గెలుపోటములు ఎలా ఉన్నా రాష్ట్రంలో ఎన్నికల కోలాహలం మాత్రం ఊపందుకుంది. ఇంకా ప్రతిపక్షాలు పొత్తులు, సీట్ల పంపకాలపై చర్చల దశలోనే ఉన్న తరుణంలో ఏకంగా 105 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన టీఆర్‌ఎస్ జోరుగా ప్రచారం నిర్వహిస్తోంది. ఆయా నియోజకవర్గాల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థులు, శ్రేణుల విస్తృత ప్రచారంతో అంతా ఎన్నికల సందడి కనిపిస్తున్నది. తమ గ్రామాలకు వస్తున్న టీఆర్‌ఎస్ అభ్యర్థులకు ప్రజలు భారీ ర్యాలీగా ఎదురేగి ఘనస్వాగతం పలుకుతున్నారు.

నుదుట తిలకాలు దిద్ది మంగళహారతులు పడుతున్నారు. టీఆర్‌ఎస్ అభ్యర్థులకు ఓటు వేయాల్సిన అవసరాన్ని ప్రచారంలో పాల్గొంటున్న పలువురు నేతలు ప్రజలకు వివరించి చెప్తున్నారు. తమ తమ నియోజకవర్గాల్లో సాధించిన అభివృద్ధిని ప్రసంగాల్లో ప్రస్తావిస్తూ ఓట్లు అభ్యర్తిస్తున్నారు.

మరోవైపు, రాబోయే ఎన్నికల్లో తాము కారు గుర్తుకే ఓటేస్తామంటూ అనేక గ్రామాలు, కుల సంఘాలు ఏకగ్రీవంగా తీర్మానాలు చేస్తున్నాయి. పలుచోట్ల ప్రతిపక్షాలు తమ గ్రామాల్లోకి రావద్దంటూ గ్రామస్థులే ఫ్లెక్సీలు ఏర్పాటుచేయడం గమనార్హం. అన్నివర్గాల సంక్షేమమే ధ్యేయంగా పాలన సాగిస్తున్న సీఎం కేసీఆర్‌కు, టీఆర్‌ఎస్‌కు అండగా ఉంటామని, హుజూరాబాద్ ఎమ్మెల్యేగా పోటీచేస్తున్న మంత్రి ఈటల రాజేందర్‌ను గెలిపిస్తామని వరంగల్ అర్బన్ జిల్లా కమలాపూర్ మండలం మర్రిపెల్లిగూడెంలోని పద్మశాలి కులస్థులు సోమవారం ఏకగ్రీవంగా తీర్మానించారు. కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలోని కొత్తపల్లి మండలం బద్దిపల్లి, రాములపల్లి గ్రామస్థులు టీఆర్‌ఎస్ అభ్యర్థి గంగుల కమలాకర్‌కు ఓటు వేస్తామంటూ ఏకగ్రీవ తీర్మానం చేశారు. కమలాకర్ తమ గ్రామానికి చేసిన సేవలు మరిచిపోలేమని, అందుకు కృతజ్ఞతగానే ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు.

మేం టీఆర్‌ఎస్‌కు ఓటు వేయాలని తీర్మానం చేసుకున్నాం, మా గ్రామానికి ప్రతిపక్షాలు రావద్దు అంటూ గ్రామ పొలిమేరలో ఫెక్సీ ఏర్పాటుచేయడం విశేషం. రాజన్న సిరిసిల్ల జిల్లా చిన్నబోనాల గ్రామానికి చెందిన మున్నూరుకాపులు టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్‌రావు నేతృత్వంలో సమావేశమై టీఆర్‌ఎస్ అభ్యర్థి కల్వకుంట్ల తారకరామారావుకు ఓటువేస్తామని ఏకగ్రీవంగా తీర్మానించారు. జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం దమ్మన్నపేటకు చెందిన గొల్లకురుమల సంఘం సభ్యులు తమ ఓటును టీఆర్‌ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్‌కు వేస్తామని తీర్మానించారు. కరీంనగర్ జిల్లా హుజురాబాద్‌కు చెందిన 300 మంది మైనార్టీ మహిళలు టీఆర్‌ఎస్ అభ్యర్థి ఈటల రాజేందర్‌కు ఓటు వేస్తామని తీర్మానించుకున్నారు.

