• గద్దెదింపైనా హక్కులు సాధిస్తామని వెల్లడి

  • తాడేపల్లిగూడెం ధర్మపోరాటం సభలో చంద్రబాబు

తాడేపల్లిగూడెం: ఇప్పటికైనా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి న్యాయం చేసేందుకు కళ్ళుతెరవాలని లేదంటే గద్దే దింపైన హక్కులు సాధించుకుంటామని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు హెచ్చరించారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో శనివారం నిర్వహించిన ధర్మపోరాటం కార్యాక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చివరికి గెలిచేది ధర్మం, న్యాయమేనని ఆయన స్పష్టం చేసారు. హేతుబద్దతిలేని విభజనవలన అప్పులతోను, కట్టుబట్టలతోను వచ్చామన్నారు. బిజెపితో పొత్తుపెట్టుకోవడానికి కారణం రాష్ట్రానికి మేలు జరుగుతుందనే భావనతో వెళ్ళామన్నారు.

అయితే కేంద్రం వచ్చి నాలుగున్నర ఏళ్లు అయినప్పటికీ ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోయారన్నారు. అమరావతి శంఖుస్థాపన సమయంలో ఏపీకి అన్ని రకాలుగా సహకరిస్తామని చెప్పిన నరేంద్రమోదీ మాటతప్పారన్నారు. తాను 29 సార్లు ఢిల్లీ వెళ్లి ప్రధానితోపాటు ఇతర కేంద్ర మంత్రులను కలిసిన రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హామీలపై వినతులను విస్మరించారన్నారు. దేశంలో 11 రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇచ్చినప్పటికీ ఏపీకి ఇవ్వలేదన్నారు. ప్రజల జీవననాడి అయిన పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి ఎవరు అడ్డువచ్చిన పూర్తి చేసి తీరుతామని సీఎం చంద్రబాబు స్పష్టం చేసారు.

నదుల అనుసంధానం ఒక కల అని కానీ, గోదావరి, కృష్ణ నదులను కలిపి అనుసంధానం చేసి చూపించామన్నారు. పోలవరంకు మారిన అంచనాల ప్రకారం 58 కోట్ల రూపాయలు అవసరమవుతాయన్నారు. వచ్చే ఏడాది మే నెలలో గ్రావిటీ ద్వారా నీరు విడుదల చేస్తామని, 2019 నాటికి పూర్తి చేస్తామన్నారు. పోలవరం ప్రాజెక్టు గోదావరి జిల్లాలకే కాకుండా రాష్ట్రం మొత్తం సస్యశ్యామలం అవుతుందన్నారు. నదుల అనుసంధానం చేసిన ఘనత ఆంధ్రప్రదేశ్‌కే దక్కుతుందన్నారు.

పోలవరం ప్రాజెక్టు పనులు 58 శాతం పూర్తి అయ్యాయన్నారు. ప్రాజెక్టుకు సంబంధించి 3 వేల కోట్ల రూపాయలను కేంద్రం అందించవలసి ఉందన్నారు. ప్రాజెక్టు నిర్మాణానికి నిధులు ఇవ్వకుండా కష్టపెడుతున్నారని అయినప్పటికీ జాతి ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని పనులు ముమ్మరంగా చేస్తున్నామన్నారు. ఇప్పటి వరకూ సవరించిన ప్రాజెక్టు రిపోర్టు ఇవ్వలేదని, ఇప్పటికే కేంద్రం కోరిన సమాచారం అంతా రాష్ట్రం నుంచి అందించామన్నారు. అయినా కేంద్రం ఈ విషయంలో మీనమేషాలు లెక్కిస్తుందన్నారు. పోలవరం పూర్తి కావాలా వద్దా అని సభికులను సీఎం చంద్రబాబు ప్రశ్నించారు.

