కరీంనగర్: కుటుంబ కలహాలు ఓ నిండు కుటుంబంలో నిప్పులు పోశాయి. సభ్యుల మధ్య రేకెత్తిన కలతలు చివరికి తల్లీ కూతుళ్ల ఆత్మహత్యకు దారితీశాయి. బావిలో దూకి ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఇల్లందుకుంట మండలం వంతడ్పుల గ్రామంలో చోటుచేసుకుంది. వంతడ్పుల గ్రామానికి చెందిన రమ్య (25) తన భర్తతో మంగళవారం రాత్రి చిన్నపాటి గొడవ తలెత్తగా తన మూడేళ్ల కూతురు మనుశ్రీతో సహా బయటకు వెళ్లిపోయింది.

కుటుంబ సభ్యులు వారి ఆచూకి కోసం రాత్రంతా గాలించారు. ఇంటిముందు ఉన్న మంచినీటి బావిలో కూతురుతో సహా దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు బుధవారం ఉదయం కుటుంబ సభ్యులు గుర్తించారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఇల్లందుకుంట ఎస్సై నరేశ్‌కుమార్‌ తెలిపారు.

ఇదిలావుండగా, ఆస్తుల పంపకంలో నెలకొన్న వివాదంలో పోలీసులు పట్టించుకోవడం లేదని అప్పన్నపేట గ్రామానికి చెందిన ఒకరు పెద్దపల్లి మండలం బసంత్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌లో ఆత్మహత్యాయత్నానికి పాల్పడడం కలకలం రేపింది. పెద్దపల్లి మండలం అప్పన్నపేట గ్రామానికి చెందిన పుట్ట కొమురయ్యకు, అతని సోదరికి మధ్య కొన్ని రోజులుగా వివాదం నడుస్తోంది.

ఈ క్రమంలో కొమురయ్య తల్లి పోషణను పట్టించుకోవడం లేదని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై గ్రామ పెద్దలు నిర్వహించిన పంచాయితీ తనకు వ్యతిరేకంగా ఉందని కొమురయ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ వివాదం ఆస్తుల పంపిణీతో ముడిపడి ఉండడంతో పోలీసుల నుంచి స్పందన కనిపించ లేదు. ఈ క్రమంలో బసంత్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌కు వచ్చిన కొమురయ్య తన వెంట తీసుకువచ్చిన క్రిమిసంహారక మందును తాగాడు.

దీన్ని గమనించిన పోలీసులు వెంటనే పెద్దపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అతడి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై ఎస్సై రాజ్‌కుమార్‌ మాట్లాడుతూ ఆత్మహత్యాయత్నానికి దారితీసిన పరిస్థితులపై విచారణ చేపట్టనున్నట్లు పేర్కొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here