ఇప్పటికే ఎన్నికల ప్రచారంలో నిమగ్నమైన టీఆర్‌ఎస్ అభ్యర్థులు రాబోయే రోజుల్లో మరింత దూకుడు ప్రదర్శించేందుకు ప్రత్యేక ప్రచారరథాలు తయారు చేయించుకుంటున్నారు. ఇప్పటికే నాగర్‌కర్నూలు టీఆర్‌ఎస్ అభ్యర్థి మర్రి జనార్దన్‌రెడ్డి ప్రచారరథాన్ని తయారుచేయించుకోగా తాజాగా మిషన్ భగీరథ వైస్ చైర్మన్, బాల్కొండ టీఆర్‌ఎస్ అభ్యర్థి వేముల ప్రశాంత్‌రెడ్డి ఎన్నికల ప్రచారరథం సిద్ధమైంది. గ్రామాల్లో ఐదు వేల నుంచి పదివేల మంది ప్రజలను సమీకరించినచోట మాట్లాడేందుకు, సాంస్కృతిక బృందాలు పాటలు పాడేందుకు వీలుగా టీఆర్‌ఎస్ అభ్యర్థులు ఐషర్ వాహనాలను డిజైన్ చేయించుకుంటున్నారు.
ఈ వాహనంలో 20 నుంచి 30 మంది వరకు నిల్చునే అవకాశం ఉంటుంది.

కొందరు అభ్యర్థులు మూడు నాలుగు వాహనాలకు ఆర్డర్ ఇచ్చినట్టు సమాచారం. ఏపీలోని గుంటూరులో ఐషర్ వాహన డీలర్ రామ్‌కోర్ సంస్థ వీటిని తయారుచేస్తోంది. ఇప్పటికే ఉమ్మడి వరంగల్, కరీంనగర్, మహబూబ్‌నగర్ జిల్లాలకు చెందిన 20 మందికిపైగా అభ్యర్థులు ప్రచారరథాల కోసం ఆర్డర్ ఇచ్చినట్టు తెలిసింది. సభలోని ప్రతి ఒక్కరికీ అభ్యర్థి మాటలు వినిపించేలా మైక్ సిస్టం, విద్యుత్ సదుపాయం కోసం రెండు జనరేటర్లు ఇందులో ఉంటాయి. ప్రచార రథంపై పార్టీ అధినేత కేసీఆర్, పార్టీ అభ్యర్థి చిత్రాలు, ఎన్నికల చిహ్నమైన కారు గుర్తుతోపాటు వివిధ ప్రభుత్వ పథకాల చిత్రాలుండేలా రూపొందిస్తున్నారు.

వారం పదిరోజుల్లో ఇంకా పెద్దసంఖ్యలో ప్రచార రథాల ఆర్డర్లు వస్తాయని తయారీదార్లు అంచనా వేస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు, మంత్రి కేటీఆర్ అంటే తనకు చెప్పలేనంత అభిమానమని, వారి మాటను తూచ తప్పక పాటిస్తానని ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గానికి చెందిన సీనియర్ నేత బొమ్మెర రామ్మూర్తి చెప్పారు. రాష్ట్రానికి సీఎం కేసీఆర్ పాలనే శ్రీరామరక్ష అన్నారు.

ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డితో కలిసి క్యాంపు కార్యాలయంలో మంత్రి కేటీఆర్‌తో బొమ్మెర రామ్మూర్తి భేటీ అయ్యారు. అనంతరం రామ్మూర్తి మీడియాతో మాట్లాడుతూ మధిరలో గులాబీ జెండా ఎగురవేసి కేసీఆర్, కేటీఆర్‌లకు కానుకగా అందిస్తామన్నారు. ప్రాణమున్నంత వరకు టీఆర్‌ఎస్ పార్టీలోనే ఉంటానని రామ్మూర్తి స్పష్టంచేశారు. కారు జోరుమీదుంది! ప్రచారంలో దూసుకుపోతోంది.