ఏది ఏమైనప్పటికీ ప్రాజెక్టు పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. ప్రధానమంత్రి డోలేరా నగరానికి రూ.3వేల కోట్లు, పటేల్‌ విగ్రహానికి రూ.300 కోట్లు ముంబాయి-అహ్మదాబాద్‌ బుల్లెట్‌ ట్రైన్‌కు రూ.లక్ష 80 వేల కోట్లు ఇవ్వగా అమరావతికి మాత్రం రూ. 1500 కోట్లు మాత్రమే ఇచ్చారన్నారు. అయినప్పటికీ అమరావతిని ప్రపంచంలో అత్యుత్తమ 5 నగరాల్లో ఒకటిగా నిలబెడతామన్నారు. అమరావతి రాజధాని పూర్తి చేసి చూపిస్తామని సీఎం చంద్రబాబు స్పష్టం చేసారు. రాష్ట్రంలో వెనకబడిన ప్రాంతాల అభివృద్ధికి రూ.350 కోట్లు ఇచ్చి ఏపీ అకౌంట్లో ఉన్న డబ్బును తిరిగి వెనక్కి తీసుకొన్నారని ఇది చట్ట విరుద్దమన్నారు. షెడ్యూల్‌ 9, 10 ప్రకారం ఆస్థుల విభజన జరగలేదన్నారు.

ఈ విషయంలో ఉభయ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశం నిర్వహించి సమస్యను పరిష్కరించాల్సింది పోయి ఇరు రాష్ట్రాల మధ్య చిచ్చుపెట్టేందుకు కేంద్రానికి తగదన్నారు. కొల్లేరు సమస్య పరిష్కరిస్తానని హామీ ఇచ్చిన మోదీ ఇప్పుడు సహకరించడంలేదన్నారు. ఇందుకు నిధుల అవసరత కూడా ఏ మాత్రం లేదని సీఎం వివరించారు. గోదావరి జిల్లాల ప్రజలు చాలా మంచివారని వారిని గనుక మోసగిస్తే అడ్రస్సు గల్లంతు అవుతుందన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రంపై అవిశ్వాస తీర్మానం పెట్టిన ఘనత టిడిపిదేనన్నారు. అవిశ్వాస తీర్మానం సమయంలో వైసిపి మాట్లాడకుండా బెదిరిపోయి పారిపోయారని వారికి మోదీ అంటే భయమన్నారు.

అయితే తాము బెదిరిస్తే భయపడమని, టిడిపి తెలుగు ప్రజల పౌరుషానికి ప్రతీకని ఆయన అన్నారు. ప్రతీ కార్యకర్త ఎన్టీఆర్‌లా ఒక బెబ్బులి పులి, ఒక కొండవీటి సింహంలా గర్జిస్తారన్నారు. ఏపీకి అన్యాయం జరిగితే తెలుగుజాతి తిరుగుబాటు చేస్తుందని ఆయన హెచ్చరించారు. తాను యుటర్న్‌ తీసుకోలేదని కేంద్రమే యుటర్న్‌ తీసుకొందని ఆయన వివరిస్తూ తాను రైట్‌ టర్న్‌ తీసుకొన్నారన్నారు. అవినీతి పార్టీ అయిన వైసిపిని బీజేపీయే దగ్గరకి తీసుకొందని కేంద్రాన్ని విమర్శించారు. తద్వారా అవినీతిపరుడుని కాపాడుతున్నారన్నారు. రాష్ట్రానికి న్యాయం చేయవలసిన బాధ్యత కేంద్రానిదేనని, అమరావతి కడితే ఆ పన్నులు కేంద్రానికే వెళతాయన్నారు.

‘‘నేను రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై పోరాటం చేస్తే యుటర్న్‌ తీసుకొన్నానని అంటున్నారు. పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరుగుతున్నాయని ఈ ధరలు సెంచరీ దాటుతుందని నేను ఎప్పుడో చెప్పాను. కావల్సిన వ్యక్తులకు కట్టబెట్టేందుకు, దేశ రక్షణ ప్రయోజనాలను తాకట్టు పెట్టి రాఫెల్‌ కుంభకోణానికి తెరతీసారు. రాష్ట్రంలో చేపట్టే అభివృద్ధి పనులకు వైసిపి అడ్డం పడుతోంది’’ అని విమర్శించారు.

