కె.కామరాజ్‌గా ప్రసిద్ధి చెందిన కుమారస్వామి కామరాజ్‌ తమిళనాడుకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు. భారతరత్న పురస్కార గ్రహీత. ఇందిరాగాంధీని ప్రధానమంత్రి చెయ్యటంలో ఈయన పోషించిన పాత్రకు గాను భారత రాజకీయాలలో కింగ్‌మేకర్‌గా పేరొందాడు. ఆయన రూపొందించిన మాస్టర్‌ ప్లాన్‌తో జాతీయ స్థాయిలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అఖండ విజయంతో గెలుపొందింది.

అప్పటికే అనేక లుక లుకలతో ఉన్న జాతీయ కాంగ్రెస్‌ను ఒక్క తాటిపైకి తీసుకువచ్చి ఇందిరాగాంధీకి అత్యంత నమ్మకస్థుడిగా ఉన్న కామరాజ్‌ నాడార్‌ గొప్ప పోరాట యోధుడు. ప్రజల నుండి వచ్చి, పెద్దగా చదువుకోకున్నా ప్రజల జీవితాలను చదివారు కామరాజ్‌. నిరుపేద కల్లుగీత కుటుంబంలో పుట్టిన ఆయన ప్రజల కోసమే జీవితం అంకితం చేసి, పెళ్లి కూడా చేసుకోలేదు. ఆయన రాజకీయ శక్తిగా ఎదగడానికి కారణం చిన్నతనం నుండి రాజకీయాల పట్ల మక్కువ ఎక్కువగా ఉండడమే. 1929 నాటికే కామరాజ్‌ కాంగ్రెస్‌లో ప్రముఖ నాయకుడైన సత్యమూర్తికి సహచరుడిగా ఉండేవాడు.

ఆయన సత్యమూర్తిని రాజకీయ గురువుగా భావించేవాడు. అంతేకాకుండా ప్రముఖ సంఘ సేవకుడు నారాయణ గురు ప్రభావం కామరాజ్‌ పై ఉండేది. బ్రాహ్మణ వ్యతిరేక పోరాటంలో ముందు ఉన్నారు. తమిళనాట కల్లుగీత కులాలవారిని అంరాని జాతిగా చూసేవారు. గుడి, బడి, సామాజిక హోదా కోసం కామరాజ్‌ నాడార్‌ శక్తికొద్ది ఉద్యమాలు నడిపారు. అనతి కాలంలోనే కల్లుగీత, ఇతర అణగారిన కులాల నాయకుడిగా ఎదిగాడు. ఇదే సమయంలో సత్యమూర్తితో కాంగ్రెస్‌ పార్టీ తరపున రాష్టమ్రంతటా తిరగడం ద్వారా మంచి అనుభవం, పలుకుబడి కలిగిన వ్యక్తిగా రూపొందారు.

అనంతర కాలంలో తమిళనాడు కాంగ్రెస్‌లో గొప్ప శక్తిగా ఎదిగారు. 1930లో మహాత్మాగాంధీ చేపట్టిన ఉప్పు సత్యాగ్రహ ఉద్యమంలో క్రియాశీలకంగా పాల్గొన్నాడు. అనేక సందర్భాలలో దేశ స్వాతంత్య్ర ఉద్యమంలో 8 సంవత్సరాల పాటు జైలు శిక్ష అనుభవించాడు. 1931లో తమిళనాడు కాంగ్రెస్‌ పార్టీ శాఖ రాష్ట్ర అధ్యక్షుడయ్యాడు. 1937లో కాంగ్రెస్‌ అసెంబ్లీ నుండి పోటీ చేశాడు.

చారిత్రక విరూద్‌నగర్‌, శివకాశి వంటి ప్రాముఖ్యం కలిగిన ప్టణాలు ఉన్న ఈ నియోజకవర్గంలో కల్లుగీత కులస్థులైన నాడార్లు ఎక్కువగా జస్టిస్‌ పార్టీలోనే ఉండేవారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ పార్టీ నుండి కామరాజ్‌ ఏకగ్రీవంగా ఎన్నిక కావడం జాతీయ కాంగ్రెస్‌ నాయకుల దృష్టికి వచ్చింది. దీనితో ఆయన ఇందిరాగాంధీకి దగ్గరయ్యారు. అదే సమయంలో తమిళనాడులో పెద్ద ఎత్తున సామాజిక ఉద్యమాలు వెల్లువెత్తాయి. తమిళనాడు ముఖ్యమంత్రి రాజగోపాలాచారి బహుజన కులాలకు వ్యతిరేక చర్యలు తీసుకోవడంతో పెరియార్‌ రామస్వామి పెద్ద ఆందోళన చేపట్టాడు.

