• పట్టించుకోని కేంద్ర ప్రభుత్వ తీరు

  • నిరసనగా నేడు విపక్షాల భారత్ బంద్‌

న్యూఢిల్లీ: ఇంధన ధరలు దేశప్రజానీకాన్ని బెంబేలెత్తిస్తున్నాయి. పెట్రోల్ బంకుకు వెళ్లాలంటేనే గుండెదడ వచ్చేలా ఇంధన ధరలు దేశప్రజానీకాన్ని బెంబేలెత్తిస్తున్నాయి. రూ.90కి చేరువైన లీటర్ పెట్రోల్ ధర త్వరలోనే సెంచరీ కొట్టేలా కనిపిస్తోంది. మునుపెన్నడూ లేనివిధంగా ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర తొలిసారిగా ఆదివారం రూ.80.50ని తాకింది. డీజిల్ ధర కూడా రికార్డు స్థాయిలో రూ.72.61కి చేరుకుంది. డాలర్‌తో పోల్చితే రూపాయి పతనం కూడా ఈ ధరల పెరుగుదలకు కారణమవుతోంది.

ఇంధన ధరల పెరుగుదల ప్రభావం కారణంగా నిత్యావసర వస్తువుల ధరలు కూడా ఆకాశాన్నంటుతున్నాయి. లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ సోమవారం దేశవ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చింది. పెట్రోల్, డీజిల్‌పై వ్యాట్, ఎక్సైజ్ సుంకాల తగ్గింపుతో పెట్రో ధరల్ని అదుపుచేయాలని, చమురు ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి చేర్చాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.

2014లో పెరిగిన ధరలను తన ప్రచారాస్త్రంగా చేసుకుని నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చారు. ఇప్పుడదే అస్త్రాన్ని మోదీ పాలనపై ప్రయోగించాలని కాంగ్రెస్ వ్యూహంగా కనిపిస్తోంది. యూపీఏ హయాంలో ఇంధన ధరలు పెరిగినప్పుడు పార్లమెంట్‌లో ఆనాటి ప్రధాని డాక్టర్ మన్మోహన్‌సింగ్‌ను బీజేపీ నేతలు లక్ష్యం చేసిన రెండు వీడియోలను కాంగ్రెస్ పార్టీ ఆదివారం తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేసింది. కాంగ్రెస్ భారత్ బంద్ పిలుపునకు పలు పార్టీలు మద్దతు ప్రకటించాయి.

ప్రజలకు అసౌకర్యం కలుగకుండా ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు బంద్ నిర్వహించాలని కాంగ్రెస్ పిలుపునిచ్చింది. బ్యాంకులు యథావిధిగా పనిచేస్తాయని అఖిల భారత బ్యాంకు ఉద్యోగుల సంఘం ప్రకటించింది. దేశంలో ఎన్నడూ లేనివిధంగా పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెరిగిపోయాయి. డాలర్‌తో పోల్చితే రూపాయి పతనం కూడా ఈ ధరల పెరుగుదలకు కారణమవుతోంది. ఇంధన ధరలు పెరుగుదలతో నిత్యావసర వస్తువుల ధరలూ ముఖ్యంగా కూరగాయల ధరలు ఊహించని రీతిలో పెరిగాయి. చివరకు అన్నీ కలిసి సామాన్యుడిపై భారం మోపుతున్నా కేంద్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నదని ప్రతిపక్ష పార్టీలు తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నాయి.

‘‘నాలుగేళ్ల నరేంద్ర మోదీ ప్రభుత్వ పాలనలో పెట్రోల్ ధరలు 50 శాతం పెరిగాయి. ఎక్సైజ్ సుంకం పెట్రోల్‌పై 211శాతం, డీజిల్‌పై 443శాతం పెరిగాయి. అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు పడిపోతుంటే, మోదీ సర్కార్ సుంకాలను పెంచి మరీ ఇంధన ధరలు మరింత పెరిగేలా చేస్తూ సామాన్యుడి నడ్డివిరుస్తోంది’’ అని కాంగ్రెస్ ప్రతినిధి రణ్‌దీప్ సూర్జేవాలా విమర్శించారు. భయపడొద్దంటున్న అరుణ్ జైట్లీ తీరు ఆక్షేపణీయమని కాంగ్రెస్ సీనియర్ నేత ఆనంద్‌శర్మ అన్నారు.

కాంగ్రెస్ భారత్ బంద్‌కు పలు రాజకీయ పార్టీలు మద్దతు తెలపగా, కొన్ని పార్టీలు మాత్రం ఈ బంద్‌కు దూరంగా ఉండాలని నిర్ణయించాయి. డీఎంకే, జేడీఎస్, ఆర్జేడీ, సమాజ్‌వాదీ పార్టీ, ఎన్సీపీ, వామపక్షాలు సహా పలు విపక్ష పార్టీలు బంద్‌కు మద్దతు తెలిపాయి. తొలిసారి రాజ్‌థాకరే నాయకత్వంలోని మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన (ఎంఎన్‌ఎస్) జత కలిసింది. ఏపీలోని పవన్‌కళ్యాణ్ పార్టీ జనసేన కూడా మద్దతు ప్రకటించింది. ఎన్డీయే భాగస్వామ్య పార్టీ శివసేన బీజేపీ తీరుపై తన విమర్శనాస్త్రాలు కొనసాగిస్తోంది. బీఎస్పీ, ఏఐఏడీఎంకే పార్టీలు మాత్రం తమ వైఖరి చెప్పలేదు.

