• ఇద్దరు ప్రజాప్రతినిధులను హతమార్చిన నక్సల్స్

  • అక్రమ క్వారీల నిర్వహణపై మావోయిస్టుల మండిపాటు

  • అరకు ఎమ్మెల్యే కిడారి సహా మాజీ ఎమ్మెల్యే సోమ మృతి

విశాఖపట్నం, అమరావతి: ఆంధ్రా ఒడిశా సరిహద్దు (ఏవోబీ)లో గత కొంతకాలంగా స్తబ్దుగా ఉన్న మావోయిస్టులు ఆదివారం ఉరుములేని పిడుగులా విరుచుకుపడ్డారు. ఒక్కసారిగా ఇద్దరు ప్రజాప్రతినిధులపై పంజా విసిరారు. రాష్ట్రంలోని అధికార తెలుగుదేశం పార్టీకి చెందిన విశాఖ జిల్లా ఏజెన్సీ నియోజకవర్గం అయిన అరకు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమను కాల్చి చంపారు. ఆరు రౌండ్లు కాల్పులు జరపడంతో నేతలిద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. మావోయిస్టుల దాడిపై ఆగ్రహించిన ఎమ్మెల్యే అనుచరులు, స్థానికులు ఆందోళనలకు దిగారు.

పోలీసుల నిర్లక్ష్యమే ఈ పరిస్థితికి కారణమని ఆరోపిస్తూ అరకు, డుంబ్రిగుడ స్టేషన్లపై దాడులు చేశారు. ఫర్నిచర్‌ను ధ్వంసం చేసి స్టేషన్లకు, వాహనాలకు నిప్పుపెట్టారు. దీంతో మన్యంలో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. దాడి ఘటనపై అటు ప్రభుత్వ యంత్రాంగం, పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు అరకులోయలోని తన అతిథి గృహం నుంచి ఆదివారం ఉదయం 11.30 గంటలకు గ్రామదర్శినిలో పాల్గొనడం కోసం సరాయి గ్రామానికి బయలుదేరారు.

విశాఖ జిల్లా డుంబ్రిగుడ మండలం కండ్రుం పంచాయతీలో ఈ గ్రామం ఉంది. ఎమ్మెల్యే వెంటే మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ మరో వాహనంలో వస్తున్నారు. మధ్యాహ్నం 12 గంటల సమయంలో డుంబ్రిగుడ మండల కేంద్రాన్ని దాటి లివిటిపుట్టు చేరుకున్నారు. ఇంతలో పొదలు చాటున దాక్కున మావోయిస్టులు ఒక్కసారిగా ఆయుధాలతో రహదారిపైకి వచ్చి నాయకుల వాహనాలను అడ్డగించారు. వాహనాలను చుట్టుముట్టి ముగ్గురు గన్‌మన్‌ల నుంచి ఆయుధాలు లాక్కున్నారు. నేతలిద్దరితో పాటు వచ్చిన అరకులోయ జడ్పీటీసీ సభ్యురాలి భర్త రమేష్‌, తాజా మాజీ సర్పంచి వెంకటరావు, వ్యక్తిగత సహాయకులు, గన్‌మన్‌లను ఓ చెట్టు కిందకు తీసుకెళ్లి కొందరు మావోయిస్టులు వారితో మాట్లాడారు. డుంబ్రిగుడ నుంచి అటుగా వెళ్లే వాహనాలను నిలిపేశారు. రహదారికి అడ్డంగా రాళ్లు పెట్టారు.

జనాలను ఒక చెట్టుకింద సమావేశ పరిచారు. సుమారు 60 మంది వరకు మావోయిస్టులు ఈ ఘటనలో పాల్గొన్నట్టు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. వారిలో 30 మంది వరకు మహిళలే ఉన్నారు. ఎక్కువ మంది 25 ఏళ్లలోపు వారే. వీరంతా ఆదివాసీ తెగకు చెందిన భాషలోనే మాట్లాడుతున్నారు. ముందుగా ప్రభుత్వ విప్‌ కిడారి సర్వేశ్వరరావు వాహనం నుంచి కిందకు దిగిన వెంటనే చేతులను వెనక్కి కట్టేశారు. వెనుక వాహనంలో ఉన్న సివేరి సోమను కిందకు దించి ‘‘ఇటీవల ఒడిశాలోని గొల్లూరి వద్ద జరిగిన ఎన్‌కౌంటర్‌కు సంబంధించి నువ్వే పోలీసులకు సమాచారం ఇచ్చావు’’ అంటూ గద్దించారు.

