• మన్యంలో విచ్చలవిడిగా ‘సాగు’తున్న వైనం

విశాఖపట్నం: విశాఖ మన్యంలో గత కొంత కాలంగా నిరాటంకంగా సాగుతున్న గంజాయి అక్రమ రవాణా మరోసారి వెలుగులోకి వచ్చింది. ఇక్కడి నుంచి హైదరాబాద్‌కు రెండు వాహనాల్లో గంజాయిని తరలిస్తున్న అంతరరాష్ట్ర గంజాయి స్మగ్లర్ల ముఠాను దేవరాపల్లి ఎస్సై నరసింహా మూర్తి, హెడ్‌ కానిస్టేబుల్‌ రాజంనాయుడుతో కూడిన పోలీసుల బృందం గురువారం ఉదయం పట్టుకుంది.

ఈ దాడిలో ఇద్దరు నిందితులు పరారీ కాగా మరో ఇద్దరు పట్టుబడ్డారు. గురువారం ఉదయం శ్రీరాంపురం ‘వై’ జంక్షన్‌ వద్ద వాహనాలను తనిఖీ చేస్తుండగా అనంతగిరి మండలం జీనబాడు నుంచి టాటా సఫారీ వాహనం, ద్విచక్ర వాహనంపై వస్తున్న వారిని ఆపి తనిఖీ చేస్తుండగా ఇద్దరు పట్టుబడగా, మరో ఇద్దరు పరారయ్యారు. వాహనాల్లో 200 కేజీల గంజాయిని హైదరాబాద్‌ తరలిస్తున్నట్లు పోలీసులకు పట్టుబడిన హరియాణా రాష్ట్రం సోనాపతి జిల్లా పుర్ఖాజ్‌ రాజీ గ్రామానికి చెందిన ముఖేశ్‌ కఠారియా (23), తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్‌ నగర శివారు మంగల్‌ హాట్‌ ప్రాంతానికి చెందిన శైలేంద్ర సింగ్‌ (32) పోలీసులకు తెలిపారు. కేసు నమోదు చేసి రెండు వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.

నిందితులను చోడవరం కోర్టుకు తరలించామని ఎస్సై తెలిపారు. మొత్తానికి జిల్లాలో గంజాయి స్మగ్లర్లు రూట్‌ మార్చుతున్నారు. గంజాయి స్మగ్లింగ్‌కు కొత్త కొత్త ఎత్తులు వేస్తున్నారు. ఏ ఏ ప్రాంతాల్లో పోలీసుల నిఘా తక్కువగా ఉంటుందో తెలుసుకుంటున్నారు. పక్కాగా ప్లాన్‌ చేసుకుని గంజాయిని జిల్లా సరిహద్దులు దాటిస్తున్నారు. విశాఖ-విజయనగరం జిల్లాలలో గంజాయి స్మగ్లర్లు తెలివిమీరిపోతున్నారు. పోలీసులకు చిక్కకుండా ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నారు. పక్కా సమాచారంతో రంగంలోకి దిగుతున్నారు.

ఒక్కోసారి ఒక్కో తరహాలో గంజాయిని స్మగ్లింగ్‌ చేస్తున్నారు. రెండు జిల్లాల సరిహద్దు మండలమైన ఎస్ కోట మీదుగా గంజాయి రవాణా ఎక్కువగా జరుగుతోంది. ఇటీవల ఎస్ కోటలో పోలీసుల తనిఖీలు ముమ్మరం కావడంతో గంజాయి స్మగ్లర్లు సాలూరు వైపు రూట్‌ మార్చారు. ఇక్కడ కూడా దాడులు పెరగడంతో మరోసారి రూట్‌ మార్చారు. గంట్యాడ మీదుగా గంజాయిని గుట్టుగా తరలిస్తున్నారు. అరకు, ఎస్ కోట ప్రాంతాల మీదుగా గంజాయి తరలించేందుకు ఆర్టీసీ బస్సులను ఎంచుకుంటున్నారు.

గతంలో ఒకసారి గంట్యాడ మార్గంలో కొబ్బరి బోండాల లారీలో తరలిస్తున్న గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. ఒడిషా నుంచి అనంతగిరి, అరకు మీదుగా విజయనగరం జిల్లాలోకి వాహనాలు వస్తున్నాయి. అయితే ఈ మార్గంలో పోలీసులు తనిఖీలు జరపడం లేదా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. రెండు మూడేళ్లుగా ఎస్ కోట ప్రాంతంలో గంజాయి పట్టుబడ్డ సందర్భాలు కోకోల్లలు. ఇటీవల జామి వద్ద రెండు వేల కేజీల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు.