దానితో రాజగోపాలాచారి స్థానంలో కామరాజ్‌ నాడార్‌ ముఖ్యమంత్రి పదవిని అధిష్ఠించారు. ఈ అవకాశాన్ని ఆయన సద్వినియోగం చేసుకున్నాడు. నిరుపేద కుటుంబం నుండి వచ్చిన కామరాజ్‌కు సామాన్యుల సమస్యలు తెలుసు కాబట్టి, వారి బాగు కోసం శక్తి మేరకు కృషి చేశారు. విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో విప్లవాత్మకమైన మార్పులు తీసుకువచ్చారు. వెనుకబడిన కులాల జాబితాలోని అన్ని కులాలకు ఉద్యోగ, విద్యా రంగాల రిజర్వేషన్లలో, బడ్జెట్‌లో పెద్ద పీఠం వేయడం ఆయన కృషితోనే సాధ్యమయింది. 1954 నుండి 1963 వరకు కామరాజ్‌ నాడార్‌ తమిళనాడు ముఖ్యమంత్రిగా కొనసాగారు.

బ్రాహ్మణులతో సమానంగా పరిపాలన చేసిన కామరాజ్‌ నాడార్‌ తమిళనాడు రాజకీయ చరిత్రను తిరగ రాశారు. ఆ తర్వాత తమిళనాడులో అనేక సామాజిక కోణాల నుండి కొత్త రాజకీయ పార్టీలు పురుడు పోసుకున్నాయి. కామరాజ్‌ పరిపాలనను అన్ని వర్గాల వారు గౌరవించారు. ఆ తర్వాత కామరాజ్‌ నాడార్‌ 1969 నాటికి జాతీయ కాంగ్రెస్‌ రాజకీయాల్లో ప్రవేశించారు. జాతీయ కాంగ్రెస్‌ అత్యున్నత అధ్యక్ష బాధ్యతను కామరాజ్‌కు అప్పగించింది. ఇందిరా గాంధీని అఖండ మెజారిటీతో గెలిపించిన యోధుడు నాడార్‌. కామరాజ్‌ నాడార్‌ వంటి వ్యక్తులు పుట్టుకొచ్చిన ఈ దేశంలో నేటి రాజకీయ నాయకులకు అటువంటివారి అవసరం లేదనేలా రాజకీయాలు మారాయి. ఎన్‌ఆర్‌ఐలు, పారిశ్రామికవేత్తలు విదేశాల నుంచే తమ రాజకీయ ఎన్నికల స్థానాలను రిజర్వు చేసుకుంటున్నారు.

సామాన్యుడిని రాజకీయ శక్తిగా మలచే ప్రక్రియను ప్రారంభిస్తే ప్రజాస్వామ్యం పరిడవిల్లుతుంది. కాగా, భారత స్వాతంత్య్రోద్యమములో పాల్గొన్న కామరాజ్‌, భారత తొలి ప్రధాని జవహర్‌ లాల్‌ నెహ్రూకు అత్యంత సన్నిహితుడు. నెహ్రూ మరణము తర్వాత 1964లో లాల్‌ బహదూర్‌ శాస్త్రిని, ఆయన తర్వాత 1966లో ఇందిరా గాంధీని ప్రధాని చేయటంలో కామరాజ్‌ ప్రధానపాత్ర పోషించారు. ఈయన అనుయాయులు అభిమానంతో ఈయన్ను దక్షిణ గాంధీ, నల్ల గాంధీ అని పిలిచేవారు.

ఈయన సొంత రాష్ట్రమైన తమిళనాడులో 1957లో కామరాజ్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉచిత విద్యను, పాఠశాలలో ఉచిత మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రవేశపెట్టి అనేక లక్షలమంది గ్రామీణ పేదప్రజలకు విద్యావకాశం కల్పించినందుకు నేటికీ ప్రశంసలందుకున్నారు. 1976లో ఈయన మరణాంతరం భారత అత్యున్నత పౌర పురస్కారం భారతరత్నను అందుకున్నారు.