• కొచ్చిలోని నివాసంలో గుండెపోటుతో మృతి

కొచ్చి: బహు భాషా నటుడిగా భారతీయ సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు తెచ్చుకుని దర్శకుడిగా కూడా మారి తన ప్రతిభను చాటుకున్న కెప్టెన్‌ రాజు కన్నుమూశారు. 68 ఏళ్ల రాజు సోమవారం తెల్లవారుజామున కొచ్చిలోని తన నివాసంలో గుండెపోటుతో మరణించారు.

1981లో వచ్చిన ‘రక్తం’ చిత్రంతో కెప్టెన్ రాజు తెరంగేట్రం చేశారు. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడం, హిందీ, ఇంగ్లిష్‌ భాషల్లో ఆయన దాదాపు 500 చిత్రాల్లో నటించారు. ఆయన కొంతకాలం భారతీయ ఆర్మీలోనూ పనిచేయడంతో అందరూ ‘కెప్టెన్‌’ అని పిలుస్తుండేవారు. తెలుగులో వెంకటేశ్‌ నటించిన శత్రువు సినిమాలో విలన్‌గా నటించి మంచి పేరు తెచ్చుకున్నారు.

ఆయన ఆఖరిగా 2017లో వచ్చిన ‘మాస్టర్‌పీస్‌’ అనే చిత్రంలో నటించారు. జులైలో రాజు తన కుమారుడి పెళ్లి నిమిత్తం అమెరికాకు వెళుతుండగా విమానంలో గుండెపోటు వచ్చింది. దాంతో విమానాన్ని ఒమన్‌లోని మస్కట్‌కు మళ్లించి అక్కడి నుంచి కొచ్చికి తరలించారు. రాజుకు భార్య ప్రమీల, కుమారుడు రవి ఉన్నారు. వెంకటేష్ హీరోగా చేసిన శత్రువు సహా రాజు తెలుగులో నటించిన చిత్రాలన్నీ మంచి గుర్తింపు తెచ్చుకున్నవే. రౌడీ అల్లుడు, కొండపల్లి రాజా, గాంఢీవం, మొండి మొగుడు పెంకి పెళ్లాం, మాతో పెట్టుకోకు, జైలర్‌ గారి అబ్బాయి వంటి చిత్రాల్లో నటించారు.

మలయాళంలో 1997లో తొలిసారి ‘ఒరు స్నేహగథా’తో దర్శకుడిగా మారారు. అనంతరం 2012లో పవనాయి 99. 99 చిత్రానికి దర్శకత్వ వహించడమే కాక ఆ చిత్రంలో ప్రధాన పాత్రలో నటించారు. క్యారెక్టర్ నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న కెప్టెన్ రాజు మృతితో ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ విషాదంలో మునిగిపోయింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here