విజయవాడ: కృష్ణా జిల్లా మైలవరంలోని లక్కిరెడ్డి బాలిరెడ్డి ఇంజినీరింగ్ కళాశాలలో మొదటి సంవత్సరం సీఎస్‌సీ చదువుతున్న గోళ్ల రామకృష్ణ (18) అనుమానాస్పదంగా మృతిచెందాడు. కారణాలు తెలియరానప్పటికీ విద్యార్ధి మృతితో కళాశాలలో వాతావరణం విషాదమయమైంది. రామకృష్ణ విజయవాడ రోడ్డులోని గాంధీ కో ఆపరేటివ్ బ్యాంక్ సమీపంలో అద్దె రూమ్‌లో ఉంటున్నాడు.

గుంటూరు జిల్లా వేముల గ్రామానికి చెందిన విద్యార్ధి తండ్రి పేరు వెంకటేశ్వరరావు. శనివారం ఉదయం 10 గంటల సమయంలో మొదటి అంతస్తుపై నుండి యువకుడు కిందపడ్డాడని స్థానికులు చెబుతున్నారు. ఈ సమాచారాన్నే ప్రాధమిక అంశంగా తీసుకుని పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించి కేసును ఎస్.ఐ. రామకృష్ణ దర్యాప్తు చేస్తున్నారు.

ఇదిలావుండగా, కృష్ణా జిల్లా గంపలగూడెం మండలంలోని దుందిరాలపాడుకు చెందిన గంధం కుమారి (40) విషజ్వరంతో మృతిచెందింది. కుమారి వారం రోజులుగా వైరల్‌ఫీవర్‌తో మంచానపడింది. మెరుగైన చికిత్స నిమిత్తం కుటుంబ సభ్యులు రెండు రోజుల క్రితం ఆమెను మధిర ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ జ్వరం నియంత్రణలోకి రాకపోవడంతో విజయవాడ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతిచెందింది. కుమారి మృతదేహాన్ని ఇంటికి తీసుకువచ్చారు. దుందిరాలపాడులోనూ విషజ్వరాలు అధికంగా ఉన్నాయని గ్రామస్థులు వెల్లడించారు.