• పంచాయతీ కార్యదర్శికి ఫోనులో బెదిరింపు

విజయవాడ: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హోం శాఖ మంత్రిగా పనిచేసిన వసంత నాగేశ్వరరావుపై కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం పోలీసులు కేసు నమోదు చేశారు. తనకు ఫోన్‌ చేసి బెదిరించారని గుంటుపల్లి పంచాయతీ కార్యదర్శి నల్లారి వెంకటనరసింహారావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు చర్యలు చేపట్టారు. గ్రామంలో ఫ్లెక్సీల తొలగింపు విషయంలో ఈ నెల 7న సాయంత్రం విధుల్లో ఉన్న తనకు వసంత నాగేశ్వరరావు ఫోన్‌ చేసి తెలుగుదేశం ఏజెంటుగా పనిచేస్తున్నావంటూ బెదిరించారని ఆరోపించారు.

మీ మంత్రిని (దేవినేని ఉమాను) ఏమైనా చేస్తామని, అవసరమైతే కడప నుంచి మనుషులను తెప్పిస్తామని మాట్లాడారని కార్యదర్శి తన ఫిర్యాదులో పేర్కొన్నారు. తన పిల్లలు ఎక్కడ చదువుతున్నారంటూ ఆరా తీశారని, తనకు, తన కుటుంబానికి ప్రాణహాని ఉందని వివరించారు. ఫిర్యాదును పరిగణనలోకి తీసుకున్న పోలీసులు ఆడియోటేప్‌ను విన్నారు. ప్రస్తుతం జగన్ నాయకత్వంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో కీలకంగా వ్యవహరిస్తున్న నాగేశ్వరరావుపై కేసు నమోదైన విషయం సంచలనాత్మకంగా మారింది. ‘‘నేనైతే ఒక పద్ధతి కలిగిన వ్యవహారంగా చేస్తా. కానీ కృష్ణప్రసాద్‌ (వసంత నాగేశ్వరరావు కుమారుడు) అలా కాదు. మొండిగా వ్యవహరిస్తాడు. తాడోపేడో తేల్చుకోవాలనే లెక్కల్లో ఉన్నాడు.

డబ్బుకు, మర్డర్లకు తెగించే ఉన్నాడు. ఉమా దాడి చేయలేడనే భావన వాళ్ల మనుషుల్లో ఉంది. ఒక్క కృష్ణప్రసాద్‌కే కాదు జగన్‌కు కూడా వీడిపై (దేవినేని ఉమా) కక్ష ఉంది. అతడు అసెంబ్లీలో అసహ్యంగా మాట్లాడుతున్నాడు అని. వీడిని శాసనసభలో చూడడానికి వీల్లేదని జగన్‌కూ ఉంది. గుంటూరు-2 టికెట్‌ ఇస్తానని సీఎం ప్రత్తిపాడు వాళ్లను పంపాడు. నేను ఓడించాలన్న (దేవినేని ఉమాను) లక్ష్యంతో వచ్చా. తాడోపేడో తేల్చుకోవాలి’’ అని వసంత ఫోన్‌ సంభాషణలో పేర్కొన్నారు.

న్యాయ సలహా కోసం పోలీసులు ఆడియోటేపును ఫోరెన్సిక్‌ ప్రయోగశాలకు పంపించనున్నారు. ప్రభుత్వ ఉద్యోగి విధులకు ఆటంకం కలిగించారని, పరుష పదజాలంతో బెదిరించారన్న అంశంపై వసంత నాగేశ్వరరావుపై కేసు నమోదు చేసినట్లు సీఐ పవన్‌కిషోర్‌ తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here