ఆదిలాబాద్: ఓ రైతు నుంచి లంచం తీసుకుంటూ ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డు డీప్యూటీ ఈఈ కె. రవీందర్ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు పట్టుబడ్డాడు. పనిచేస్తున్న చోట లంచం తీసుకుంటే దొరికిపోతానని భయపడ్డారో ఏమో గానీ, నిజామాబాద్‌లో బాధితుడి నుంచి లక్షా పదివేల రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కాడు.

నిర్మల్ జిల్లా భైంసా మండలం నరసింహనగర్ ప్రాంతానికి చెందిన సివిల్ కాంట్రాక్టర్ ఎం.డి. అబ్దుల్ మతీన్‌కు సాయం చేసేందుకు రవీందర్ లంచం డిమాండు చేశారు. మతీన్ మార్కెట్ యార్డ్ పరిధిలో పలు సివిల్ వర్క్‌లు చేశారు. దానికి సంబంధించిన 22 లక్షల రూపాయల బిల్లులో ఇంకా 4.7 లక్షలు విడుదల కావాల్సి ఉంది. దీంతో రవీందర్ లంచం అడగడంతో మతీన్ ఏసీబీ అధికారులను సంప్రదించారు.

రవీందర్‌ అవినీతి, ఆదాయానికి మించిన ఆస్తులపై గతంలో కూడా పలు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇదిలావుండగా, నార్నూర్‌ మండలంలోని బలాన్‌పూర్‌ గ్రామంలో కోవ రేణుకాబాయి (19) అనే గిరిజన యువతి విద్యుదాఘాతంతో మృతి చెందినట్లు ఏఎస్‌ఐ రాఠోడ్‌ తానాజీ మీడియాకు తెలిపారు. తిర్యాణి మండలంలోని పంగిడిమాదార గ్రామానికి చెందిన రేణుకాబాయి ఈ నెల 19న నార్నూర్‌ మండలంలోని బలాన్‌పూర్‌లోని తన అమ్మమ్మ ఇంటికి వచ్చింది.

రాత్రి భోజనాలు చేసిన అనంతరం పాత్రలు కడిగి నెత్తిపై ఎత్తుకొని ఇంట్లోకి వెళ్తుండగా వేలాడుతున్న విద్యుత్తు తీగ చేతికి తగిలింది. విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందినట్లు ఏఎస్‌ఐ వివరించారు. ఈ విషయమై కుటుంబీకులు స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా సంఘటన స్థలానికి పోలీసులు చేరి శవ పంచనామా చేసి ఉట్నూర్‌ ఆసుపత్రిలో పోస్టుమార్టం చేయించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్‌ఐ తానాజీ తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here