• ధనికుల మాదిరి వైద్య సదుపాయాలు

  • అన్ని నగరాల్లో 2500 ఆధునిక ఆసుపత్రులు

  • 50 కోట్ల మందికి వర్తించనున్న ‘ఆరోగ్య బీమా’

రాంచీ: వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగా వ్యూహాత్మకంగా ఆయన ఓటర్లను ఆకట్టుకునే పనిలో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే దేశంలో పేద కుటుంబాల వారందరికీ వర్తించేలా భారీ ఆరోగ్య బీమా పథకానికి శ్రీకారం చుట్టారు. అమెరికా అధ్యక్షునిగా బరాక్‌ ఒబామా ఉన్నప్పుడు ప్రవేశపెట్టిన ‘ఒబామా కేర్‌’ పథకం మాదిరిగా ‘మోదీ కేర్‌’గా నిలిచిపోయేలా ‘ఆయుష్మాన్‌భవ’కు రూపకల్పన చేశారు.

ఇంతవరకు ఎలాంటి ఆరోగ్య బీమా లేని కుటుంబాలే లక్ష్యంగా చేపట్టిన ఈ వినూత్న పథకాన్ని ప్రధాని నరేంద్రమోదీ ఆదివారం ఝార్ఖండ్‌ రాజధాని రాంచీలో లాంఛనంగా ప్రారంభించారు. పేదలు సయితం ధనవంతుల మాదిరిగా అన్ని రకాల వైద్య సేవల్ని పొందగలగాలనేదే ప్రభుత్వ ఉద్దేశమనీ, దాని కోసమే ‘ఆయుష్మాన్‌ భారత్‌’ను అందుబాటులోకి తీసుకువచ్చామనీ ఆయన తెలిపారు. కుల, మత, ప్రాంతీయ భేదాలకు అతీతంగా, పేదలంతా దీనికి అర్హులేనని చెప్పారు. దేశంలో 10 కోట్ల కుటుంబాలకు చెందిన దాదాపు 50 కోట్ల మందికి ఇది బీమా రక్షణను కల్పిస్తుందని వివరించారు.

పేదలకు సేవలు అందించడంలో ‘ప్రధానమంత్రి జన్‌ ఆరోగ్య యోజన’ (పీఎం జయ్‌- ఆయుష్మాన్‌ భారత్‌) సమూల మార్పు తీసుకువస్తుందని చెప్పారు. ‘‘అమెరికా, కెనడా, మెక్సికో జనాభాను కలిపితే ఎంతో ఈ పథకం లబ్ధిదారుల సంఖ్య అంత. ఇది ఆదివారం నుంచే అమల్లోకి వస్తోంది. గుండె/మూత్రపిండాలు/కాలేయ జబ్బులు/మధుమేహం సహా 1300 పైగా రుగ్మతలను దీని కిందికి చేర్చడమే పథకం విస్తృతికి నిదర్శనం. దీనిని ప్రజలు మోదీ కేర్‌ అనో, మరో పేరుతోనో పిలుస్తున్నారు. నావరకు మాత్రం ఇది ప్రజాసేవకు ఓ అవకాశం’’ అని మోదీ వివరించారు. పథకం అమలులో కీలకంగా నిలుస్తున్న అధికారుల్ని ప్రధాని అభినందించారు. ‘‘మీకు 50 కోట్ల మంది లబ్ధిదారుల ఆశీస్సులు ఉంటాయి.

ఆసుపత్రుల గుమ్మం తొక్కాల్సిన అవసరం పేదలకు రాకూడదనేదే నా ఆకాంక్ష, ప్రార్థన. ఒకవేళ వెళ్లాల్సి వస్తే మాత్రం వారికి ఆయుష్మాన్‌ భారత్‌ ద్వారా సేవలు లభిస్తాయి. ప్రపంచానికే ఆదర్శంగా ఈ ఆరోగ్య పథకం నిలిచిపోతుంది. దీని కోసం ఎవరూ ప్రత్యేకంగా నమోదు చేసుకోవాల్సిన పనేమీ లేదు. లబ్ధిదారులకు ఆరోగ్య కార్డులు ఇస్తాం. టోల్‌ఫ్రీ నెంబరు ద్వారా మరిన్ని వివరాలు లభ్యమవుతాయి. 13 వేల ఆసుపత్రులు భాగం పంచుకుంటున్నాయి. ద్వి

తీయ, తృతీయ శ్రేణి నగరాల్లో మరో 2500 అధునాతన ఆసుపత్రులు రాబోతున్నాయి. దానివల్ల అనేక మందికి ఉపాధి అవకాశాలూ లభిస్తాయి’’ అని వివరించారు. ‘‘నేను పేద కుటుంబం నుంచి వచ్చాను. పేదరికాన్ని చూశాను. దానిలో జీవించాను. పేదల ఆకాంక్షల్ని నెరవేర్చడానికి శాయశక్తులా ప్రయత్నిస్తున్నాను’’ అని మోదీ చెప్పారు. కొంతమంది లబ్ధిదారులకు ఆరోగ్య కార్డుల్ని ఆయన అందించారు. రెండు వైద్య కళాశాలలకు శంకుస్థాపన చేశారు. కేంద్ర మంత్రి జె.పి.నడ్డా మాట్లాడుతూ ఈ పథకం కింద పేదలెవరూ ఆసుపత్రి ఖర్చులకు చెల్లింపులు చేయాల్సిన అవసరం ఉండదన్నారు.

‘గోల్డెన్‌ కార్డు’తో నగదు రహిత చికిత్సలు పొందవచ్చనీ, ఎవరివద్దనైనా ఆ కార్డు లేకపోతే తమ బొటనవేలి ముద్రతో 13 వేల ఆసుపత్రుల్లో దేనిలోనైనా సేవలు అందుకోవచ్చన్నారు. ఈ పథకం ద్వారా హుందాగా జీవించేహక్కును పేదలకు మోదీ కల్పించినట్లయిందని భాజపా జాతీయాధ్యక్షుడు అమిత్‌షా తెలిపారు. దేశాభివృద్ధే తమ ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.