మావోయిస్టుల బృందానికి నాయకురాలిగా భావిస్తున్న ఓ 38 ఏళ్ల మహిళ గట్టిగా తెలంగాణ యాసలో మాట్లాడింది. ఎమ్మెల్యే కిడారి హుకుంపేట మండలంలోని గూడ క్వారీ వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నా పట్టించుకోకుండా ధన దాహంతో వెంపర్లాడుతున్నాడని ఆమె మండిపడింది. పార్టీలు మారి అధికారంలోకి వచ్చాక బాక్సైట్‌ని తవ్విస్తూ గిరిజన ద్రోహులుగా మారారని నిందించింది. మాజీ ఎమ్మెల్యే సోమ ఒడిశా సరిహద్దుల్లోని గొల్లోరి వద్ద గతేడాది మావోయిస్టుల శిబిరంపై పోలీసులు జరిపిన కాల్పులకు కారణమని, కాల్పుల్లో తాము త్రుటిలో తప్పించుకున్నామని, తమని చంపించేందుకు పోలీసులతో చేతులు కలిపిన సోమ ద్రోహి అని ఆవేశపూరితంగా చెప్పింది.

సుమారు 15 నిమిషాలు ఆమె మాట్లాడింది. ఆయుధాలతో చుట్టుముట్టేసి కాల్చేయడానికి సిద్ధమవుతున్న సమయంలో ‘‘ఆయుధాలతో వద్దు, మాట్లాడుకుని పరిష్కరించుకుందాం’’ అని ఆ మహిళా మావోయిస్టును ఎమ్మెల్యే కిడారి బతిమలాడారు. ఎమ్మెల్యే మావోయిస్టులతో మాట్లాడుతుండగానే ‘‘మీ ఖేల్‌ఖతం’’ అని మహిళా మావోయిస్టు అరిచింది. వెంటనే మాజీ ఎమ్మెల్యే సివేరి సోమా దగ్గర ఉన్న మావోయిస్టులు ఆయనపై రెండు రౌండ్లు కాల్పులు జరిపారు. ఆయన అక్కడికక్కడే చనిపోయారు.

ఎమ్మెల్యే కిడారి కాల్పులు వద్దని వేడుకుంటుండగానే ఆయనపైనా రెండు రౌండ్లు కాల్పుల జరిపారు. ఇద్దరు నేతలూ రక్తమడుగులో నేలకొరిగిన తరువాత ఓ యువతి వారి దగ్గరకు వచ్చి మరో రెండు రౌండ్లు కిడారిపై కాల్పులు జరిపింది. ‘‘చనిపోయాడు కదా, ఇంకెందుకు బుల్లెట్లు వృథా చేస్తావ్’’ అంటూ ప్రధాన మహిళా మావోయిస్టు ఆ యువతిని వారించినట్లు తెలిసింది.

ఎమ్మెల్యే కిడారిపై గత కొంత కాలంగా మావోయిస్టులు నిఘా పెట్టారు. క్వారీలు, గిరిజనుల భూముల వ్యవహారాల్లో స్థానికులకు అన్యాయం చేస్తున్నారని ఇదివరకే హెచ్చరికలు జారీచేశారు. వీటిపై ప్రజాప్రతినిధులు అప్రమత్తంగానే ఉన్నా ఇటీవల పార్టీ వ్యవహారాల్లో జోరు పెంచారు. ఎన్నికలు సమీపిస్తుండడంతో గ్రామాలన్నీ చుట్టిరావాలని భావించారు. ఈ సమాచారం తెలుసుకున్న మావోయిస్టులు పక్కా ప్రణాళికతో దాడికి దిగినట్లు తెలుస్తోంది. పోలీసులు కూడా ఉదాసీనంగా వ్యవహరించడం వారికి కలిసొచ్చింది. అందుకే మారుమూల గ్రామాల్లో కాకుండా మండల కేంద్రానికి కూతవేటు దూరంలో నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే హత్యకు దిగారు.

ఒడిశా సరిహద్దుకు 15 కిలోమీటర్ల దూరంలో ఈ కాల్పులు జరిపారు. ఎమ్మెల్యే కిడారితో పాటు మాజీ ఎమ్మెల్యే సివేరి సోమకు కూడా మన్యంలో నల్లరాయి, కాల్సైట్‌ క్వారీలున్నాయి. వీటిలో నిబంధనలకు విరుద్ధంగా మైనింగ్‌ చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా హుకుంపేట మండలంలోని గూడలో కిడారికి చెందిన నల్లరాయి క్వారీయింగ్‌పై స్థానికులు గత 85 రోజులుగా ఆందోళన చేస్తున్నారు. గూడ క్వారీలో యంత్రాలతో డ్రిల్లింగ్‌ చేయడం ద్వారా పర్యావరణానికి హాని కలగడంతో పాటు పరిసర గ్రామాలు కాలుష్య భరితంగా మారిపోయాయంటూ పాడేరు ఐటీడీఏ కార్యాలయం ఎదురుగానే 70 రోజులు దీక్షలు చేపట్టారు. క్వారీ వద్ద 15 రోజులు ఆందోళన నిర్వహించారు.