ఎస్ కోట వద్ద నిఘా పెంచడంతో జామి మీదుగా తరలించేందుకు యత్నించి అడ్డంగా బుక్కయ్యారు. విశాఖ జిల్లా నర్సీపట్నం మీదుగా గంజాయి స్మగ్లింగ్‌ సాగేది. ఇక్కడ పోలీసులు సోదాలు పెరగడంతో ఎస్ కోట మీదుగా గంజాయిని తరలిస్తున్నారు. మొత్తంగా ఒడిషా నుంచి ఏపీలోకి గంజాయి స్మగ్లింగ్‌ అవుతుందనేది బహిరంగ రహస్యం. ఒడిషా కోరాపుట్ నుంచి ఇచ్చాపురం అక్కడ నుంచి ఢిల్లీకి గంజాయిని తరలిస్తున్నారు. ఏదీ ఏమైనా గంజాయి రవాణాకు మాఫియా అనేక మార్గాలు అన్వేషిస్తోంది. పోలీసులకు పట్టుబడుతున్నప్పుడల్లా కొత్త మార్గాల్లో గంజాయిని తరలిస్తున్నారు.

గంజాయి స్మగ్లర్లకు మించి పోలీసులు కూడా తమ వ్యూహాలకు పదునుపెట్టి వారి ఎత్తులను చిత్తు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎక్సైజ్‌ శాఖ దాడుల్లో ఇన్నాళ్లూ స్మగ్లర్లు, కూలీలే పట్టుపడుతున్నారు తప్ప సొంతశాఖ ఉద్యోగులు దొరక్కపోవడం గమనార్హం. ముఖ్యంగా అనకాపల్లి ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ పరిధిలోకి వచ్చే ఏజెన్సీ ప్రాంతంలో గంజాయి అక్రమ రవాణా విస్తృతంగా జరుగుతోంది. దీనిని అరికట్టాల్సింది పోయి ఆ పరిధిలోని కొంతమంది సిబ్బంది, అధికారులపైనే ఆరోపణలు వస్తున్నాయి. గంజాయి రవాణాకు సహకరిస్తున్న సొంత శాఖ వారు దొరకలేదని కాదు ఇప్పటికే ఎందరో పట్టుబడ్డారు. అందులో కొందరు తప్పించుకుతిరుగుతున్నారు.

అనకపల్లి పరిధిలోని పాడేరు మొబైల్‌ సీఐ పెదకాపు శ్రీనివాస్‌ ఇప్పటికే పోలీసులకు చిక్కి సస్పెండయ్యారు. ఆరు నెలలుగా ఆయన పత్తాలేకుండాపోయారు. అనకాపల్లి ఎక్సైజ్‌ టాస్క్‌ఫోర్సు కానిస్టేబుల్‌ నాయుడు గంజాయి విక్రయాల్లో చిక్కుకున్నారు. విజయవాడలో గంజాయితో పట్టుబడ్డ నిందితులిచ్చిన సమాచారంతో కానిస్టేబుల్‌ నాయుడు పేరు బయటకొచ్చింది.

దీనిపై ఎక్సైజ్‌ ఉన్నతాధికారులు స్పందించారు. ఈ వ్యవహారం వెలుగుచూడడంతో అప్పట్లో నాయుడు పరారీలో ఉన్నారు. ఇక కానిస్టేబుల్‌ నాయుడు తను కేసు నుంచి బయటపడేందుకు జిల్లాకు చెందిన ఓ మంత్రిని ఆశ్రయించినట్టు తెలిసింది. మరోవైపు గంజాయి అక్రమ రవాణాలో పాడేరు మొబైల్‌ టీమ్‌ సీఐ పెదకాపుపై కేసు నమోదయింది. దీంతో ఆయనను గతంలోనే సస్పెండ్‌ చేశారు. దాదాపు ఆరు నెలల నుంచి ఆయన పోలీసులకు దొరక్కుండా తప్పించుకు తిరుగుతున్నారు.

