న్యూయార్క్: తెలుగుజాతి ఖ్యాతిని విశ్వవ్యాప్తిచేయడమే లక్ష్యంగా తెలుగుదేశం ప్రభుత్వం పనిచేస్తోందని ఆ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. ప్రపంచంలోని అందరూ తెలుగుజాతిపై మాట్లాడుకునేలా కృషి చేస్తామని చెప్పారు. అమెరికా పర్యటనలో భాగంగా న్యూయార్క్‌లో ప్రవాసాంధ్రులతో ఏర్పాటు చేసిన తెదేపా భారీ బహిరంగసభలో ఆయన మాట్లాడారు. 2014 ఎన్నికల్లో ప్రతి ప్రవాసాంధ్రుడు సైనికుడిగా పనిచేశారని ఆయన గుర్తు చేశారు.

ప్రవాసాంధ్రుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక సైబర్‌ సెల్‌ ఏర్పాటు చేసినట్లు చంద్రబాబు వివరించారు. ‘‘అమెరికా కంటే మెరుగ్గా సాంకేతికతను నవ్యాంధ్రలో వాడుతున్నాం. పోలవరం ప్రాజెక్టులో 58 శాతం పనిపూర్తయింది. దేశంలోనే అత్యధికంగా 10.5 శాతం వృద్ధి రేటు సాధించాం. అవార్డులన్నీ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికే వస్తున్నాయి. ‘ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌’ బిజినెస్‌లో రెండుసార్లు ప్రథమ స్థానంలో నిలిచాం. హ్యాపీనెస్‌ ఇండెక్స్‌లో ఏపీని ప్రపంచంలోనే తొలి 10 స్థానాల్లో నిలుపుతాం. ఒకప్పుడు సాంకేతికతకు ప్రాధాన్యమిచ్చా. ఇప్పుడు పర్యావరణానికీ ఇస్తున్నా. రాబోయే రోజుల్లో కార్యాలయాల చుట్టూ తిరిగే అవసరం లేకుండా అన్ని ప్రభుత్వ సేవలు ఆన్‌లైన్‌లో అందుబాటులోకి రానున్నాయి. యాప్‌ ద్వారా అన్ని సర్వీసులు అందించేందుకు కృషి జరుగుతోంది. రాష్ట్ర ఆదాయాన్ని ట్రిలియన్‌ డాలర్ల మార్క్‌కు చేర్చేలా కృషి చేస్తున్నాం. ఈ సంవత్సరం నుంచి ఎన్‌ఆర్‌ఐలకు కూడా ఓటు వేసే అవకాశం వస్తోంది. మళ్లీ తెదేపా అధికారంలోకి రావడం చారిత్రక అవసరం. ఎన్‌ఆర్‌ఐ తెలుగుదేశం పార్టీలో అందరూ భాగస్వాములు కావాలి’’ అని చంద్రబాబు ఎన్‌ఆర్‌ఐలను కోరారు.

గత ప్రభుత్వ హయాంలో జరిగిన అన్యాయం పేదలకు జరగనీయకుండా పాలన సాగిస్తున్నామన్నారు. గ్రామీణాభివృద్ధిలో భాగస్వాములైన ప్రతి ప్రవాసాంధ్రునికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నానన్నారు. పరిపాలనలో పారదర్శకత్వాన్ని తీసుకువచ్చేందుకు తాము సర్వశక్తులు ఒడ్డుతున్నామని చంద్రబాబు చెప్పారు. పేద, సామాన్య, మధ్యతరగతి వర్గాల అభ్యున్నతితో పాటు అగ్రవర్ణాల సంక్షేమానికి కూడా రాష్ట్రంలో తమ ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు. తెలుగుదేశం పార్టీకి అండగా నిలిచిన ప్రవాసాంధ్రులందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here