• ఐఎస్‌పీఏస్‌ జాతీయ అధ్యక్షునిగా ఆచార్య శ్రీనివాసరావు

విశాఖపట్నం: ఆంధ్రా యూనివర్సిటీకి మరో అరుదైన గౌరవం లభించింది. ఏయూ ఆచార్యుల్లో ఒకరు ఇండియన్‌ సొసైటీ ఫర్‌ ప్రోబబులిటీ అండ్‌ స్టాటస్టిక్స్‌ (ఐఎస్‌పీఏఎస్‌) జాతీయ అధ్యుక్షునిగా ఎన్నికయ్యారు. ఏయూ స్టాటస్టిక్స్‌ విభాగం సీనియర్‌ ఆచార్యులు కె. శ్రీనివాస రావు ఐఎస్‌పీఏఎస్‌ అధ్యక్ష పదవికి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు ఐఎస్‌పీఏఎస్‌ ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి ఆచార్య వి.హెచ్‌. బజాజ్‌ ఉత్తర్వులను ఆచార్య శ్రీనివాసరావుకు పంపారు.

జాతీయ స్థాయిలో స్టాటస్టిక్స్‌ నిఫుణుల సమాఖ్యగా ఐఎస్‌పీఏఏస్ నిలుస్తుంది. దేశవ్యాప్తంగా పరిశ్రమలు, పరిశోధన సంస్థలు, విశ్వవిద్యాలయాలలో పనిచేస్తున్న స్టాటస్టికల్‌ నిపుణులు ఐఎస్‌పీఏఏస్‌లో సభ్యులుగా ఉన్నారు. ఆచార్య కె.శ్రీనివాసరావు 2019 జనవరి 1వ తేదీన ఐఎస్‌పీఏఎస్‌ నూతన అధ్యక్షునిగా పదవీ బాధ్యతలను స్వీకరిస్తారు. రెండు సంవత్సరాలు ఆయన పదవిలో ఉంటారు.

ప్రతీ సంవత్సరం ఐఎస్‌పీఏఎస్‌ జాతీయ స్థాయిలో సదస్సులు నిర్వహించడం, స్టాటస్టిక్స్‌ను ప్రోత్సహించడం, ఐఎస్‌పీఏఎస్‌ జర్నల్స్‌ను ముద్రించడం జరుగుతుంది. వీటితో పాటు ప్రాజెక్టులు, కన్సల్టెన్సీలను నిర్వహిస్తారు.

ఆచార్య కె.శ్రీనివాస రావు ఏపీసెట్‌ మెంబర్‌ సెక్రటరీగా, ఏపీ ఆర్‌సెట్‌ కన్వీనర్‌గా సేవలు అందిస్తున్నారు. ఏయూకి నాక్‌ స్టీరింగ్‌ కమిటీ సభ్యునిగా, యూజీసీ సమన్వయకర్తగా, ఐఎస్‌ఓ సమన్వయకర్తగా, స్టాటస్టిక్స్‌ విభాగాధిపతిగా, బీవోఎస్‌ చైర్మన్‌గా, యూజీసీ డీఆర్‌ఎస్‌ శాప్‌ సమన్వయకర్తగా పనిచేశారు. ఆపరేషనల్‌ రీసెర్చ్‌ సొసైటీ ఆఫ్‌ ఇండియా ఉపాధ్యక్షునిగా సైతం సేవలు అందిస్తున్నారు.

ఐఎస్‌పీఎస్‌ చీఫ్‌ ఎడిటర్‌గా ఎనిమిది సంవత్సరాలు సేవలు అందించారు. ఓపీసెర్చ్‌కు, జర్నల్‌ ఆఫ్‌ స్టాటస్టిక్స్‌ అండ్‌ అప్లికేషన్స్‌కు అసోసియేట్‌ ఎడిటర్‌గా సేవలు అందించారు. ఆచార్య శ్రీనివాసరావు పర్యవేక్షణలో 47 మంది పరిశోధనలు జరిపి డాక్టరేట్‌లు అందుకున్నారు. 195 వివిష్ట పరిశోధన పత్రాలను జాతీయ, అంతర్జాతీయ జర్నల్స్‌లో ప్రచురించారు.

ఆచార్య శ్రీనివాసరావు డిస్టింగ్విష్డ్‌ స్టాటస్టీషియన్‌ అవార్డును అందుకున్నారు. ప్రతీ సంవత్సరం ఐఎస్‌పీఎస్‌ బెస్ట్‌ స్టాటస్టీషియన్‌ అవార్డును ఆచార్య సి.ఆర్‌. రావు పేరుతో, బెస్ట్‌ థీసిస్‌ అవార్డు, యంగ్‌ స్టాటస్టీషియన్‌ అవార్డు, డిస్టింగ్విష్డ్‌ స్టాస్టీషియన్‌ అవార్డులను అందిస్తుందన్నారు. డిసెంబర్‌ 27 నుంచి 30 వరకు జాతీయ సదస్సు హర్యానాలోని మీరట్‌లో జరుగుతుందన్నారు.