గంజాయి రవాణాపై అధికారులు సీరియస్‌గా తీసుకున్నారు. సొంత శాఖవారే సహకరిస్తున్నారన్న నిజాలు తట్టుకోలేకపోతున్నారు. దీంతోనే ఉక్కుపాదం మోపేందుకు పక్కా ప్రణాళిక సిద్దం చేశారు. అనకాపల్లి కేంద్రంగా ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ టీమ్‌ను ఏర్పాటు చేశారు. ఈ బృందంలో ఎక్సైజ్, పోలీసు, రెవెన్యూ, అటవీ, వ్యవసాయ, ఉద్యానవన శాఖ ఉద్యోగులు ఉంటారు. వీరు ప్రత్యేక దృష్టి సారించి అక్రమ గంజాయి సాగు, రవాణాలను అరికట్టేందుకు పాటుపడతారు. గంజాయి అక్రమ రవాణాలో సంబంధాలున్న ఎక్సైజ్‌ సిబ్బంది, అధికారుల జాబితాను ఇప్పటికే ఉన్నతాధికారులు సిద్ధం చేసినట్టు సమాచారం.

త్వరలోనే వారిపై వేటు వేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌ విశాఖలో మకాం వేసినట్లు తెలుస్తోంది. గంజాయికి కేంద్రంగా ఉన్న విశాఖ జిల్లాలో సరికొత్త మత్తు దందా కొనసాగుతుందా? ఇంతకాలం స్మగ్లర్లు, వివిధ ముఠాలు మాత్రమే అక్రమ రవాణా చేస్తున్నాయని తెలుసు. కానీ, జిల్లాలో ఎక్సైజ్‌ శాఖలోని కొందరు అక్రమార్కులే దందా చేస్తున్నట్లు అనుమానాలు పెరుగుతున్నాయి. గంజాయి అక్రమ సాగు, రవాణాను నియంత్రించాల్సిన వారే అందులో మునిగి తేలుతున్నారు. దొరికిన వారే దొంగలు అన్నట్టు జిల్లాలో కొంతమంది ఎక్సైజ్‌ అధికారులు గంజాయి అక్రమార్కులతో పోటీ పడుతున్నారు.

గంజాయి స్మగ్లర్లు తమపై ఎవరైనా అధికారులు దాడులు చేస్తారేమోనని భయపడుతుంటారు. అందువల్ల రవాణాలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. కానీ, దాడులు చేయాల్సిన వారే వారితో కుమ్మక్కైపోవడంతో రాష్ట్రంలో మరెక్కడా లేని విధంగా జిల్లాలో గంజాయి సాగు, రవాణా యథేచ్ఛగా సాగిపోతున్నాయి. జిల్లాలో కొన్నాళ్లుగా పట్టుబడుతున్న గంజాయిని ఎక్సైజ్‌ శాఖ యథాతథంగా చూపడం లేదన్న ఆరోపణలున్నాయి. బహిరంగంగా పట్టుబడ్డ గంజాయిని మాత్రమే రికార్డుల్లో చూపిస్తున్నారు. ఇక మారుమూల ప్రాంతాల్లో దొరికిన గంజాయిని మాత్రం లోపాయికారీగా నొక్కేస్తున్నారన్న ఆరోపణలు పెరుగుతున్నాయి.

రహస్యంగా స్వాధీనం చేసుకున్న గంజాయిని తమకు అనువైన చోటికి జీపులు, వ్యాన్లు, లారీల్లో తరలిస్తున్నారుట. ఆ తర్వాత దొరికింది దోచేసుకునే కొందరు సిబ్బంది బేరం పెట్టుకుంటున్నట్లు ఆరోపణలున్నాయి. ఇక దొరికిన అదే గంజాయిని స్మగ్లర్లకు రహస్యంగా విక్రయిస్తున్నారు. ఇలా జిల్లాలోని ఎక్సైజ్‌ శాఖలో కింది స్థాయి నుంచి పైస్థాయి వరకు కొంతమంది ఉద్యోగులు వ్యాపకంగా పెట్టుకున్నారు. సాక్షాత్తూ దాడులు చేసే సిబ్బందే గంజాయిని తరలిస్తుంటే ఎవరు అడ్డుకుంటారు? దీంతో స్మగ్లర్లు నిర్భీతిగా గంజాయి రవాణాలో వేళ్లూనుకుపోతున్నారు.