పశ్చిమ బెంగాల్ సహా పలు చోట్ల వామపక్షాలు బంద్‌కు పిలుపునిచ్చాయి. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఒడిశా, బీహార్, తమిళనాడు విపక్షపార్టీలు, కర్ణాటకలో అధికార కాంగ్రెస్-జేడీఎస్ కూటమి బంద్ పాటించనున్నాయి. ఇంధన ధరలపై విపక్షాలు లేవనెత్తుతున్న అంశాలతో తాము ఏకీభవిస్తున్నామని చెబుతున్న తృణమూల్ కాంగ్రెస్ బంద్‌కు మాత్రం దూరంగా ఉండాలని నిర్ణయించింది. పెట్రో, డీజిల్ ధరలు సరికొత్త రికార్డు స్థాయిలను దాటుకుంటూ దూసుకుపోతున్నాయి.

ఆదివారమూ పెట్రోల్, డీజిల్ ధరలు చుక్కలనంటాయి. సరిగ్గా రెండేళ్ల క్రితం 2016 సెప్టెంబర్‌లో లీటర్ రూ.64గా ఉన్న పెట్రోలు ధర ప్రస్తుతం రూ.85ను దాటింది. ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర తొలిసారి ఆదివారం రూ.80.50ని తాకింది. డీజిల్ ధర కూడా రికార్డు స్థాయిలో రూ.72.61ని చేరుకుంది. మెట్రో నగరాలు, వివిధ రాష్ట్రాల రాజధాని నగరాలన్నింటిలో ఇదే అతితక్కువ ధర. దేశంలో అత్యధికంగా ముంబయిలో పెట్రోలు ధర రూ.87.89కి చేరుకోగా, డీజిల్ ధర రూ.77.09కి చేరింది. ఇదే స్థితి కొనసాగితే, రెండురోజుల్లో ఈ ధర రూ.90కి చేరుతుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

హైదరాబాద్‌లో ధర ఆదివారం 12పైసలు పెరిగి రూ.85.35కు ఎగబాకింది. డీజిల్ ధర 11 పైసలు పెరిగి రూ.78.98కి చేరింది. డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ రూ.72.1 వద్ద కదలాడుతున్న నేపథ్యంలో ముడి చమురు దిగుమతుల నష్టాల భర్తీ కోసం చమురు సంస్థలు వరుస వడ్డింపులకు దిగుతున్నాయి. నెలరోజులుగా ముడి చమురు ధరల పెరుగుదల, డాలర్‌తో రూపాయి క్షీణత ఫలితంగా దేశీయంగా ఇంధన ధరల్లో తీవ్ర పెరుగుదల నమోదవుతోంది.

అది అంతిమంగా ద్రవ్యోల్బణంగా మారే ప్రమాదమున్నందున, నియంత్రించాల్సిన ప్రభుత్వం చేష్టలుడిగి చూస్తోందని విపక్షాలు విమర్శిస్తున్నాయి. ఆయా రాష్ట్రాల్లో ఎన్నికలప్పుడు రోజులు, నెలల తరబడి ధరల జోలికి చమురు మార్కెటింగ్ సంస్థలు వెళ్లకుండా కట్టడి చేయగలిగిన ప్రభుత్వం ఇప్పుడెందుకు ఆ పని చేయడం లేదని ప్రశ్నిస్తున్నాయి. 2014 నుంచి ఇప్పటివరకు ఎక్సైజ్ సుంకం పెట్రోల్‌పై 211.7%, డీజిల్‌పై 433% పెరిగింది. 2014లో లీటర్ పెట్రోల్‌పై ఎక్సైజ్ సుంకం రూ.9.2గా ఉండగా, ప్రస్తు తం 19.48కి పెరిగింది. డీజిల్‌పై 2014లో రూ.3.46గా ఉన్న సుంకం ప్రస్తుతం రూ.15.33కి చేరింది.

అంతర్జాతీయ ధరల సాకుతో 2014-2016 మధ్య 9 సార్లు సవరించిన ఎక్సైజ్ సుంకంతో కేంద్రానికి ఆదాయం గత నాలుగేండ్లలో గణనీయంగా పెరిగిపోయింది. 2014-15లో కేంద్రం రూ. 99,184 కోట్లు.. 2017-18కల్లా రూ.2,29,019 కోట్లు ఆర్జించింది. రాష్ట్రాల వ్యాట్ ఆదాయం 2014-15లో రూ.1,37,157 కోట్లు.. 2017-18కల్లా రూ.1,84,091 కోట్లకు చేరుకుంది.