• ప్రశాంతంగా ముగిసిన నిమజ్జనం

  • స్వయంగా పరిశీలించిన హోం మంత్రి

  • రూ. 16.6 లక్షలు పలికిన బాలాపూర్ లడ్డూ

హైదరాబాద్: వినియక నిజమజ్జనం ప్రశాంతంగా ముగిసింది. అనుకున్న సమయానికంటే ముందుగానే ఖైరతాబాద్ మహా గణపతి శోభాయాత్ర, నిజమజ్జనం పూర్తయింది. అన్ని విభాగాల సమన్వయంతో చేపట్టిన ఏర్పాట్ల ఫలితంగా రాష్ట్రవ్యాప్తంగా గణనాథుడి నిమజ్జన కార్యక్రమం ఎలాంటి అవాంతరాలు లేకుండా అంగరంగ వైభవంగా సాగింది. ఇక, రాజధానిలో జరిగిన మహాగణపతి నిమజ్జనం గురించి చెప్పాల్సిన పనేలేదు. నవరాత్రులు విశేష పూజలందుకున్న వినాయకులు ఆదివారం గంగమ్మ ఒడికి చేరుకున్నారు.

వేలాది విగ్రహాలు హుస్సేన్‌సాగర్‌కు తరలిరావడంతో ఆ ప్రాంతం జనసంద్రాన్ని తలపించింది. డప్పుల దరువు, నృత్యాల హోరు, పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తజనంతో నగరమంతా ఆధ్యాత్మిక వాతావరణం ఆవిష్కృతమైంది. ఖైరతాబాద్‌ మహాగణపతి నిమజ్జనం మధ్యాహ్నానికే పూర్తవగా బాలాపూర్‌ లడ్డూ ఈ సారి రూ.16.6 లక్షలు పలికింది. భక్తుల కోసం జలమండలి 101 ప్రాంతాల్లో టెంట్లు ఏర్పాటు చేసి 30 లక్షల నీటి ప్యాకెట్లను పంపిణీ చేసింది. ధార్మిక, స్వచ్ఛంద సంస్థలు పులిహోర పొట్లాలు అందించాయి. శనివారం రాత్రి నుంచే నగరంలో నిమజ్జన సందడి కన్పించింది.

ఆదివారం ఉదయం నుంచి నెమ్మదిగా ప్రారంభమైన నిమజ్జనాలు మధ్నాహ్నం తర్వాత ఊపందుకున్నాయి. ఈ క్రతువు సాఫీగా జరిగేలా 35 ప్రాంతాల్లో 117 స్థిర క్రేన్‌లు, 96 సంచార క్రేన్‌లు ఏర్పాటు చేశారు. ఆదివారం రాత్రికల్లా నగరవ్యాప్తంగా దాదాపు 55 వేల విగ్రహాలు నిమజ్జనం చేశారు. హుస్సేన్‌సాగర్‌, ఇతర చెరువుల వద్ద అధునాతమైన 450 కెమెరాలు, సైబరాబాద్‌, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో దాదాపు 500 కెమెరాలు అదనంగా ఏర్పాటు చేశారు. వీటిని కమాండ్‌ కంట్రోల్‌ కేంద్రానికి అనుసంధానం చేసి ఒకేసారి 64 కెమెరాల దృశ్యాలను వీక్షించే వీలుగా పెద్ద తెరలను అందుబాటులోకి తెచ్చారు. ఈ కేంద్రం నుంచి డీజీపీ మహేందర్‌రెడ్డి నిమజ్జన కార్యక్రమాన్ని స్వయంగా పర్యవేక్షించి సూచనలు చేశారు. ఒక్క రాజధానిలోనే 25 వేల మందితో భద్రతా ఏర్పాట్లు చేశారు.

హైదరాబాద్‌తోపాటు రాష్ట్రవ్యాప్తంగా నిమజ్జనోత్సవాలు ప్రశాంతంగా జరగడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. ఆదివారం సాయంత్రం తెలంగాణ కార్మిక, హోం శాఖల మంత్రి నాయిని నర్సింహారెడ్డి, రాష్ట్ర డీజీపీ మహేందర్‌రెడ్డి, నగర పోలీసు కమిషనర్‌ అంజనీకుమార్‌, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ దానకిషోర్‌, ఇంటెలిజెన్స్‌ ఐజీ నవీన్‌చంద్‌ హెలికాప్టర్‌లో ప్రయాణించి శోభాయాత్రను పరిశీలించారు. కాగా, ట్యాంక్‌బండ్‌పై జరిగిన నిమజ్జన కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు పాల్గొన్నారు. వినాయక విగ్రహానికి కొబ్బరికాయ కొట్టి పూజలు చేశారు.

కాసేపు భక్తులతో కలిసి నిమజ్జన కార్యక్రమాన్ని వీక్షించారు. ఈ సారి నిమజ్జనోత్సవాలపై క్రికెట్‌ మ్యాచ్‌ ప్రభావం కూడా కన్పించిందని చెబుతున్నారు. సాయంత్రం 5 గంటలకు భారత్‌-పాకిస్థాన్‌ మ్యాచ్‌ ఉండటంతో ఉదయం నుంచే ట్యాంక్‌బండ్‌కు విగ్రహాల రాక మొదలైంది. సోమవారం ఉదయానికి నిమజ్జన క్రతువు దాదాపు ముగుస్తుందని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ దాన కిషోర్‌ చెప్పారు. యాభైఏడు అడుగుల పొడవు, 24 అడుగుల వెడల్పు ఉన్న సప్తముఖ కాలసర్ప మహాగణపతి శోభాయాత్ర ఆదివారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. 11.30 గంటల సమయంలో హుస్సేన్‌సాగర్‌కు చేరుకుంది.

అనంతరం మహాగణపతికి ప్రత్యేక పూజలు చేసి 400 టన్నుల సామర్థ్యం ఉన్న భారీ క్రేన్‌ సాయంతో గంగమ్మ ఒడికి చేర్చారు. ఏటా శోభాయాత్రలో భాగంగా ముందు బాలాపూర్‌ వినాయకుడు కదిలాక మిగతా గణనాథులను తరలించేవారు. అర్ధరాత్రి దాటిన తర్వాత నిమజ్జన కార్యక్రమం పూర్తయ్యేది. అయితే, గతానికి భిన్నంగా ఈ సారి సాయంత్రం 5 గంటలకే బాలాపూర్‌ నిమజ్జనం పూర్తి కావడం విశేషం. బాలాపూర్‌ లడ్డూ ఈ సారి వేలంలో రూ.16.6 లక్షలు పలికింది. ఆర్యవైశ్య సంఘం నాయకుడు టి. శ్రీనివాస్‌ లడ్డూను దక్కించుకున్నారు. గతేడాది రూ.15.6 లక్షలు పలికింది. మొత్తానికి మహాగణపతి నిమజ్జనం ప్రశాంతంగా ముగియడం పట్ల పోలీసులు సంతోషం వ్యక్తంచేస్తున్నారు.