• మళ్లీ చెలరేగిన ‘టీమిండియా’

  • అలవోకగా 238 పరుగుల ఛేదన

  • సెంచరీలతో చెలరేగిన ధావన్‌, రోహిత్‌

దుబాయి: ఆసియా కప్ క్రికెట్ పోటీలో భారత్ జట్టు మరోమారు పాకిస్థాన్‌పై ప్రతీకారం తీర్చుకుంది. మెరుగైన బ్యాటింగ్‌లో ఉన్న పాకిస్థాన్‌ జట్టును అలవోకగా చిత్తుచేశారు టీమిండియా ఆటగాళ్లు. విజయం అంత తేలిక కాదని, కొంచెం కష్టపడాల్సి ఉంటుందనే అనుకున్న సమయంలో మైదానంలో ఆశ్చర్యం చోటుచేసుకుంది. లక్ష్యం పెరిగినా ఫలితం మారలేదు. పైగా మరింత ఘనంగా గెలిచింది భారత్‌.

పాక్‌తో గత మ్యాచ్‌లో 163 లక్ష్యాన్ని ఛేదించడానికి 2 వికెట్లు కోల్పోయిన టీమ్‌ఇండియా ఈసారి ఒక్క వికెట్‌ మాత్రమే (అది కూడా రనౌట్‌) చేజార్చుకుని లక్ష్యాన్ని ఛేదించింది. ఓపెనర్లు శిఖర్‌ ధావన్‌, రోహిత్‌ శర్మ పాక్‌ బౌలింగ్‌ను ఆటాడుకున్నారు. గల్లీ బౌలర్లను ఆడినట్లు వారిని అలవోకగా ఎదుర్కొంటూ శతకాలు సాధించారు. ప్రత్యర్థి ఫీల్డింగ్‌ తప్పిదాలు కూడా కలిసి రావడంతో వీరికి ఎదురే లేకపోయింది.

మొదట బౌలర్లు చక్కటి ప్రదర్శనతో పాక్‌ను కట్టడి చేశారు. సూపర్‌-4లో రెండు భారీ విజయాలతో భారత్‌ దాదాపుగా ఫైనల్‌ బెర్తును ఖరారు చేసుకుంది. మొత్తానికి ఆసియాకప్‌లో భారత్‌ జైత్రయాత్ర కొనసాగుతోందనే చెప్పాలి. మ్యాచ్‌ మ్యాచ్‌కూ జోరు పెంచుతూ ప్రత్యర్థుల పని పడుతోంది రోహిత్‌ సేన. ఇప్పటికే గ్రూప్‌ దశలో పాకిస్థాన్‌ను అలవోకగా ఓడించిన భారత్‌ సూపర్‌-4లో ఆ జట్టు పని పట్టింది. ఆదివారం 9 వికెట్ల తేడాతో తేడాతో చిరకాల ప్రత్యర్థిని చిత్తు చేసింది.

మొదట జస్‌ప్రీత్‌ బుమ్రా (2/29), యుజ్వేంద్ర చాహల్‌ (2/46), కుల్దీప్‌ యాదవ్‌ (2/41) కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయడంతో పాక్‌ 50 ఓవర్లలో 7 వికెట్లకు 237 పరుగులే చేయగలిగింది. షోయబ్‌ మాలిక్‌ (78; 90 బంతుల్లో 4×4, 2×6), సర్ఫ్‌రాజ్‌ అహ్మద్‌ (44; 66 బంతుల్లో 2×4) రాణించారు. అనంతరం శిఖర్‌ ధావన్‌ (114; 100 బంతుల్లో 16×4, 2×6), రోహిత్‌ శర్మ (111 నాటౌట్‌; 119 బంతుల్లో 7×4, 4×6) సెంచరీలతో చెలరేగడంతో భారత్‌ 39.3 ఓవర్లలో ఒక్క వికెట్టే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ధావన్‌ ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’గా ఎంపికయ్యాడు. భారత్‌ ఫైనల్‌ చేరడం లాంఛనమే.

