రాఫెల్ రద్దు వ్యవహారం ఆచరణ సాధ్యం కాని అంశంగా మారింది. అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య వివాదం మినహా ఈ అంశంలో ఎలాంటి కీలక నిర్ణయం తీసుకునే పరిస్థితిలో కేంద్ర ప్రభుత్వం లేదన్నది కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటనతో అర్ధమైంది.

రాజకీయ వివాదాల సుడిగుండంలో చిక్కుకున్న రాఫెల్‌ యుద్ధవిమానాల ఒప్పందాన్ని రద్దు చేసే ప్రశ్నేలేదని అరుణ్‌జైట్లీ స్పష్టంచేశారు. వివాదానికి ఆజ్యం పోసిన ఫ్రాన్స్‌ మాజీ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్‌ హోలన్‌ తన తొలి ప్రకటనతో విభేదించారని చెప్పారు. రాఫెల్‌ తయారీ సంస్థ ‘డసో ఏవియేషన్‌’ తన భారత భాగస్వామిగా రిలయన్స్‌ను ఎంచుకోవడంలో ఇటు భారత ప్రభుత్వం కానీ అటు ఫ్రాన్స్‌ ప్రభుత్వం కానీ ఎలాంటి పాత్ర పోషించలేదని పేర్కొన్నారు. భాగస్వామిగా రిలయన్స్‌ పేరును భారత ప్రభుత్వమే సూచించిందంటూ హోలన్‌ చేసిన ప్రకటన రాజకీయ దుమారాన్ని సృష్టించిన సంగతి తెలిసిందే.

దీనికి సంబంధించి కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ప్రధాని మోదీ, రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు. దీనిపై జైట్లీ తాజాగా ఓ టీవీ ఇంటర్వ్యూ స్పందించారు. హోలన్‌, రాహుల్‌ గాంధీ ప్రకటనల మధ్య ఏదో సంబంధం ఉన్నట్లు కనపడుతోందన్నారు. ‘‘రాఫెల్‌పై ఫ్రాన్స్‌లో బాంబులు పేలబోతున్నాయని రాహుల్‌ గత నెల 30న ట్విటర్‌లో పేర్కొన్నారు. ఆయనకు ముందుగానే ఈ విషయం ఎలా తెలుసు? ఆ సంబంధం గురించి నా వద్ద ఎలాంటి ఆధారాలూ లేకపోయినప్పటికీ అనుమానాలకు మాత్రం తావిస్తోంది.

తప్పకుండా ఏదో జరుగుతోంది. హోలన్‌ నుంచి ఒక ప్రకటన రావడం ఆ తర్వాత ఆయనే దానితో విభేదించడం జరిగింది’’ అని పేర్కొన్నారు. దేశ రక్షణ బలగాల అవసరాల దృష్ట్యా రాఫెల్‌ ఒప్పందాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ రద్దు చేయబోమన్నారు. అంతకుముందు జైట్లీ ఫేస్‌బుక్‌లో ఒక ప్రకటన చేశారు. ఫ్రాన్స్‌ మాజీ అధ్యక్షుడి తొలి ప్రకటన.. రాహుల్‌ గాంధీ అంచనాతో సరిపోలిందన్నారు.

కాంగ్రెస్‌ నేతలు అసభ్య పదజాలం వాడుతున్నారని దుయ్యబట్టారు. భారత ప్రభుత్వ సూచన మేరకే రిలయన్స్‌ ఎంపిక జరిగిందన్న హోలన్‌ ప్రకటనే తాజా వివాదానికి మూలమని చెబుతూ ‘‘ఆ తర్వాత చేసిన ప్రకటనలో ఆయన తాను మొదట చెప్పిన అంశంతో విభేదించారు. రిలయన్స్‌ డిఫెన్స్‌ తరఫున భారత ప్రభుత్వం పైరవీ చేసిందో లేదో తనకు తెలియదని చెప్పారు. భాగస్వాములను ఆయా కంపెనీలే చూసుకున్నాయన్నారు. నిజమనేదానికి రెండు పార్శ్యాలు ఉండవు’’ అని పేర్కొన్నారు.

హోలన్‌ మొదటి ప్రకటనను ఫ్రాన్స్‌ ప్రభుత్వం, డసో సంస్థ ఖండించాయని తెలిపారు. ఆయన చేసిన రెండో ప్రకటన ప్రకారం డసో, రిలయన్స్‌లే సొంతంగా భాగస్వామ్య ఒప్పందాన్ని చేసుకున్నాయని చెప్పారు. మొదట ఆయన చేసిన సందేహాస్పద ప్రకటనను ఇది విభేదిస్తోందన్నారు.

మరోవైపు, ‘రాఫెల్‌’ ఒప్పందంపై మాజీ అధ్యక్షుడు ఫ్రాన్స్‌వో హోలన్‌ చేసిన ప్రకటనపై ఫ్రాన్స్‌లోనూ చర్చలు మొదలయ్యాయి. ఈ ప్రకటన భారత్‌-ఫ్రాన్స్‌ మధ్య ఉన్న సంబంధాలను నష్టపరుస్తుందన్న భయం కలుగుతోందని ప్రభుత్వం ప్రకటించింది. ‘రాఫెల్‌’ యుద్ధ విమానాలు తయారు చేసే డసో ఏవియేషన్‌కు స్థానిక భాగస్వామిగా అనిల్‌ అంబానీకి చెందిన రిలయన్స్‌ డిఫెన్స్‌ను ఎంపిక చేసుకోవాలని భారత ప్రభుత్వమే చెప్పిందని హోలన్‌ తెలిపారు.

ఈ విషయంలో డసోకు మరో ప్రత్యామ్నాయం లేకపోయిందని చెప్పారు. ఈ ప్రకటనపై భారత్‌లో రాజకీయ విమర్శలు వస్తుండడాన్ని ప్రభుత్వం గమనిస్తోంది. ఈ వ్యవహారంపై ఫ్రాన్స్‌ విదేశాంగ శాఖ సహాయ మంత్రి జీన్‌ బాప్టిస్ట్‌ లేమోన్‌ రేడియో-జేతో మాట్లాడారు. ‘‘ఫ్రాన్స్‌-భారత్‌ సంబంధాలతో ముడిపడి ఉన్న ఈ వ్యాఖ్యలను గమనించాను. ఇవి ఎవరికీ ప్రయోజనం కలిగించవు. ముఖ్యంగా ఫ్రాన్స్‌కు అసలే మేలు చేయవు. భారత్‌-ఫ్రాన్స్‌ వ్యూహాత్మక భాగస్వామ్యానికి నష్టం కలిగిస్తాయి. భారత్‌లో కచ్చితంగా వివాదాన్ని రేపుతాయి. ఇది మంచిది కాదు’’ అని వ్యాఖ్యానించారు.

తన గర్ల్‌ఫ్రెండ్‌ జూలీ తీసిన సినిమాకు అనిల్‌ అంబానీకి చెందిన కంపెనీ పాక్షికంగా ఆర్థిక సాయం చేయడాన్ని సమర్థించుకున్న సమయంలో హోలన్‌ ‘రాఫెల్‌’ ఒప్పందంపై వ్యాఖ్యలు చేశారు. ఇది భారత్‌లో రాజకీయ దుమారం రేపడం తమపై ప్రభావం చూపుతుందేమోనని ఫ్రాన్స్‌ ఆందోళన చెందుతోంది.