• ప్రకాశం జిల్లాలో ఒకరి దారుణహత్య

  • అర్ధరాత్రి కత్తులతో విరుచుకుపడ్డ వైనం

ఒంగోలు: ప్రకాశం జిల్లాలో రియల్టర్ల మధ్య గ్యాంగ్ వార్ జరిగింది. ఇక్కడి బేస్తవారిపేటలో నివాసం ఉంటూ రియల్ ఎస్టేట్ వ్యాపారంలో కొనసాగుతున్న రిటైర్డ్ ఆర్మీ మద్దుల రమణారెడ్డిపై ప్రత్యర్ధులు కత్తులతో విరుచుకుపడ్డారు. బుధవారం అర్ధరాత్రి దాటాక గురువారం తెల్లవారుజాము సుమారు రెండు గంటల సమయంలో రెండు వర్గాల మధ్య గొడవ జరిగినట్లు ప్రత్యక్ష సాక్ష్యులు చెప్పారు.

గుర్తు తెలియని ముగ్గురు వ్వక్తులు కత్తులతో తెగబడి ఈ దారుణానికి ఒడిగట్టారు. రమణారెడ్డిని కిరాతకంగా హతమార్చడంతో పాటు ఆయన భార్య లక్ష్మీకుమారిని సైతం తీవ్రంగా గాయపర్చారు. ఈ ఉదంతంతో బేస్తవారిపేట ఒక్కసారిగా ఉలిక్కిపడినట్లయింది. పాత కక్షలతోనే ఈ ‘వార్’ జరిగి ఉంటుందని పోలీసులు ప్రాధమికంగా భావిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు ఇప్పటికే కొంత మందిని అనుమానిస్తూ విచారణ మొదలుపెట్టారు.

నిందితులను వీలైనంత త్వరలో అరెస్టుచేస్తామని పోలీసులు తెలిపారు. హత్యోదంతం గురించి తెలిసిన వెంటనే జిల్లా ఎస్పీ సంబంధిత సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌తో నేరుగా మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. దర్యాప్తు వేగవంతంగా జరపాలని, నిందితులు జిల్లా దాటేలోపే అదుపులోకి తీసుకోవాలని ఆదేశించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here