• అక్రమ కేసులు పెడుతున్నారని ఆవేదన

  • ర్యాలీ నిర్వహిస్తే నోటీసులు ఇస్తారా అని ప్రశ్న

హైదరాబాద్: కేసీఆర్ నాయకత్వంలోని తెరాస అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని, విపక్షాలపై అనవసర కక్ష సాధింపు చర్యలకు దిగుతోందనీ గోషామహల్‌ తాజా మాజీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ ఆరోపించారు. తనకు అబిడ్స్ పోలీసులు నోటీసులు జారీ చేయడాన్ని తీవ్రంగా పరిగణించిన రాజాసింగ్ కేసీఆర్‌పై ధ్వజమెత్తారు. 41ఏ సీఆర్‌పీసీ కింద ఆబిడ్స్‌ పోలీసులు రాజాసింగ్‌కు నోటీసులిచ్చారు. ఈ నెల 17న పోలీస్‌స్టేషన్‌కు వచ్చి వివరణ ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొన్నారు.

అనుమతి లేకుండా ఆగస్టు 15న ర్యాలీ నిర్వహించినందుకు గాను ఆయనపై కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో సింగ్ రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తనపై అక్రమ కేసులు పెట్టడాన్ని ఆయన ఖండించారు. ఆగస్టు 15న అనుమతి లేకుండా తిరంగా జెండా ర్యాలీ నిర్వహించినందుకు తనపై ఐదు పోలీస్‌స్టేషన్లలో కేసులు నమోదు చేశారని ఆయన తెలిపారు.

దేశభక్తిని చాటేందుకు తిరంగా యాత్ర నిర్వహిస్తే ఇలాంటి కేసులు పెట్టడం దారుణమని ఆవేదనన వ్యక్తం చేశారు. ఈ కేసుకు సంబంధించి తమ ఎదుట హాజరు కావాల్సిందిగా అబిడ్స్ పోలీసులు తనకు నోటీసులు జారీ చేశారని తెలిపారు. కేవలం మజ్లీస్ పార్టీ ఒత్తిడి మేరకే తనపై ర్రాష్ట్ర ప్రభుత్వం అక్రమ కేసులు బనాయించిందని, ఈ కేసులకు బెదిరేది లేదన్నారు. తనపై నమోదైన కేసులపై కోర్టులోనే తేల్చుకుంటానని రాజాసింగ్ స్పష్టం చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here