ఐక్యరాజ్య సమితిలో తెలుగులో ప్రసంగించిన మొదటి వ్యక్తిని తానేనని చంద్రబాబు అన్నారు. పవన్‌ కళ్యాణ్‌ కేంద్రం డైరెక్షన్‌లో ఎన్‌డిఎ మార్గదర్శకంలో నడుస్తున్నారన్నారు. ఫ్యాక్ట్‌ ఫైండింగ్‌ కమిటీ వేసిన పవన్‌ ఏపీకి 75 వేల కోట్ల రూపాయలు రావాలని తేల్చారని, అయితే ఆ నిధులు సాధించడానికి ఏ ప్రయత్నం చేసారని ఆయన ప్రశ్నించారు. తనకు ప్రాణహాని ఉందని జనసేన నేత పవన్‌ అంటున్నారని ఆయనకు ఎంత భద్రత అయిన కల్పిస్తామన్నారు. ఆయన భయపడనవసరంలేదని, ఆధారాలు ఇస్తే విచారణ చేయిస్తామని అంతే కాని విమర్శలు చేయొద్దని చంద్రబాబు విజ్ఞప్తి చేసారు. విశాఖ రైల్వే జోన్‌ అందరి కల అని, ఓరిస్సా రాష్ట్రం కూడా ఇందుకు ఒప్పుకుందన్నారు.

కడపలో స్టీల్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేయవల్సి ఉందని, ఇందుకు అవసరమైన విద్యుత్‌, నీరు తదితర సౌకర్యాలు కల్పిస్తామని చెబుతున్నప్పటికీ కేంద్రం అడ్డుపడుతుందన్నారు. రాష్ట్రంలో 11 విశ్వవిద్యాలయాలు ఏర్పాటు చేస్తామని చెప్పినప్పటికీ 9 మాత్రం పేపర్‌లో ఇచ్చారని వాటికి కూడా అరకొర నిధులు కేటాయించారన్నారు. ఇదే విధానం కొనసాగితే 30 సంవత్సరాలనాటికి కానీ ఈ పనులు పూర్తి కావన్నారు. వీటి కోసం తెలుగుజాతి 30 సంవత్సరాల వరకూ ఆగవల్సిందేనా? అని సీఎం ప్రశ్నించారు.

కృష్ణపట్నం పోర్టుకు సంబంధించి పన్నులు హైదరాబాద్‌లో కట్టే పరిస్థితి ఉందని, అదే విధంగా విశాఖ, విజయవాడకు మెట్రోలకు నిధులు కోరితే ఇతర రాష్ట్రాలకు ఇస్తున్నారే తప్ప ఏపీకి ఇచ్చేందుకు మనస్సురావడం లేదన్నారు. విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంగా తీర్చిదిద్దాలని కేంద్రాన్ని కోరామని పైగా ఇక్కడ ప్రయాణికుల రద్దీ కూడా పెరిగిందన్నారు. ఇందుకు అవసరమైన వేలకోట్ల విలువ చేసే భూమిని కూడా ఇచ్చామన్నారు. పశ్చిమగోదావరి జిల్లా వరి ఉత్పాదకతలో దేశంలోనే నెంబర్‌ 1గా నిలుస్తుందన్నారు. ఇక్కడ పండించిన పంట ఓ పద్దతి ప్రకారం కొనుగోలు చేస్తున్నామన్నారు. ఇందుకోసం 2 వేల కోట్లు ఖర్చు మొత్తం ప్రభుత్వం తీసుకొందన్నారు.

చంద్రన్న బీమా, చంద్రన్న పెళ్లికానుక, అన్న క్యాంటీన్‌ ఎన్నో వినూత్న కార్యక్రమాలు అమలు చేస్తున్నామన్నారు. నిరుద్యోగ యువతకు ఒక శుభవార్తని, రూ. 1000/- చొప్పున నిరుద్యోగ భృతి అందిస్తామన్నారు. ముఖ్యమంత్రి యువనేస్తం కింద యువతకు ఒక అండగా చేయూతనిస్తామన్నారు. రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు తీసుకొన్న చర్యలు ఫలిస్తే 32 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు అందుతాయన్నారు. పేదల ఆరోగ్యాన్ని కాపాడే ఏకైక ప్రభుత్వం తెలుగుదేశం అన్నారు.

