• భారత్‌కు పాక్ పిలుపు

  • బలహీనత అనుకోవద్దు

  • అహంకారాన్ని వదిలాలి

  • మోదీకి ఇమ్రాన్‌ఖాన్‌ పిలుపు

లాహోర్: భారత్‌తో సత్సంబంధాలు కొనసాగించేందుకు పాకిస్థాన్ సిద్ధంగా ఉందని, ఈ క్రమంలో తాము చేస్తున్న ప్రయత్నాలను బలహీనతగా భావించవద్దని ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీకి హితవుపలికారు. భారత నాయకత్వం అహంకారాన్ని వీడి పాక్‌తో శాంతి చర్చలకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. కశ్మీర్‌ సమస్య, ఉగ్రవాదం తదితర కీలకాంశాలపై ద్వైపాక్షిక చర్చలను తిరిగి ప్రారంభించాలని అభ్యర్థిస్తూ ఇమ్రాన్‌ ఇదివరకు భారత ప్రధాని మోదీకి లేఖ రాసిన సంగతి తెలిసిందే.

ఈ నెల చివర్లో న్యూయార్క్‌లో భారత్‌, పాకిస్థాన్‌ విదేశాంగ మంత్రుల మధ్య సమావేశం నిర్వహించేందుకు ఇరు దేశాలు అంగీకరించుకున్నాయి. అయితే, ఇటీవల కశ్మీర్‌లో ముగ్గురు పోలీసుల దారుణ హత్యలకు గురయ్యారు. కశ్మీరీ ఉగ్రవాది బుర్హన్‌ వానీని కీర్తిస్తూ పాక్‌ తపాలా బిళ్లను విడుదల చేసింది. ఈ చర్యలకు నిరసనగా విదేశాంగ మంత్రుల సమావేశాన్ని భారత్‌ రద్దు చేసుకుంది. భారత్‌ అహంకార పూరిత నిర్ణయంతో తాను తీవ్రంగా నిరాశచెందానని ఇమ్రాన్‌ వ్యాఖ్యానించారు. ఆదివారం పంజాబ్‌ అధికారులతో ఈ అంశం గురించి మరోసారి ఆయన మాట్లాడారు.

‘‘భారత్‌, పాక్‌ల మైత్రి పేదరిక నిర్మూలనకు దోహదపడుతుంది. భారత్‌ నాయకత్వం.. అహంకారాన్ని వీడి.. శాంతి చర్చలకు రావాలి. ఇరు దేశాలకు ఇది ప్రయోజనకరం. మాపై ఏ ‘ప్రపంచ శక్తీ’ ఒత్తిడి పనిచేయదు’’ అని ఇమ్రాన్‌ అన్నారు. ‘‘భారత్ మా పొరుగు దేశం మాత్రమే కాదు. మా సోదర సమానమైనది. స్థానిక పరిస్థితులను అర్ధం చేసుకోవాలి. మా రెండు దేశాలలో ఏ దేశానికీ నష్టం జరగరాదు. అదే లక్ష్యంతో పాకిస్థాన్ ప్రభుత్వం మైత్రి ప్రయత్నాలను కొనసాగిస్తోంది’’ అని ఇమ్రాన్ పేర్కొన్నారు.