• ఐదు రోజుల విరామం తర్వాత సభ ప్రారంభం

  • ధర్మాబాద్‌ కోర్టు నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌పై సుధీర్ఘ చర్చ

అమరావతి: మొత్తానికి బాబ్లీ ప్రాజెక్టు వద్ద ఎనిమిదేళ్ల కిందట జరిగిన నిరసనపై మహారాష్ట్ర పోలీసులు నమోదుచేసిన కేసులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుతో సహా మరో 14 మందికి ధర్మాబాద్ న్యాయస్థానం నాన్‌బెయిలబుల్‌ అరెస్టు వారెంట్‌ జారీ చేసింది. బాబ్లీ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా 2010లో చేసిన పోరాటానికి గాను ఈ వారెంట్‌ను మహారాష్ట్రలోని ధర్మాబాద్‌ మెజిస్ట్రేట్‌ కోర్టు ఇచ్చింది.

చంద్రబాబునాయుడును కోర్టులో హాజరుపరచాలంటూ ఆదేశాలు జారీచేసింది. ఈ నెల 21లోగా చంద్రబాబుతో పాటు మిగతా వారూ హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొంది. సీఎం చంద్రబాబుకు నోటీసులు రావడం రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది. మరోవైపు, తెలుగుదేశం పార్టీ ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణిస్తోంది. 2010లో మహారాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన బాబ్లీ ప్రాజెక్టు నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ తెలుగుదేశం పార్టీ పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టింది. 40 మంది ఎమ్మెల్యేలతో కలిసి అప్పట్లో ప్రతిపక్షనేతగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు తెలంగాణ సరిహద్దుదాటి మహారాష్ట్రలోని బాబ్లీ ప్రాజెక్టు వద్దకు వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో చంద్రబాబుతో పాటు 40 మంది ఎమ్మెల్యేలను అరెస్టు చేసిన మహారాష్ట్ర పోలీసులు నాన్‌బెయిలబుల్‌ కేసు నమోదుచేశారు.

అప్పటి నుంచి ఈ కేసు ధర్మాబాద్‌ కోర్టులో పెండింగ్‌లో ఉంది. ఈ కేసుకు సంబంధించి ఇటీవల మహారాష్ట్ర వాసి ధర్మాబాద్‌ కోర్టులో పిటిషన్‌ వేయడంతో బాబ్లీ కేసు మళ్లీ తెరపైకి వచ్చింది. ఈ నేపథ్యంలో ఏపీ అసెంబ్లీలో ఇదే అంశంపై సోమవారం వాడివేడి చర్చ సాగింది. ఐదు రోజుల విరామం తర్వాత అసెంబ్లీ సమావేశాలు సోమవారం ఉదయం 9 గంటలకు ప్రారంభమయ్యాయి. సభ ప్రారంభం కాగానే స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాద్‌రావు ప్రశ్నోత్తరాలు ప్రవేశపెట్టారు. ప్రధానంగా ధర్మాబాద్‌ కోర్టు నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌ జారీపై అసెంబ్లీలో సుధీర్ఘ చర్చ జరిగింది.

సభలో మూడు బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టింది. మోటారు వాహనాల పన్ను, వైద్య, దంత సంస్థలకు సెమీ అటానమస్‌ బిల్లులకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలపింది. మరోవైపు, కోడ్‌ ఆఫ్ క్రిమినల్‌ ప్రొసీజర్‌పై మరో బిల్లును ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఇదిలా ఉంటే ప్రైవేటు విదేశీ కంపెనీలతో ఉపాధి కల్పనపై అసెంబ్లీలో చర్చ జరిగింది. విభజన హామీలను కేంద్ర ప్రభుత్వం అమలు చేయకపోవడంపై అసెంబ్లీలో చర్చకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇచ్చింది. అంతకముందు ఉదయం 8 గంటలకు అసెంబ్లీ వ్యూహ కమిటీ బృందంతో సీఎం నారా చంద్రబాబునాయుడు టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ కాన్ఫరెన్స్‌లో మంత్రులు, ఉభయ సభల విప్‌లు పాల్గొన్నారు.