హైదరాబాద్: దూలపల్లి ఫారెస్ట్ అకాడెమీలో అటవీ శాఖ అర్ధ సంవత్సర పనితీరుపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. మూడు రోజుల పాటు జరిగే ఈ వర్క్ షాప్‌ను తెలంగాణ రాష్ట్ర ప్రధాన అటవీ సంరక్షణ అధికారి (పీసీసీఎఫ్) పీకే ఝా లాంఛనంగా ప్రారంభించారు.

తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల అటవీ అధికారులు, అరణ్య భవన్ ఉన్నతాధికారులు పాల్గొన్న ఈ వర్క్‌షాప్‌లో గత ఆరునెలల్లో సాధించిన పురోగతి, రానున్న ఆరు నెలల లక్ష్యాలపై ప్రధానంగా చర్చించారు. అటవీ శాఖ మెరుగైన పనితీరుకు నిర్దేశించుకున్న 14 అంశాలపై విభాగాల వారీగా సమీక్ష ఝా సమీక్ష నిర్వహించారు.

అటవీ సంరక్షణ, వన్య ప్రాణుల రక్షణ, వేటతో పాటు అటవీ భూముల ఆక్రమణల నియంత్రణ, అడవుల పునరుజ్జీవన చర్యలు, అర్బన్ పార్కులు, హరితహారం లక్ష్యాలు, గడ్డి భూముల పెంపకం, విద్యార్థులు, అటవీ అవగాహన, అటవీ సరిహద్దు ప్రాంతాల్లో ప్రజలతో సమన్వయం, అటవీ అగ్ని ప్రమాదాల నివారణ, ప్రాజెక్టులు, అటవీ భూములకు బదులుగా ప్రత్యామ్నాయ ప్రాంతాల్లో మొక్కల పెంపకం, అన్ని అటవీ ప్రాంతాల రక్షణకు కందకాలు, ఫెన్సింగ్ ఏర్పాటు తదితర కీలకాంశాలు ఈ సమీక్షలో ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.