రెండో బెర్తు కోసం మిగతా జట్లు పోటీ పడాలి. టీమ్‌ఇండియా మంగళవారం తన చివరి సూపర్‌-4 మ్యాచ్‌లో అఫ్గానిస్థాన్‌ను ఢీకొంటుంది. భారత్‌ స్కోరు 29/0. షహీమ్‌ అఫ్రిది బౌలింగ్‌లో రోహిత్‌ కవర్స్‌లో క్యాచ్‌ ఇచ్చాడు. తేలికైన ఆ క్యాచ్‌ను ఇమామ్‌ వదిలేశాడు. ఈ క్యాచ్‌ పడితే పరిస్థితి ఎలా ఉండేదో కానీ ఆ జీవనదానాన్ని సద్వినియోగం చేసుకున్న రోహిత్‌ చెలరేగిపోయాడు.

మరోవైపు, ధావన్‌ ఆరంభం నుంచి ధనాధన్‌ బ్యాటింగ్‌తో పాక్‌ బౌలర్లకు చుక్కలు చూపించాడు. ప్రధాన బౌలర్‌ ఆమిర్‌ పేలవ ఫామ్‌ను కొనసాగించడంతో ఓపెనర్లపై పెద్దగా ఒత్తిడి లేకపోయింది. క్రీజులో కుదురుకునే వరకు కొంచెం నెమ్మదిగా ఆడిన రోహిత్‌, ధావన్‌ ఆ తర్వాత రెచ్చిపోయారు. ఫోర్లు, సిక్సర్లతో పరుగుల వరద పారించారు. 20వ ఓవర్లో వందకు చేరుకున్న స్కోరు 33వ ఓవర్‌కే 200 దాటిపోయింది. రెండో 100కు తీసుకున్న బంతులు 81 మాత్రమే. ధావన్‌ 95 బంతుల్లోనే శతకం పూర్తి చేశాడు.

సెంచరీ తర్వాత దూకుడు పెంచి రెండు సిక్సర్లు బాదిన ధావన్‌ లేని పరుగుకు ప్రయత్నించి చేజేతులా వికెట్‌ చేజార్చుకున్నాడు. 81 పరుగుల వద్ద మరోసారి క్యాచ్‌ చేజారడంతో బతికిపోయిన రోహిత్‌ 106 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. రాయుడు (12 నాటౌట్‌)తో కలిసి అతను లాంఛనాన్ని పూర్తి చేశాడు. వికెట్‌ కోల్పోకూడదన్న పట్టుదలతో నెమ్మదిగా ఆడిన పాక్‌ ఓపెనర్లు ఫకర్‌ జమాన్‌ (31), ఇమాముల్‌ హక్‌ (10).. పేసర్లు బుమ్రా, భువనేశ్వర్‌లను సమర్థంగానే అడ్డుకున్నారు.

అయితే, 8వ ఓవర్లో స్పిన్నర్‌ చాహల్‌ రాకతో భారత్‌ తొలి వికెట్‌ దక్కించుకుంది. ఆ ఓవర్‌ చివరి బంతికి ఇమాముల్‌ వికెట్ల ముందు దొరికిపోయాడు. తర్వాత చాహల్‌కు కుల్దీప్‌ కూడా తోడయ్యాడు. ఇద్దరూ కట్టుదిట్టమైన బంతులతో స్కోరుకు కళ్లెం వేశారు. జమాన్‌, అజామ్‌ వికెట్ల పతనాన్ని అడ్డుకున్నారు కానీ, పరుగులు రాబట్టలేకపోయారు. జోరు పెంచాల్సిన స్థితిలో వీళ్లిద్దరూ వరుస ఓవర్లలో వెనుదిరిగారు. జమాన్‌ను కుల్దీప్‌ వికెట్ల ముందు దొరకబుచ్చుకుంటే అజామ్‌ (9) రనౌటయ్యాడు.

ఈ దశలో మాలిక్‌, సర్ఫరాజ్‌ నిలబడ్డారు. ముందు క్రీజులో కుదురుకుని ఆ తర్వాత బ్యాట్‌ ఝులిపించారు. స్పిన్‌ను వీళ్లిద్దరూ అలవోకగా ఎదుర్కొన్నారు. ముఖ్యంగా మాలిక్‌ ఏ మాత్రం తడబడలేదు. అతను స్పిన్నర్ల ఆత్మవిశ్వాసాన్ని దెబ్బ తీశాడు. చాహల్‌, జడేజాల బౌలింగ్‌లో సిక్సర్లు బాదాడు. సర్ఫ్‌రాజ్‌ కూడా కొన్ని మెరుపు షాట్లు కొట్టాడు. 38 ఓవర్లకు పాక్‌ 160/3తో నిలిచింది. తర్వాతి ఓవర్లో సర్ఫ్‌రాజ్‌ ఔటైనా.. అసిఫ్‌ అలీతో కలిసి మాలిక్‌ స్కోరు బోర్డును నడిపించాడు.

