A metro train runs on its tracks after the inauguration of Hyderabad Metro Rail project in Hyderabad

హైదరాబాద్: హైదరాబాద్ మెట్రో రైలు (హెచ్ఎంఆర్) కారిడార్‌-1 (మియాపూర్‌-ఎల్‌బీనగర్‌) సోమవారం నుంచి పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానుంది. అమీర్‌పేట నుంచి ఎల్‌బీనగర్‌ వరకు 16 కిలోమీటర్ల మార్గాన్ని తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్‌ ఈఎస్ఎల్ నరసింహన్‌ సోమవారం మధ్యాహ్నం 12.15 గంటలకు ప్రారంభించనున్నారు. పెద్దగా హడావుడి లేకుండా జరిగే ఈ ప్రారంభోత్సవంలో తెలంగాణ రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి, ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కల్వకుంట్ల తారక రామారావుతోపాటు స్థానిక మంత్రులూ పాల్గొంటారు. గవర్నర్‌తో కలిసి వీరంతా మెట్రోలో అమీర్‌పేట నుంచి ఎల్‌బీనగర్‌ వరకు ప్రయాణిస్తారు. సాయంత్రం 6 గంటల తర్వాత ప్రయాణికులను ఈ మార్గంలో అనుమతించనున్నట్లు హైదరాబాద్‌ మెట్రో రైలు మేనేజింగ్ డైరెక్టర్ ఎన్వీఎస్‌రెడ్డి తెలిపారు.

మెట్రోరైలు కారిడార్‌-1లోని కొంత దూరం మియాపూర్‌ నుంచి అమీర్‌పేట, కారిడార్‌-2లోని నాగోల్‌ నుంచి అమీర్‌పేట వరకు 30 కిలోమీటర్ల మార్గాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, సీఎం కేసీఆర్‌ గత ఏడాది నవంబరు 28న ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఆ మరుసటి రోజు నుంచి ప్రయాణికులకు మెట్రోలో అనుమతించారు. ఈ సారి మాత్రం ప్రారంభోత్సవం రోజు సాయంత్రం నుంచే అనుమతించనున్నారు. సోమవారం ప్రారంభించే మెట్రో మార్గంతో కలిపి హైదరాబాద్‌లో 46 కిలోమీటర్ల మెట్రో రైలు మార్గం అందుబాటులోకి వచ్చినట్లవుతుంది. దీంతో దేశంలోనే అత్యంత పొడవైన మెట్రో రైలు మార్గాల్లో ఇది రెండోది అవుతుంది.