శబరిమల: అయ్యప్పస్వామి దర్శనార్ధం శబరిమల యాత్రకు వెళ్లే భక్తులకు ట్రావన్‌కోర్ దేవస్థానం బోర్డు పలు సూచనలతో కూడిన విజ్ఞప్తిచేసింది. ప్రైవేట్ వాహనాల్లో స్వామివారి దర్శనానికి వచ్చే యాత్రికులు నీలక్కల్ నుంచి ప్రత్యామ్నాయ ఏర్పాట్లతో ఆలయానికి చేరుకోవాల్సి ఉంటుంది. అన్ని రకాల ప్రైవేట్ వాహనాలను కేవలం నీలక్కల్ వరకు మాత్రమే అనుమతించనున్నారు.

నీలక్కల్ నుండి పంబ వరకు కేరళ రాష్ట్ర ఆర్టీసీ బస్సుల ద్వారా మాత్రమే యాత్రికులు ప్రయాణించాల్సి ఉంటుంది. ఈ మేరకు ఆర్టీసీతో ట్రావన్‌కోర్ దేవస్థానం బోర్డ్ అంగీకారం కుదుర్చుకుంది. ఆర్టీసీ బస్సులు మినహా ఇతర ఏ రకమైన ప్రయివేటు వాహనాలను ఆ మార్గంలో అనుమతించకుండా నియంత్రించాలని పోలీసు, రవాణా శాఖ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీచేశారు.

అయితే, నిలక్కల్-పంబ మధ్య నడిచే ఆర్టీసీ బస్సుల్లో కండక్టర్ ఉండరు. కేవలం సింగిల్ డ్రైవర్‌ సర్వీసుగానే వీటిని నడపనున్నారు. ఈ నేపథ్యంలో యాత్రికులు ముందుగానే టికెట్ పొందవలసి ఉంటుంది. పంబ చేరిన తర్వాత కొత్తగా నిర్మించిన త్రివేణి వంతెన (అయ్యప్ప వారధి) మీదుగా సర్వీస్ రోడ్డు ద్వారా కన్నిమూల గణపతి ఆలయం చేరుకోవాలి.

పంబ నుండి కాలినడక వంతెన మూసివేసినట్లు దేవస్థానం అధికారులు వెల్లడించారు. ఈ విషయాన్ని అయ్యప్ప భక్తులు గమనించాలని సూచించారు. త్రివేణి నుంచి ఆరాట్టు కడావు వరకు గల ప్రదేశాలు మట్టి బురదతో నిండి ప్రమాదభరితంగా ఉన్న నేపథ్యంలో యాత్రికులు కిందకు దిగే ప్రయత్నం చేయరాదని కోరారు. పంబలో భక్తులకు కేటాయించిన నిర్దేశిత ప్రదేశాలలో మాత్రమే స్నానమాచరించాల్సి ఉంటుంది. మిగిలిన ప్రదేశాలలో స్నానం చేయడాన్ని దేవస్థానం తాత్కాలికంగా నిషేధించింది.

భద్రతా సిబ్బంది ఆదేశాలు, సూచనల మేరకు యాత్రికులు నడుచుకోవాలని హితవుపలికింది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పంబ పోలీస్ స్టేషన్ ముందు ప్రదేశం పూర్తిగా దెబ్బతిన్న కారణంగా ఆ
మార్గం ద్వారా కొండపైకి ఎక్కే ప్రయత్నం చేయరాదని అధికారులు సూచించారు. పంబ పెట్రోల్ బంక్ నుండి యూ టర్నింగ్ పూర్తిగా దెబ్బతిన్న నేపథ్యంలో ఆ మార్గాన్ని పూర్తిగా మూసివేశారు.

పంబ పరిసరాలు, అడవి దారిలో ప్రమాదకరమైన పాములు అధికంగా సంచరిస్తున్నందువల్ల అయ్యప్ప భక్తులు జాగ్రత్తగా ఉండాలని కోరారు. అనుమతి లేని మార్గాల ద్వారా కొండపైకి చేరుకునే ప్రయత్నంలో ప్రమాదాలు పొంచి ఉంటాయన్నారు. యాత్రికులు మార్గమధ్యంలో తాగేందుకు నీటిని వెంట తీసుకువెళ్లడం తప్పనిసరని సూచించారు. అయితే, ప్లాస్టిక్ వస్తువుల వాడకాన్ని నిషేధించిన నేపథ్యంలో ప్రత్యామ్నాయ పాత్రలను వినియోగించాలన్నారు.

భోజనం, టిఫిన్స్ స్టాల్ నీలక్కల్లో ఏర్పాటుకు అనుమతించారు. ఇరుముడిలో ప్లాస్టిక్ కవర్లు, వస్తువులు ఉండకుండా చూసుకోవాలన్నారు. అవసరమైన కొద్దిపాటి తినుబండారాలను మాత్రమే యాత్రికులు వెంట తెచ్చుకోవాలని, మంచినీటి కొరత వల్ల నీటిని వృధాచేయవద్దని కోరారు. ఇటీవల వరదల కారణంగా
నీలక్కల్, పంబ, సన్నిధానం తదితర ప్రాంతాల్లో మరుగుదొడ్లు పాడైపోవటం వల్ల పరిమిత
సంఖ్యలోనే మరుగుదొడ్లను ఏర్పాటుచేశారు. ఈ నేపథ్యంలో వాటిని సక్రమంగా వినియోగించుకోవాలని అధికారులు కోరారు.