ఆ పార్టీ అభ్యర్థులు గ్రామాల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ముమ్మరంగా ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. నాయకులు, కార్యకర్తలు కలిసి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళుతున్నారు. వచ్చే ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటేసి టీఆర్‌ఎస్ పార్టీని గెలిపించాల్సిందిగా అభ్యర్థిస్తున్నారు. నియోజకవర్గాల్లో పర్యటిస్తున్న అభ్యర్థులకు ప్రజలనుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. ఎక్కడికి వెళ్లినా జనాలు సాదరంగా ఆహ్వానించి కారు గుర్తుకే ఓటు వేస్తామని తెలుపుతున్నారు.

ఓ వైపు, ప్రభుత్వ సంక్షేమ పథకాలతో తాము లబ్ధి పొందామని, పింఛన్ వచ్చిందని, కల్యాణలక్ష్మి ద్వారా ఆర్థిక సహాయం అందిందని, రైతుబంధు, రైతుబీమా ద్వారా భరోసా దక్కిందని ప్రజలు చెబుతుంటే, మరోవైపు గ్రామాలకు గ్రామాలు, కులసంఘాలు ఏకగ్రీవంగా తీర్మానించుకుని టీఆర్‌ఎస్ అభ్యర్థికే మా ఓటు అంటూ మద్దతు ప్రకటిస్తున్నాయి. మరోవైపు, జనగామ టీఆర్‌ఎస్ అభ్యర్థి ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డికి పెంబర్తి కాకతీయ కళాతోరణం వద్ద ప్రజాప్రతినిధులు, నాయకులు, వేలాది మంది కార్యకర్తలు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. మహిళలు పూలుచల్లి హారతులిచ్చి నుదుట వీరతిలకం దిద్దారు.

అనంతరం జనగామ వరకు దాదాపు 3 వేల బైక్‌లతో భారీర్యాలీ నిర్వహించారు. కరీంనగర్ జిల్లా మానకొండూర్ అభ్యర్థి, తాజా మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌కు నాయకులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. హైదరాబాద్ నుంచి వచ్చిన ఆయన ముందుగా తిమ్మాపూర్ ఎల్‌ఎండీ కాలనీలోని అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించారు. అనంతరం అల్గునూర్ చౌరస్తా నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలతో భారీ వాహన ర్యాలీ నడుమ ఓపెన్‌టాప్ జీప్‌పై ప్రజలకు అభివాదం చేస్తూ మానకొండూర్‌కు చేరుకుని ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా నాయకులు, కార్యకర్తలు, మహిళలు రసమయికి పూలమాలలు వేసి, మంగళహారతులు ఇచ్చి సాదరంగా ఆహ్వానించారు.

ఖమ్మం జిల్లా సత్తుపల్లి టీఆర్‌ఎస్ అభ్యర్థి పిడమర్తి రవి నియోజకవర్గంలోని రామానగరం, పెనుబల్లి, పాతకారాయిగూడెం, కోండ్రుపాడు గ్రామాల్లో పర్యటించారు. రామాలయంలో పూజలు చేశారు. చర్చిలో జరిగిన ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఇంటింటికీ తిరుగుతూ కారు గుర్తుకు ఓటేయాలని ప్రజలను కోరారు. వైరా అభ్యర్థి బానోతు మదన్‌లాల్ ఏన్కూరు మండలంలోని కల్యాణ మండపం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు యల్లంకి గార్డెన్స్‌లో జరిగిన పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. టీఆర్‌ఎస్ గెలుపుకోసం కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని సూచించారు.