నోట్ల రద్దు, జిఎస్‌టిని తీసుకొచ్చి అస్తవ్యస్తంగా మార్చారని, ఇటువంటి ఎన్నో కార్యక్రమాలను తీసుకువచ్చి అభివృద్ధిని కేంద్రం వెనక్కి తీసుకెళుతుందన్నారు. కేంద్రం తీసుకొన్న చర్యల ఫలితంగా దేశంలో అభివృద్ధి కుంటుపడిందని అనుకున్న పంధాలో సాగడం లేదన్నారు. రాష్ట్రంలో చేపట్టిన ప్రకృతి సేధ్యం ప్రపంచానికి రాబోయే రోజుల్లో ఒక బహుమానం అన్నారు. దీనివల్ల ఆరోగ్య సంరక్షణకు ఎంతో దోహదపడుతుందన్నారు. రాష్ట్రంలో ఉపాధి హామీ పనులు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు. ఇప్పటికైనా కేంద్రం మొద్దు నిద్ర వదిలి రాష్ట్రానికి న్యాయం చేయాలన్నారు. రాష్ట్ర అభివృద్ధికి తెలుగుదేశం ప్రభుత్వం గెలుపు చారిత్రక అవసరం అన్నారు.

తద్వారా దేశంలో ప్రధాన మంత్రిని ఎంపిక చేసే భాద్యత మనమే చేసుకోవాలని దీనికి ప్రజలు సిద్ధంగా ఉండాలన్నారు. తొలుత రాష్ట్ర మంత్రులు నారా లోకేష్‌, పితాని సత్యనారాయణ, కెఎస్‌ జవహర్‌, కళా వెంకటరావు, సిహెచ్‌ అయ్యన్న పాత్రుడు, ప్రత్తిపాటి పుల్లారావు, ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, ఏలూరు ఎంపీ మాగంటి బాబు తదితరులు ప్రసంగించారు.

ఈ కార్యక్రమంలో జడ్పీ ఛైర్మన్‌ ముళ్లపూడి బాపిరాజు, రాష్ట్ర మంత్రులు కింజరాపు అచ్చన్నాయుడు, దేవినేని ఉమామహేశ్వరరావు, శిద్దా రాఘవరావు, సుజనా రంగారావు, ప్రభుత్వ విప్‌ చింతమనేని ప్రభాకర్‌, రాజ్యసభ సభ్యురాలు తోట సీతా రామలక్ష్మి, ఎంపీలు మాగంటి మురళీ మోహన్‌, కేసినేని నాని, ఎమ్మెల్యేలు పీతల సుజాత, బడేటి బుజ్జి, గన్ని వీరాంజనేయులు, మోడియం శ్రీనివాసరావు, పి.ఆంజనేయులు, బూరుగుపల్లి శేషారావు, ఎమ్మెల్సీ రాము సూర్యారావు, ఏలూరు నగర మేయర్‌ షేక్‌ నూర్జహన్‌ పెదబాబు, తాడేపల్లిగూడెం మునిసిపల్‌ ఛైర్మన్‌ బొలిశెట్టి శ్రీనివాస్‌, కాపు కార్పొరేషన్‌ ఛైర్మన్‌ కొత్తపల్లి సుబ్బారాయుడు, టిడిపి రాష్ట్ర కార్యదర్శి టీడీ జనార్ధనరావు, ఎమ్మెల్సీ షరీఫ్‌, ఎమ్మెల్యేలు వి.శివరామరాజు, అరిమిల్లి రాధాకృష్ణ, నిమ్మల రామానాయుడు, బండారు మాధవ నాయుడు, ముప్పిడి వెంకటేశ్వరరావు, రాష్ట్ర హస్త కళల అభివృద్ధి సంస్థ ఛైర్మన్‌ పాలి ప్రసాద్‌, ఆర్టీసీ ఛైర్మన్‌ వర్ల రామయ్య తదితరులు పాల్గొన్నారు.