కరీంనగర్: కరీంనగర్ జిల్లా తిమ్మపూర్ మండలం అల్గునూర్ శివారులోని తమిళకాలనీలొ రాజేష్ అనే ఉన్మాది వీరంగం సృష్టించాడు. రాజీవ్ రహదారి పక్కనే ఉన్న ఇంట్లో వివాహిత కవితపై స్థానిక కాలనీలో ఉంటున్న రాజేష్ కత్తితో దాడికి పాల్పడ్డాడు. అనంతరం రాజేశ్ కత్తితో గొంతు, కడుపు కొసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డం సంచలనం రేకెత్తించింది.

స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న తిమ్మాపూర్ పోలీసులు కేసు నమోదుచేసి గాయపడ్డ రాజేశ్, కవితను కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి అత్యవసర చికిత్స అందిస్తున్నారు. కాగా, ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

మరోవైపు, గంగాధర ప్రధాన కూడలిలో నడిరోడ్డున ఓ వ్యక్తిపై కారంపొడి చల్లి దాడి చేసిన సంఘటన కలకలం సృష్టించింది. పరిసర ప్రజలు దాడి చేస్తున్న వారిని అడ్డుకుని పోలీసులకు అప్పగించారు. బాధితుడు లక్ష్మీరాజం, ఏఎస్సై చంద్రారెడ్డి తెలిపిన వివరాల మేరకు, జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం నమిలకొండకు చెందిన తండ్రీ కొడుకులు చిలుముల మైసయ్య, లక్ష్మీరాజం మధ్య ఆస్తి తగాదాలు ఉన్నాయి.

ఆటోలో ప్రయాణికులను తీసుకుని కరీంనగర్‌ వెళ్తూ ఆటోను గంగాధరలో ఆపడంతో నలుగురు వ్యక్తులు కారంపొడి చల్లి దాడి చేశారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. మైసయ్యతోపాటు ఇసాక్, మారంపల్లి హైజాక్, సుశిత కలిసి దాడి చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. విచారణ జరుపుతున్నట్లు ఏఎస్సై చంద్రారెడ్డి చెప్పారు.