నాగర్‌కర్నూల్ టీఆర్‌ఎస్ అభ్యర్థి తాజామాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి సోమవారం తొలిసారిగా నియోజకవర్గంలో అడుగుపెట్టిన సందర్భంగా నాయకులు, కార్యకర్తలు, ప్రజలు ఘనంగా స్వాగతం పలికారు. మహిళలు నుదుట తిలకందిద్ది హారతులు పట్టారు. అనంతరం తిమ్మాజీపేట మండలం మీదుగా బిజినేపల్లి, నాగర్‌కర్నూల్‌కు భారీ ర్యాలీ నిర్వహించారు. నిర్మల్ జిల్లా కడెం మండలం దేవునిగూడెంలో టీఆర్‌ఎస్ అభ్యర్థి రేఖానాయక్ ప్రచారం చేశారు. కామారెడ్డి అభ్యర్థి గంప గోవర్ధన్‌కు ఘన స్వాగతం లభించింది. భిక్కనూరు మండలం బస్వాపూర్ నుంచి జిల్లాకేంద్రం వరకు శ్రేణులు భారీ ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా పార్శి కల్యాణ మండపంలో శ్రేణులతో సమావేశం నిర్వహించి తన గెలుపునకు కృషిచేయాల్సిందిగా కోరారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో పాలిస్టర్ వస్త్ర ఉత్పత్తిదారుల సంఘ భవనంలో జరిగిన కార్యకర్తల సమావేశంలో ఎమ్మెల్సీ భానుప్రసాద్ పాల్గొన్నారు.

కార్యకర్తలు, నాయకులకు దిశానిర్దేశం చేశారు. పార్టీ గెలుపుకోసం ప్రతి కార్యకర్త కృషిచేయాలని సూచించారు. జగిత్యాల జిల్లా కోటిలింగాలలో తాజామాజీ ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్ ఎన్నికల ప్రచారాన్ని చేపట్టారు. తన సతీమణి స్నేహలత, నాయకులతో కలిసి ఇంటింటికీ వెళ్లి కారు గుర్తుకు ఓటేసి తనను గెలిపించాలని కోరారు. మహబూబాబాద్ అభ్యర్థి బానోత్ శంకర్‌నాయక్ జిల్లాకేంద్రంలోని టీఆర్‌ఎస్ నాయకులు గణపురపు అంజయ్య ఇంటికి వెళ్లి తన గెలుపునకు కృషి చేయాలని కోరారు.

అన్నివర్గాల సంక్షేమమే ధ్యేయంగా పాలన సాగిస్తున్న సీఎం కేసీఆర్‌కు, టీఆర్‌ఎస్ పార్టీకి అండగా ఉంటామని హుజూరాబాద్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీచేస్తున్న మంత్రి ఈటల రాజేందర్‌ను గెలిపిస్తామని పద్మశాలీ కులస్థులు ప్రతిజ్ఞ చేశారు. వరంగల్ అర్బన్ జిల్లా కమలాపూర్ మండలం మర్రిపెల్లిగూడెం పద్మశాలీ కులస్థులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి పార్టీ అభ్యర్థిని గెలిపిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి ఈటల రాజేందర్ చిత్రపటాల వద్ద సోమవారం ఏకగ్రీవ తీర్మానం చేశారు.