దీని అరకట్టేందుకు ఇప్పుడు ఎక్సైజ్ ఉన్నదికారలు కళ్లుతేరిచారు. పట్టుకున్నగంజాయి ఎటువైపు వెళ్తుందో తెలియని పరిస్థితి ఉండటంతో గంజాయి దాచేందుకు ప్రత్యేకంగా ఓ భవనాన్ని నిర్శస్తున్నారు. దీని ద్వారా మెజిస్ట్రీట్ ముందు ఎంత గంజాయి పట్టుకున్నారనేది తునీకలు వేసి సీచ్ చేసి తరువాత వాటిని ఆ భవనానికి తరలించనున్నట్లు ఎక్సైజ్ డేకర్టర్ తెలిపారు. జిల్లాలో గంజాయి అక్రమ రవాణా ద్వారా వచ్చే ఆదాయం రుచి మరిగిన వారు దానిని వదులుకోలేకపోతున్నారు.

జిల్లాలో గంజాయి రవాణాలో పాలుపంచుకునే వారెవరో ఉన్నతాధికారులకు తెలిసినా వారు వివిధ కారణాల వల్ల ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారన్న వాదన ఉంది. దీంతో స్మగ్లర్లతోపాటు ఎక్సైజ్‌ శాఖ సిబ్బంది కూడా భారీగా అక్రమార్జన చేస్తున్నారు. మరోవైపు, గంజాయి మత్తులో యువత వెర్రెత్తిపోతోంది. అందుకే దీనికి ఫుల్‌స్టాప్ పెట్టడానికి ఎక్సైజ్‌ అధికారులు ముందడుగు వేశారు. దేశంలో ఈ మధ్య మత్తు మందుల వినియోగం పెరిగిపోయింది. ప్రధానంగా గంజాయి మత్తుకు కాలేజ్‌ విద్యార్థులు బానిసలవుతున్నారు.

ఈ మధ్య హైదరాబాద్‌ డ్రగ్‌ మాఫియాపై తెలంగాణ ప్రభుత్వం ఉక్కుపాదం మోపడంతో ఏపీ ప్రభుత్వం కూడా అప్రమత్తమయ్యింది. అయితే, దేశంలో ఎక్కడ గంజాయి దొరికినా దాని ఆనవాళ్లు మాత్రం విశాఖ మన్యంలోనే కనిపిస్తున్నాయి. దీంతో రాష్ట్రప్రభుత్వం గంజాయిపై ఉక్కుపాదం మోపాలని నిర్ణయించింది. దానిలో భాగంగా ఎక్సైజ్, పోలీసు విభాగంతో సంయుక్త టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసింది. విశాఖ ఏజెన్సీలో సాగైన గంజాయిని తూర్పుగోదావరి జిల్లా మీదగా విదేశాలకు రవాణా చేస్తున్నారు.

ప్రభుత్వ అంచనా ప్రకారం ఏజెన్సీలోని 150 నుంచి 200 గ్రామాల్లో వేలాది ఎకరాల్లో గంజాయి సాగవుతోంది. ప్రతీ యేటా 5 వేల టన్నుల గంజాయి ఉత్పత్తవుతోంది. వరి, ఇతర పంటలలో అంతర పంటగా దాన్ని సాగు చేస్తున్నారు. మారు మూల ప్రాంతం కమ్యునికేషన్స్ అసలే ఉండవు. పైగా మావోయిస్టుల భయం. దీంతో గంజాయి సాగు, రవాణాను అరికట్టడానికి పోలీసులు, ఎక్సైజ్‌ శాఖ చేస్తున్న ప్రయత్నాలు ఫలితాన్ని ఇవ్వడం లేదు. పైగా పోలీసు అధికారులలోనూ, ఇటు ఎక్సైజ్‌ విభాగంలోనూ కొందరు గంజాయి రవాణాకు సహకరిస్తున్నారనే ఆరోపణలున్నాయి.

నల్లమందు, లిక్విడ్ గంజాయి వినియోగం విశాఖపట్నం, రాజమండ్రి, కాకినాడ, విజయవాడ, గుంటూరు, నెల్లూరు వంటి పట్టణాల్లో అధికమవుతోంది. విశాఖ ఏజెన్సీలో 6 రోజుల పాటు టాస్క్‌ఫోర్స్‌ టీం దాడులు నిర్వహించింది. ఈ క్రమంలో దాదాపు 200 ఎకరాల్లో సాగవుతున్న గంజాయి పంటను ధ్వంసం చేశారు. ఈ దాడులకు ప్రత్యేకంగా అధికారులు డ్రోన్లను కూడా ఉపయోగించారు. దళారులు గంజాయి పంటను గిరిజనుల ద్వారా పండిస్తున్నారు. వాతావరణం అనుకూలంగా ఉండటంతో ఎక్కువ ధర పలికే శీలావతి గంజాయిని సాగు చేయిస్తున్నని అధికారులు తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here