వీరికి తెలుగుదేశం పార్టీ మినహా మిగతా అన్ని పార్టీల నాయకులు మద్దతిచ్చారు. మావోయిస్టులు కూడా ఈ విషయమై గతంలోనే హెచ్చరికలు జారీచేసినట్లు తెలిసింది. దీంతో తాత్కాలికంగా ఈ క్వారీని అధికారులు మూయించారు. అయితే, శాశ్వతంగా క్వారీ మూతపడేలా ఆదేశాలివ్వాలని శనివారం వరకు ఆ గ్రామస్థులు ఆందోళన చేస్తూనే ఉన్నారు. ఆదివారం కిడారి, సివేరి సోమతోనూ ఈ విషయమై మావోయిస్టులు వాదించారు. క్వారీ మూసేయాలని చెప్పినా ఎదురించి ఎందుకు నిర్వహిస్తున్నారని నిలదీశారు. ఆ క్వారీ మూసేశామని, ఆయుధాలు వాడ వద్దని, శాంతియుతంగా మాట్లాడుకుందామని అంటుండగానే తుపాకీలు ఎక్కుపెట్టి కాల్పులు జరపడంతో నేతలిద్దరూ అక్కడికక్కడే మృతిచెందారు.

కాగా, అరకు శాసనసభ్యుడు కిడారి సర్వేశ్వరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమను మావోయిస్టులు హత్య చేయడంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. హేయమైన చర్యగా అభివర్ణించారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలియజేశారు. దాడులు, హత్యలు మానవత్వానికి మచ్చని, ఈ సంఘటన ప్రజాస్వామ్యానికి చెంపపెట్టని పేర్కొన్నారు. ప్రజాస్వామ్య, అభ్యుదయవాదులంతా ఈ దాడిని ఖండించాలన్నారు. ఏజెన్సీ ప్రాంతాల అభివృద్ధికి, గిరిజనుల సంక్షేమానికి సర్వేశ్వరరావు, సివేరి సోమ చేసిన కృషి నిరుపమానమని సీఎం కొనియాడారు. వారి కుటుంబాలకు అన్నివిధాలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

అమెరికా వెళుతున్న ముఖ్యమంత్రికి విమానంలో ఉండగానే ఆయన కార్యాలయ అధికారులు సమాచారమందించారు. విమానం నుంచే హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప, అధికారులతో పరిస్థితిని ముఖ్యమంత్రి సమీక్షించారు. ఆదివారం రాత్రి (భారత కాలమానం ప్రకారం) న్యూయార్క్‌లో దిగిన వెంటనే విమానాశ్రయం నుంచే రాష్ట్ర అధికారులతో అత్యవసర సమీక్ష నిర్వహించారు. కాగా, మావోయిస్టుల హత్యాకాండపై జనసేన భిన్నంగా స్పందించింది. అక్రమ క్వారీలపై ప్రభుత్వం సకాలంలో స్పందించి ఉంటే ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేలు ప్రాణాలు కోల్పోయేవారు కాదని, వారి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నట్లు జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ పేర్కొంది.

ప్రజాస్వామ్యంలో హింస, హత్యలకు తావులేదని, ఈ ఘటన తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని, మృతుల కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లు వైకాపా అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహనరెడ్డి తెలిపారు. అన్యాయంగా నేతలను హతమార్చడం ద్వారా మావోయిస్టులు బడుగు వర్గాలకు వ్యతిరేకమనే భావన అందరిలోనూకలుగుతోందని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (ఎమ్మార్పీఎస్) వ్యవస్థాపకుడు మంద కృష్ణమాదిగ అభిప్రాయపడ్డారు. ఇదిలావుండగా, మావోయిస్టులు మన్యంలో మరోమారు తమ ఉనికిని చాటుకునే ప్రయత్నం చేశారనే భావన వ్యక్తమవుతోంది. ఇటీవల కొత్త రిక్రూట్‌మెంట్లతో బలం పెంచుకున్న నక్సల్స్ తమ ఉనికిని నిరూపించుకోవడం ద్వారా పోలీసులకు సవాలు విసిరారని తెలుస్తోంది.