ఈ కార్యక్రమంలో చేనేత సంఘం గ్రామాధ్యక్షుడు పొరండ్ల కృష్ణప్రసాద్, పద్మశాలీ సంఘం అధ్యక్షుడు పోరండ్ల వైకుంఠం, నాయకులు ఆనందం, జయపాల్, మురళి, జయచందర్, సాంబయ్య తదితరులు పాల్గొన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీ 100 స్థానాల్లో ఘన విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తుందని టీఆర్‌ఎస్ లోక్‌సభ ఫ్లోర్‌లీడర్, ఎంపీ జితేందర్‌రెడ్డి స్పష్టంచేశారు. సోమవారం మహబూబ్‌నగర్ జిల్లా మక్తల్‌లో టీఆర్‌ఎస్ అభ్యర్థి చిట్టెం రామ్మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యకర్తల సమావేశానికి ఎంపీ హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శాసనసభను రద్దుచేసి కాలయాపన చేయకుండా ఒకేసారి 105 మంది అభ్యర్థులను ప్రకటించి సీఎం కేసీఆర్ తన ప్రత్యేకతను మరోసారి చాటుకున్నారని తెలిపారు. నాయకులు, కార్యకర్తలందరూ సైనికుల్లా కృషిచేసి చిట్టెం రామ్మోహన్‌రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలని కోరారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ అభ్యర్థి ఆశన్నగారి జీవన్‌రెడ్డి చేపట్టిన ఆశీర్వాద ర్యాలీకి ప్రజలనుంచి అపూర్వ స్వాగతం లభించింది. పార్టీ అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత జీవన్‌రెడ్డి తొలిసారిగా సోమవారం ఆర్మూర్‌కు వచ్చారు.

ఈ సందర్భంగా టీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, కులసంఘాలు, యువజన సంఘాలు, గ్రామాభివృద్ధి కమిటీల సభ్యులు జీవన్‌రెడ్డికి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా 1000 కార్లు, 500 బైక్‌లతో ర్యాలీ జరిగింది. ఆర్మూర్, నందిపేట్, మాక్లూర్ మీదుగా రాత్రి ఓడ్యాట్‌పల్లికి చేరుకున్న ఈ ర్యాలీకి అడుగడుగునా ప్రజలు నీరాజనం పలికారు. పూలవర్షం కురిపించారు. ఓడ్యాట్‌పల్లిలోని ఓడ్డెటమ్మ ఆలయంలో ఆశన్నగారి జీవన్‌రెడ్డి, రజితారెడ్డి దంపతులు ప్రత్యేకంగా పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. తెలంగాణ రాష్ట్ర సమితికి అండగా పల్లెలు కదులుతున్నాయి. అభివృద్ధి చేసిన పార్టీ అభ్యర్థులకు పట్టం కడుతామంటూ ఏకగ్రీవంగా తీర్మానాలు చేస్తున్నాయి.

పలు కులసంఘాలు కూడా ముందుకొస్తున్నాయి. కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలోని కొత్తపల్లి మండలం బద్దిపల్లి, రాములపల్లి గ్రామస్థులు టీఆర్‌ఎస్ అభ్యర్థి గంగుల కమలాకర్‌కు ఓటు వేస్తామని ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. గంగుల కమలాకర్ గ్రామానికి చేసిన సేవలు మరిచిపోలేమని, అందుకు కృతజ్ఞతగానే టీఆర్‌ఎస్‌కు ఓటువేయాలని నిర్ణయించుకున్నామని గ్రామస్థులు తె లిపారు. అంతేకాదు మేం టీఆర్‌ఎస్‌కు ఓటు వేయాలని తీర్మానం చేసుకున్నాం, మా గ్రామానికి ప్రతిపక్షాలు రావద్దు అంటూ గ్రామపొలిమేరలో ఫెక్సీని ఏర్పాటుచేయడం విశేషం.

రాజన్న సిరిసిల్ల జిల్లా చిన్నబోనాల గ్రామానికి చెందిన మున్నూరుకాపులు టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్‌రావు నేతృత్వంలో సమావేశమై టీఆర్‌ఎస్ అభ్యర్థి తారకరామారావుకు ఓటువేస్తామని ఏకగ్రీవ తీర్మానం చేయడంతో పాటు ప్రతిజ్ఞ చేశారు. జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం దమ్మన్నపేటకు చెందిన గొల్లకురుమ సంఘం సభ్యులు సమావేశమై తమ ఓటును టీఆర్‌ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్‌కు వేస్తామని ఏకగ్రీవ తీర్మానం చేశారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌కు చెందిన మూడువందల మంది మైనార్టీ మహిళలు టీఆర్‌ఎస్ అభ్యర్థి ఈటల రాజేందర్‌కు ఓటు వేస్తామని తీర్మానించుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here