచ్‌డీ పరీక్ష మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా పడింది. మిగితా పరీక్షల షెడ్యూల్‌ను త్వరలోనే ప్రకటిస్తామని ఓయూ తెలిపింది. విజయవాడ బస్టాండ్‌ వద్ద అఖిలపక్ష నేతలు ఆందోళన చేపట్టారు.

బస్సులు బయటకు రాకుండా అడ్డుకోవడంతో కాసేపు ఉద్రిక్తత నెలకొంది. బంద్‌కు మద్దతుగా నగరంలోని విద్యా, వ్యాపార, వాణిజ్య సముదాయాలు మూతబడ్డాయి. అటు గుంటూరులోనూ వామపక్ష, జనసేన కార్యకర్తలు నిరసన తెలిపారు. గుంటూరు బస్టాండ్‌ వద్ద బస్సులను అడ్డుకోవడంతో వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శ్రీకాకుళం జిల్లాలో బంద్ ప్రభావం పాక్షికంగా ఉంది.

తెల్లవారుజాము నుంచే బస్సులు యథావిధిగా తిరుగుతున్నాయి. శ్రీకాకుళం, టెక్కలిలో బస్సులను అడ్డుకునేందుకు ప్రయత్నించిన కాంగ్రెస్‌, వామపక్షాలు, జనసేన పార్టీల నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో తెల్లవారుజాము నుంచి బంద్ పాక్షికంగా కొనసాగింది. ఆర్టీసీ డిపో నుంచి బస్సులు బయటకు రాకుండా కాంగ్రెస్ నాయకులు అడ్డుకున్నారు. దీంతో ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషప్‌కు తరలించారు. జనసేన పార్టీ కార్యకర్తలు డిపో ఎదుట బైటాయించి నిరసన తెలిపారు.

కేంద్ర ప్రభుత్వం పెంచిన డీజిల్, పెట్రో ధరలు వెంటనే తగ్గించాలంటూ ఆందోళన చేపట్టారు. కొయ్యలగూడెం, గోపాలపురం, పోలవరం, మండలాల్లో బంద్‌ కొనసాగింది. తిరుపతి, నెల్లూరు, ఒంగోలు, గుంటూరు, కర్నూలు, అనంతపురం, కడప జిల్లాల్లో కూడా బంద్ ప్రభావం అంతంత మాత్రంగానే కనిపించింది. ఇక, తెలంగాణలోని 31 జిల్లాల్లో పరిస్థితి ఇందుకు భిన్నంగా ఏమీ లేదు. మరోవైపు, బంద్‌కు ఆంధ్రప్రదేశ్‌లోని ఆర్టీసీ కార్మిక సంఘాలన్నీ మద్దతు ప్రకటించాయి.

రోజురోజుకీ పెరుగుతున్న డీజిల్ ధరల కారణంగా ఆర్టీసీపై ఆర్థిక భారం పెరిగిపోయిందని ఎంప్లాయిస్ యూనియన్ అధ్యక్షుడు వైవి రావు, కార్మిక పరిషత్ ప్రాంతీయ కార్యదర్శి రమేష్ అన్నారు. గత ఏడాది కాలంలో లీటర్ డీజిల్ పై 15 రూపాయలు పెరిగిందని, ఆర్టీసీ నష్టాలకు ఇదే ప్రధాన కారణమని వివరించారు. అందుకే బంద్‌కు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు స్పష్టం చేశారు. బంద్ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఆర్టీసీ డిపోల వద్ద నిరసన కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here