• సీఎం ఆదేశంతో డీజీపీ కీలక నిర్ణయం

  • ముందస్తు సమాచారం ఇవ్వలేదని నింద

  • మావోయిస్టుల కదలికలపై మరింత నిఘా

  • ఘటనపై విచారణకు ప్రత్యేక దర్యాప్తు బృందం

అమరావతి: విశాఖ మన్యంలో ఆదివారం జరిగిన ప్రజాప్రతినిధులపై మావోయిస్టులు తీర్చుకున్న ప్రతీకార చర్య నేపథ్యంలో పోలీసు యంత్రాంగం అప్రమత్తమయింది. గత కొంత కాలంగా స్తబ్దుగా ఉన్న నక్సల్స్ ఒక్కసారిగా విరుచుకుపడిన తీరు పట్ల ఆశ్చర్యం వ్యక్తంచేస్తూనే మరోపక్క ప్రతీకార చర్చకు ఉపక్రమించింది. ఘటన జరిగిన కొద్ది గంటల్లోనే మావోయిస్టులపై గాలింపు చర్యలు చేపట్టింది.

ఏవోబీ పరిధిలో దాదాపు ఆరు జిల్లాల పోలీసులు, ప్రత్యేక దళాలు, సీఆర్‌పీఎఫ్ బలగాలతో గాలింపు ముమ్మరం చేసింది. మరోవైపు, హత్యాకాండకు బాధ్యుడిని చేస్తూ డుండ్రిగుడ ఎస్సైను ఏపీ డీజీపీ ఆర్‌.పి.ఠాకూర్‌ సస్పెండ్‌ చేశారు. అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమపై మావోయిస్టుల దాడి, అనంతరం జరిగిన అల్లర్లను నివారించడంలో వైఫల్యం చెందడంతో ఎస్సైపై వేటు పడింది. ఈ ఘటనపై విశాఖలోని ఓఎస్డీ (ఆపరేషన్స్‌) ఆధ్వర్యంలో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌)ను ఏర్పాటు చేసినట్లు డీజీపీ ప్రకటించారు.

ఇంకోవైపు హత్యకు గురైన ఎమ్మెల్యే సర్వేశ్వరరావు మృతదేహానికి పాడేరులో, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ మృతదేహానికి అరకులో ప్రభుత్వ లాంఛనాలతో సోమవారం అంత్యక్రియలు నిర్వహించనున్నారు. మావోయిస్టుల కోసం చేపట్టిన గాలింపు చర్యలతో మన్యంలో అప్రకటిత కర్ఫ్యూ విధించినట్లు అయింది.