42 ఓవర్లకు 193/4తో పాక్‌ మెరుగైన స్థితికి చేరుకుంది. అయితే, తర్వాతి 8 ఓవర్లలో పాక్‌ 3 వికెట్లు కోల్పోయి 44 పరుగులే చేయగలిగింది. మాలిక్‌, అసిఫ్‌ (30) వరుస ఓవర్లలో వెనుదిరగడంతో పాక్‌ అనుకున్న దాని కంటే 20-30 పరుగులు తక్కువ చేసింది. 43 ఓవర్లకు పాక్‌ స్కోరు 199/4. షోయబ్‌ మాలిక్‌, అసిఫ్‌ అలీ మాంచి ఊపుమీదున్నారు. వాళ్ల జోరు చూస్తే పాక్‌ స్కోరు 260 దాటేలా కనిపించింది. కానీ తర్వాతి ఏడు ఓవర్లలో పాక్‌ 3 వికెట్లు కోల్పోయి 38 పరుగులే చేసింది.

ఆ జట్టుకు బ్రేక్‌ వేయడంలో ప్రధాన ఘనత బుమ్రాదే. డెత్‌ ఓవర్లలో బుమ్రా బౌలింగ్‌ చేసిన తీరు అమోఘం. యార్కర్లతో పాక్‌ బ్యాట్స్‌మెన్‌ను ఉక్కిరి బిక్కిరి చేశాడతను. అంతకుముందు 6 ఓవర్లలో 12 పరుగులిచ్చి ఒక వికెట్‌ తీసిన బుమ్రా చివరి 4 ఓవర్లలోనూ పొదుపు పాటించాడు. 17 పరుగులే ఇచ్చి కీలకమైన మాలిక్‌ వికెట్‌ తీశాడు. 44వ ఓవర్లో మాలిక్‌ ఔటవడంతోనే పాక్‌ మంచి స్కోరు చేసే అవకాశాన్ని కోల్పోయింది. పాక్‌తో గత మ్యాచ్‌లో రెండు మెయిడెన్లు విసిరిన బుమ్రా ఈ మ్యాచ్‌లోనూ ఒక ఓవర్లో పరుగులే ఇవ్వలేదు. మొత్తంగా 10 ఓవర్లలో 29 పరుగులే ఇచ్చి రెండు కీలక వికెట్లు తీశాడు. అతడి బౌలింగ్‌లో డాట్‌ బాల్స్‌ 39. మ్యాచ్‌లో అంపైర్‌ నిర్ణయ సమీక్షను ఉపయోగించుకోవడంలో భారత్‌ తెలివిగా వ్యవహరిస్తే పాక్‌ బోల్తా కొట్టింది. భారత్‌కు తొలి వికెట్‌ దక్కింది డీఆర్‌ఎస్‌ ద్వారానే.

చాహల్‌ వేసిన ఎనిమిదో ఓవర్‌ చివరి బంతి పాక్‌ ఓపెనర్‌ ఇమాముల్‌ హక్‌ ప్యాడ్‌కు తాకింది. అంపైర్‌ ఔటివ్వలేదు. ధోని సూచనతో రోహిత్‌ సమీక్ష కోరాడు. రీప్లేలో బంతి వికెట్‌కు తాకేదని తేలడంతో అంపైర్‌ నిర్ణయాన్ని మార్చుకున్నాడు. తర్వాత కుల్దీప్‌ బౌలింగ్‌లో ఫకర్‌ జమాన్‌ను అంపైర్‌ ఎల్బీగా ప్రకటించాడు. అతను సమీక్ష కోరలేదు. అయితే, రీప్లేలో బంతి ప్యాడ్‌కు తాకడానికంటే ముందు గ్లవ్‌కు తగిలిందని తేలింది.